శిల్పారామం ప్రకటన గుర్తుందా.. | Yanamala Ramakrishnudu Shilparamam Revelation Remember | Sakshi
Sakshi News home page

శిల్పారామం ప్రకటన గుర్తుందా..

Published Sat, Mar 5 2016 9:07 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

శిల్పారామం ప్రకటన గుర్తుందా..

శిల్పారామం ప్రకటన గుర్తుందా..

పట్టిసీమపై పెదవి విప్పేనా?
కొల్లేరు కాంటూరు కుదింపుపై నోరు మెదిపేనా!
ఏలూరు శిల్పారామం గుర్తుకు తెచ్చేనా ?
లేక అధినేత ఉసిగొల్పితే ప్రతిపక్షాలపై రెచ్చిపోవడానికే పరిమితమవుతారా !
శాసనసభా సమావేశాల్లో మన ఎమ్మెల్యేల వ్యూహం ఏంటి?
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి తీసుకుచ్చేందుకు కీలకపాత్ర పోషించిన పశ్చిమగోదావరి జిల్లా రుణం తీర్చుకుంటా.. అన్ని స్థానాలూ గెలిపించిన ఈ జిల్లా తర్వాతే నాకు ఏదైనా సరే..’ అని జిల్లాకు వచ్చిన ప్రతిసారీ మొహమాటపడకుండా ఇదే ‘‘ముచ్చట’’ చెప్పే  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతవరకు జిల్లా ప్రగతి రూపురేఖలు మార్చే సమగ్ర కార్యాచరణే ప్రకటించలేదు. జిల్లా పర్యటనల్లో  ఆయన ప్రకటించిన చిన్నాచితకా ప్రాజెక్టులకే అతీగతీ లేకుండా పోయింది. ఇక గతేడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో  శాసనసభ సాక్షిగా చేసిన ప్రకటనలూ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా  ఎమ్మెల్యేలు జిల్లా సమస్యలను ప్రస్తావిస్తారా.. ప్రధానంగా జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను సభ దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారం దిశగా  కృషి చేస్తారా.. లేదంటే షరామామూలుగానే అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెప్పుపొందేందుకు ప్రతిపక్షాలపై నోరుపారేసుకుని రాద్ధాంతం చేస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
 పట్టిసీమ విపరిణామాలను ప్రస్తావించే ధైర్యం ఎవరికో?
 ఉభయగోదావరి జిల్లాల డెల్టా రైతాంగం భయపడినట్టే పట్టిసీమ ఎత్తిపోతల పథకం విపరిణామాలు తొలిఏడాదే తీవ్రంగా ప్రభావం చూపాయి. పట్టిసీమ నుంచి కేవలం నాలుగైదు మోటార్లతో గోదావరి నీళ్లను తోడి కృష్ణా డెల్టాకు ఎత్తిపోసిన ఫలితంగానే మునుపెన్నడూ లేనివిధంగా ఈ రబీ సీజన్‌లో డెల్టాలో సాగునీటి సంక్షోభం ఎదురైంది.  ఇక 24 మోటార్లు, 24పంపులతో పూర్తిస్థాయిలో గోదావరి నీటిని తోడేసి కృష్ణాకు తరలిస్తే గోదావరి డెల్టా భవితవ్యం ఏమవుతుందనే భయాందోళన పశ్చిమ రైతాంగం నుంచి వ్యక్తమవుతోంది. మార్చి నెలాఖరు నాటికి పట్టిసీమను పూర్తి చేసి వచ్చే సీజన్‌లో మళ్లీ నీటిని తరలించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి వరదల సీజన్‌లో సముద్రంలోకి పోయే వృథా జలాలను మాత్రమే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా గోదావరి ఎండిపోయేలా నీటిని తరలించుకుపోయింది.
 
  ఫలితంగా రబీ సీజన్‌లో సాగునీటి సంక్షోభం తలెత్తి మూడు నెలలు ముందుగానే సీలేరు జలాలపై రబీ సాగు ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో పట్టిసీమ దుష్ఫలితాలపై శాసనసభలో మాట్లాడే సాహసం ఏ ఎమ్మెల్యే చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పట్టిసీమ వల్లే ఈ సీజన్‌లో రబీ సాగుకు ఇబ్బంది ఎదురైందని గతంలో వ్యాఖ్యానించారు. జిల్లాలోని అందరి ప్రజాప్రతినిధుల్లో అదే అభ్రిపాయమున్నా.. అధినేత బాబు వద్ద చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ప్రస్తావించి పట్టిసీమ విపరిణామాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి.
 
 కొల్లేరుపై ఏం మాట్లాడతారో
  కొల్లేరు కాంటూరు కుదింపుపై ఎన్నికల ముందు చంద్రబాబు స్పష్టమైన హామీనిచ్చారు. కానీ ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో మొక్కుబడి తీర్మానం చేసి చేతులు దులుపుకున్న సర్కారు కాంటూరు కుదింపు దిశగా చర్యలు చేపట్టలేదు. కుదింపు ప్రక్రియ కేంద్రప్రభుత్వం పరిధిలో ఉందని చెబుతూ కాలయాపన చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి ఒప్పించాల్సిన బాధ్యతను విస్మరించింది. ఈ నేపథ్యంలో  కొల్లేరులో నిత్యం రావణకాష్టంలా రగులుతున్న కాాంటూరు సమస్యపై ఈసారైనా అసెంబ్లీ స్పష్టంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తుందా అనేది చూడాలి. ఇక ప్రభుత్వం కొల్లేటిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఇప్పటికి పలుమార్లు ప్రకటించింది. కానీ నిధులు మాత్రం కేటాయించలేదు.  కనీసం ఈ బడ్జెట్‌లోనైనా ఆ ప్రస్తావన తీసుకువస్తుందో లేదో చూడాలి.
 
 ఏడాదిన్నర కిందట అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలూ గాలికేనా?
 సరిగ్గా ఏడాదిన్నర కిందట కిందట జరిగిన శాసనసభ సమావేశాల్లో జిల్లాలో ఉద్యాన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నిట్ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తున్నందున, నిఫ్ట్ ఏలూరులోనూ ఏర్పాటయ్యే అవకాశముందని ప్రకటించారు. జిల్లాలో సిరామిక్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, భీమవరంలో ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలను స్థాపిస్తామని, జిల్లాలో లేస్ పార్కు ఏర్పాటుకు కూడా సిద్ధమని ప్రకటించారు. సాగు ప్రధాన జిల్లా కావడంతో నూనెశుద్ధి, కొబ్బరిపీచు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. నరసాపురం వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నెలకొల్పి, జల రవాణాను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. కానీ గత బడ్జెట్ సమావేశాల్లోనే ఎక్కడా వీటి ప్రస్తావన తీసుకు రాలేదు.
 
 ప్రకటన గుర్తుందా..
ఇక జిల్లా కేంద్రం ఏలూరులో శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి యనమల గతేడాది మార్చి బడ్జెట్‌లో  ప్రకటించారు. ఏలూరుతో సహా రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో శిల్పారామాలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన2015జూన్ నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. కానీ ఆ తర్వాత ఆ ఊసే ఎవ్వరూ పట్టించుకోలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement