'ఇది ఉగాది కాదు... దగాది'
రాజమహేంద్రవరం (రాజమండ్రి) : తెలుగు భాష అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే... ఇది ఉగాది కాదు, దగాది అని.. మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలేవి అమలుకు నోచుకోలేదని ఆయన ఆరోపించారు. శ్రీదుర్ముఖి నామ సంవత్సరం ఉగాది నేపథ్యంలో శుక్రవారం రాజమహేంద్రవరంలో మండుటెండలో తెలుగు భాష కోసం రెండు గంటలపాటు ఆయన ఆవేదన దీక్ష చేశారు.
అనంతరం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... అమరావతి రాజధాని సందర్భంగా శిలాఫలకాన్ని ఇంగ్లీషులో ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ను సైతం ఇంగ్లీషులోనే ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. పక్కనే ఉన్న తెలంగాణలో మాత్రం బడ్జెట్ను తెలుగులో ప్రవేశపెట్టారని తెలిపారు.
ఇది నిరసన కాదని... ఆవేదన మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. గతేడాది తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష అమలు కోసం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి అడుగు కూడా ముందుకు పడలేదన్న అన్నారు. కాగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్కి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మద్దతు తెలిపారు.