ముప్పుతిప్పలు పెట్టాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన యాసీన్ భత్కల్ దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ కేసు విచారణ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలతో పాటు పోలీసులు, జైళ్ళ శాఖ అధికారులకు చుక్కలు చూపించాడు. ఓసారి జేబులో ‘అనుమానాస్పద వస్తువుతో’, మరోసారి ఫోన్ కాల్‌తో హడలెత్తించాడు. యాసీన్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా భత్కల్‌లో 1983లో జన్మించాడు. అంజుమన్–హమి–ఇ–ముస్లమీన్ పాఠశాలలో ప్రాథమిక విద్యతో ప్రారంభమై... ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పుణేకు మాకాం మార్చిన యాసీన్... తనకు సోదరుడి వరుసయ్యే రియాజ్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్ళాడు. రియాజ్ దేశం విడిచి పారిపోయిన తర్వాత విధ్వంస రచనలో యాసీన్ కీలకంగా మారాడు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు కో–ఫౌండర్ బాధ్యతలు స్వీకరించి సౌత్ ఇండియా చీఫ్‌గా మారాడు. జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ పేలుళ్ళ తర్వాత ఇతడి పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 2013లో ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్టు చేసిన తర్వాత ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్ తరలించారు.
‘సినిమా’ చూపించాడు...
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ కేసు విచారణ...తొలుత ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలోనే జరిగింది. ఆ సమయంలో ఓసారి యాసీన్ భత్కల్ కోర్టుకు హాజరైనప్పుడు అతడి జేబులో ‘ఓ అనుమానాస్పద వస్తువు’ మీడియాకు చిక్కింది. ఆకారాన్ని బట్టి అది సెల్‌ఫోన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో మరోసారి అతడికి కోర్టుకు తీసుకువచ్చినప్పుడు దాన్ని బయటకు తీయించిన అధికారులు అదో పుస్తకంగా తేల్చారు. చర్లపల్లి జైలు నుంచి తన కుటుంబంతో ఫోల్‌లో మాట్లాడినట్లు, ఆ నేపథ్యంలోనే తాను ఐసిస్ ఉగ్రవాదుల సాయంతో తప్పించుకోనున్నట్లు చెప్పాడని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో కేసు విచారణ కోసం చర్లపల్లి జైలులోనే కోర్టు ఏర్పాటు చేయించిన అధికారులు విచారణ అక్కడకు మార్చారు. జైలులో ఉన్న యాసీన్ అనేక న్యాయ పుస్తకాలను అధ్యయనం చేశారని తెలుస్తోంది. వీటి ఆధారంగా ప్రాసిక్యూషన్ లాయర్లను ఎదురు ప్రశ్నించేవాడని సమాచారం. మరోపక్క టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ నేపథ్యంలోనే యాసీన్ తన హావభావాలతో అనేక మంది సాక్షుల్ని బెదిరించడానికి ప్రయత్నించాడని సమాచారం.
ఎవరు... ఎప్పుడు... ఎక్కడ చిక్కారంటే...
కేంద్ర నిఘా సంస్థ, ఢిల్లీ స్పెషల్ స్పెల్ అధికారులు సంయుక్తంగా నేపాల్‌లో చేసిన ఆపరేషన్‌లో 2013 ఆగస్టు 29న యాసీన్, అసదుల్లా అక్తర్ చిక్కారు. వీరిని బీహార్–నేపాల్ సరిహద్దుల్లోని రక్సెల్ ప్రాంతంలో అరెస్టు చూపించారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళు చోటు చేసుకున్నది, వీరిద్దరూ చిక్కింది గురువారమే కావడం యాధృచ్ఛికం. వీరిద్దరూ చిక్కడంతో దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ కేసు కొలిక్కివచ్చింది. విచారణలో తెహసీన్, వఖాస్‌ల పాత్ర పూర్తిస్థాయిలో నిర్థారణైంది. దీంతో వీరిద్దరిపై జాతీయ దర్యాప్తు సంస్థ 2013 సెప్టెంబర్ 24న రూ.10 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది.
సీన్, అసదుల్లా విచారణలోనే వఖాస్ భారత్‌లోనే ఉన్నాడని కర్నాటక, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రల్లో సంచరిస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. దీంతో పక్కా నిఘా ఉంచిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2014 మార్చి 23న ముంబై నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చేరుకున్న వఖాస్‌ను అక్కడి రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంలో జైపూర్, జోధ్‌పూర్‌ల్లో మరో ముగ్గురిని అరెస్టు చేసి భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇక అప్పటికి పరారీలో ఉన్న మోను ఆచూకీ కోసం అనేక సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి పరిణామాలను పరిశీలించిన నిఘా వర్గాలు మోను రాజస్థాన్‌కు చేరుకున్నట్లు గుర్తించాయి. అజ్మీర్‌లో గైడ్ ముసుగులో ఉంటున్న ఇతడిని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు 2014 మార్చి 25న పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో పట్టుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న ఎజాజ్ షేక్‌ను మహారాష్ట్రలో అరెస్టు చేశారు.