సాగర్‌ కాలువలో యువకుడి గల్లంతు | younger missing in sagar canal | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాలువలో యువకుడి గల్లంతు

Published Sun, Sep 4 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

younger missing in sagar canal

= క్షేమంగా బయటపడిన నలుగురు యువకులు
= చీమకుర్తి సమీపంలోని చీమలమర్రి సాగర్‌ కాలువలో ఘటన ..
= గుంటూరుకు కారులో వెళ్తూ మార్గమధ్యంలో ఈతకు దిగిన వైనం
= గల్లంతైన యువకుని కోసం సాగర్‌ పొడవునా గాలిస్తున్న గజ ఈతగాళ్లు
= అందరూ అనంతపురం జిల్లా తాడిపత్రి వాసులే


సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా) : అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఐదుగురు యువకుల్లో ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చీమలమర్రి సమీపంలోని సాగర్‌ కాలువలో గల్లంతయ్యాడు. తాడిపత్రికి చెందిన పోసా అరుణ్, పూల సురేశ్, గుత్తా రాకేశ్,కావేటి రామాంజనేయులు, నందికం హరి కలసి ఓ కారులో గుంటూరు బయల్దేరారు. శనివారం ఉదయం మార్గమధ్యంలోని చీమలమర్రి వద్ద గల సాగర్‌ కాలువ వద్దకు రాగానే కారు ఆపారు.

ఈత కోసం కాలువలోకి దిగారు. కొద్ది సేపటి తర్వాత నందికం హరి(19) కాలువలో గల్లంతై డ్రాప్‌లో పyì పోయాడు. కాపాడేందుకు అతని సొంత బావ కావేటి రామాంజనేయులు కూడా అందులోకి దూకారు. బామ్మర్ది కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. పైగా అతడు కూడా ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించి మిగిలిన ముగ్గురూ బయటకు వచ్చారు. వెంటనే ఓ బెల్ట్‌ సాయంతో రామాంజనేయులును అతికష్టమ్మీద బయటకు తీశారు.   

హృదయ విదారకం
డ్రాపులో హరి కొద్దిసేపు కొట్టుమిట్టాడుతుండటాన్ని తోటి స్నేహితులు చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఈత రాక రోడ్డున వెళ్లే ప్రతీ ఒక్కరినీ కాపాడాలంటూ వేడుకున్నారు. అయితే డ్రాప్‌లోకి దిగేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. బామ్మర్ది గల్లంతుపై బావ రామాంజనేయులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు తన భార్యకు ఏం సమాధానం చెప్పాలంటూ కుమిలిపోయారు.

చీమలమర్రి డ్రాప్‌ల వద్ద గాలింపు
చీమలమర్రి డ్రాప్‌ల నుంచి హరి దిగువకు కొట్టుకెళ్లినట్లు తెలుసుకున్న సీఐ మురళి, సంతనూతలపాడు ఎస్‌ఐ హుస్సేన్‌బాషా తమ సిబ్బందితో కలసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. రామతీర్థం జలాశయం వద్ద నీటి వేగాన్ని తగ్గించారు. సంతనూతలపాడు మండలం చండ్రపాలెం ఎన్‌ఎస్‌పీ కెనాల్‌ వద్ద గజ ఈతగాళ్లు హరి ఆచూకీ కోసం గాలించారు. రాత్రి పొద్దుపోయే వరకూ గాలించినా అతని ఆచూకీ దొరకలేదని సీఐ తెలిపారు. ఈతముక్కల మేజర్‌ వరకు వెతికిస్తున్నట్లు వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement