చైన్ స్నాచర్ ని బైక్‌తో ఢీకొట్టాడు..
అనంతపురం: మహిళ మెడలో గొలుసు తెంపుకుని పారిపోతున్న దుండగులను పట్టిచ్చిన యువకుడిని పోలీసులు ఘనంగా సన్మానించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఎం.పద్మావతి(48) సోమవారం మధ్యాహ్నం నడిచి వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో గొలుసును తెంపుకొని పోయారు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న గీతాప్రసాద్ అనే యువకుడు ఆమె కేకలు విని అప్రమత్తమయ్యాడు. దుండగుల బైక్‌ను తన బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో ఆగంతకులు పడిపోయారు.
వెంటనే చుట్టుపక్కల వారు వారిద్దరినీ పట్టుకుని, బంధించారు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నగరానికి చెందిన షేక్ సర్వర్ వలీ, మహ్మద్ అలీగా గుర్తించారు. గీతాప్రసాద్ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు.. యువకుడు గీతాప్రసాద్‌కు రూ.5 వేలు రివార్డుగా అందజేసి, ఘనంగా సత్కరించారు. జాతీయ అవార్డుకు గీతా ప్రసాద్ సాహసకృత్యాన్ని సిఫారసు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.