మేము అర్హులం కాదా!
హిరమండలం: యూత్ ప్యాకేజీకి మేము అర్హులమేనని, తక్షణమే మంజూరు చేయాలంటూ వంశధార నిర్వాసిత గ్రామం పాడలి యువకులు కోరారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్యకు గురువారం వినతిపత్రం ఇచ్చేందుకు యువకులు సమాయత్తమయ్యారు. ఆర్డీవో వీడియోకాన్ఫరెన్స్‌లో ఉన్నారని, కాసేపు ఆగాలంటూ స్థానిక రెవెన్యూ సిబ్బంది చెప్పారు. దీంతో కార్యాలయం ముందు బైఠాయించేందుకు యువకులు సిద్ధపడ్డారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ కె.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో కార్యాలయానికి చేరుకొని యువకులపై హల్‌చల్ చేశారు. తామేమి గోలచేసేందుకు ఇక్కడకు రాలేదని తమ గోడును విన్నవించుకొనేందుకు వచ్చామని యువకులు తెలిపారు. దీంతో తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్‌తో ఎస్‌ఐ మాట్లాడి యువతతో స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ య్యూత్ ప్యాకేజీ వస్తుందని హామీ ఇచ్చారు. అర్హులను గుర్తించామని వారికి ప్యాకేజీ అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.