వైఎస్ హయాంలో సంక్షేమ రాజ్యం
విభజన హామీలను కేంద్రం విస్మరించింది: దిగ్విజయ్ సింగ్
సాక్షి, విశాఖపట్నం: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఇళ్లు, పింఛన్లు, భూములు, రుణాలు, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేశారని ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. గురువారం విశాఖలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జయంతి నేపథ్యంలో ఆయన్ను తలుచుకుంటూ పైవిధంగా స్పందించారు. రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆరోజు టీడీపీతోపాటు ప్రధాన పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకరిస్తూ లేఖలిచ్చాయన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని కేంద్రం అమలు చేయట్లేదని, వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆగస్టు 6న రాహుల్‌గాంధీ విశాఖ ఏజెన్సీకి రానున్నారని, బాక్సైట్ ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించనున్నారని ఆయన తెలిపారు. భూసేకరణ, విభజన హామీలు, కాపు రిజర్వేషన్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.
ముంబైకి చెందిన వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్‌తో 2012లో వేదిక పంచుకోవడంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాల గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జకీర్ నాయక్ ఆహ్వానం మేరకు 2012లో ముంబై వెళ్లానని, మత సామరస్యానికి కట్టుబడి ఉంటానని ఆరోజు చెప్పిన మాటకు నేటికీ కట్టుబడి ఉన్నానని, తనపై ఎలాంటి విచారణనైనా జరిపించవచ్చని దిగ్విజయ్ అన్నారు. సమావేశంలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు.