'రుణమాఫీ ఒకేదశలో చేసిన నేత వైఎస్సార్'
కరీంనగర్ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన తొలివిడత పరామర్శయాత్ర గురువారం సాయంత్రం ముగిసింది. 3 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భాగంగా 6 నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించి 12 కుటుంబాలను పరామర్శించారు. జిల్లాలోని మల్లాపూర్ లో తుకారంగౌడ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రైతుల రుణమొత్తాలను ఒకేదశలో మాఫీ చేసిన ఘనత వైఎస్సార్దేనని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు మహానేత పెద్దపీట వేశారని, ప్రతి ఎకరాకు నీరిచ్చి అన్నపూర్ణ రాష్ట్రంగా చేసేందుకు వైఎస్సార్ కృషిచేశారని షర్మిల గుర్తుచేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పాలనలోనే 46 లక్షల ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్సార్ సొంతమన్నారు. వైఎస్సార్ బతికుంటే ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు, ఉచిత విద్య, రైతులకు 9 గంటలు కరెంట్ అందేదని అన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చుకునేందుకు చేయిచేయి కలిపి రాజన్న రాజ్యాన్ని సాధించుకుందామని షర్మిల పిలుపునిచ్చారు. మల్లాపూర్లో వెంకటేశం కుటుంబాన్ని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి, రూ. 5వేల ఆర్ధిక సాయం అందించారు.