రైతు బంధు వైఎస్సార్
కరీంనగర్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల
* ఆ మహానేత బతికి ఉంటే ఇంత మంది రైతుల ఆత్మహత్యలు చూసేవాళ్లమా?
* అన్నదాత అప్పులపాలు కావొద్దని వైఎస్ వేల కోట్ల రుణమాఫీ చేశారు
* ఎరువులు, విత్తనాల ధరలు తగ్గించి మద్దతు ధర పెంచారు
* వ్యవసాయాన్ని పండుగలా మార్చారు
* జిల్లాలో ముగిసిన తొలి దశ యాత్ర
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘ఆ వేళ మహా నాయకుడు తిరిగి వస్తారని లక్షలాది హృదయాలు ఆశగా ఎదురు చూశాయి.
కానీ మన దురదృష్టం.. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఆ ఒక్క నాయకుడు బతికి వస్తే ఈరోజు ఇంత మంది రైతుల ఆత్మహత్యలు చూసేవాళ్లమా..?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలు కావొద్దని వేల కోట్ల పంట రుణాలను వైఎస్ ఒకేసారి మాఫీ చేశారని గుర్తు చేశారు. వైఎస్ మరణంతో గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి షర్మిల గురువారం కరీంనగర్ జిల్లాలో మూడోరోజు పరామర్శ యాత్ర కొనసాగించారు.
ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను పరామర్శించారు. రామభద్రునిపల్లెలో కాచి బీరయ్య, గుంజపడుగులో తూర్పాటి రాజయ్య, చిన్నాపూర్‌లో కోరెపు నర్సయ్య, కోనాపూర్‌లో పంచాల బుచ్చమ్మ, మల్లాపూర్‌లో తుకారాం గౌడ్ కుటుంబాలను పరామర్శించారు. పెగడపల్లి మండలం నామాపూర్, మల్లాపూర్ మండలం ముత్యంపేటలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు.
ఇక్కడకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రతి రైతుకు అండగా నిలబడి భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్సార్ అని, అప్పుల ఊబిలో ఉన్న రైతన్నకు అండగా నిలిచేందుకు ఉచిత కరెంటు ఇచ్చారని, రైతులు బకాయి పడిన విద్యుత్ రుణాలను, పంట రుణాలను మాఫీ చేశారని పేర్కొన్నారు. రైతన్నకు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచాలనే ఆలోచనతో ఎరువులు, విత్తనాల ధరలు తగ్గిం చి, రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర పెంచారన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారని చెప్పారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేందుకు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
371 కి.మీ... 12 కుటుంబాలు
వరంగల్ జిల్లాలో యాత్రను ముగించుకొని కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల.. ఇక్కడ తొలిదశ యాత్రను ముగించారు. మూడు రోజుల పాటు జిల్లాలో 371 కిలోమీటర్లు పర్యటించిన షర్మిల 12 కుటుంబాలను ఓదార్చారు.
పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బీష్వ రవీందర్, డాక్టర్ నగేష్, బోయినపల్లి శ్రీనివాసరావు, సెగ్గం రాజేష్, అక్కినపెల్లి కుమార్, సందమల్ల నరేష్, గోవర్ధన శాస్త్రి, సింగిరెడ్డి ఇందిర, ప్రపుల్లారెడ్డి, బ్రహ్మానందారెడ్డి, షర్మిలా సంపత్, విలియం మునిగాల, ఎల్లాల సంతోష్‌రెడ్డి, జూలి, కట్ట శివ, సంధ్యారాణి, ఎస్.అజయ్ వర్మ, అయిలూరి వెంకటేశ్వర్లు, జగదీశ్వర్ గుప్తా, ఇమామ్ హుస్సేన్, లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు రాజమ్మ, పద్మ, శ్రీనివాస్, ఎస్‌కే ముస్తాక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.