అన్ని విధాలా ఆదుకుంటాం..
♦ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్ దోరేపల్లి శ్వేత
♦ 34వ డివిజన్ ప్రజలకు ఎంపీ పొంగులేటి హామీ
♦ వైఎస్‌ఆర్ సంక్షేమాన్ని చూసి ఓటేయండి
♦ ఎంపీ ల్యాడ్స్ నిధులతో రమణగుట్టకు రెండు బోర్లు
♦ పొంగులేటికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన స్థానికులు
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరంలోని వెనుకబడిన రమణగుట్ట ప్రాంతం అభివృద్ధికి శతవిధాలా ప్రయత్నిస్తానని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. 34వ డివిజన్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా డాక్టర్ దోరేపల్లి శ్వేతను ప్రకటించారు. ‘శ్వేత బాగా చదువుకుంది. ఆమె డాక్టర్. ఆమెను ఆదరిస్తే ప్రజల బాధలను అర్థం చేసుకొని పరిష్కరిస్తుంది. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించాలి’ అని పొంగులేటి కోరారు. నగరంలోని 34వ డివిజన్‌లో ఎంపీ గురువారం విస్తృతంగా పర్యటించారు. మామిళ్లగూడెం నుంచి రమణగుట్ట వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఆయనకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రమణగుట్టలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడారు. మాట తప్పని మడమ తిప్పని నేత వైఎస్‌ఆర్..ఆయన బాటలోనే వైఎస్‌ఆర్‌సీపీ నడుస్తోందన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో సొంతింటి కలను నిజం చేస్తూ ఇందిర మ్మ ఇళ్లు కట్టించారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రుణమాఫీ, ప్రాజెక్టుల నిర్మాణం వంటి పథకాలను ఎన్నింటినో అమలు చేశారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే డ బుల్ బెడ్‌రూం, దళితులకు భూ పంపిణీ వంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌లో 346 ఇళ్లు కట్టించి డబుల్‌బెడ్ రూం అంటే ఎలా అని ప్రశ్నించారు.
జిల్లాలో అర్హ్హతున్న దళితులు 16 మందేనా? అన్నారు. మాయ మాటలు చెప్పి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారపార్టీ విజయం సాధించాలని చూస్తోందని..ఆ యత్నాలను తిప్పికొట్టాలన్నారు. సీఎం కుర్చీపై ఆలోచన తప్ప కాంగ్రెస్‌కు ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదన్నారు. టీడీపీ తెలంగాణలో కనుమరుగవుతోందన్నారు. ఇటువంటి పార్టీలకు కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. వైఎస్‌ఆర్ సంక్షేమ ఫలాలు పొందాలన్నా.. డివిజన్ సమస్యలు పరిష్కారం కావాలన్నా విద్యావేత్త అయిన దోరేపల్లి శ్వేతను గెలిపించాలని కోరారు. రమణగుట్ట కాలనీలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఎంపీ ల్యాడ్స్ నిధులతో రెండు బోర్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
డివిజన్‌లో విస్తృత పర్యటన
డివిజన్ అభ్యర్థిని దోరేపల్లి శ్వేతతో కలిసి ఎంపీ పొంగులేటి విస్తృతంగా పర్యటించారు. స్థానికుల సమస్యలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పొంగులేటి వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, నియోజకవర్గ ఇన్‌చార్జి కూరాకుల నాగభూషణం, పాలేరు, వైరా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సాధు రమేష్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీను, పార్టీ జిల్లా కార్యాలయ ఇన్‌చార్జి వంటి కొమ్ము శ్రీనివాసరెడ్డి, నాయకులు వడ్డెబోయిన శ్రీను, రామయ్య, ఆరేపంపుల వీరభద్రం, ఆంజయ్య, వేముల సీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సమక్షంలో అనేక మంది వివిధ పార్టీలకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండవాలు కప్పి స్వాగతించారు.