త్యాగానికి ప్రతిఫలం ఇదేనా! | YSRCP leader Amarnath Reddy demand somasila issue | Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతిఫలం ఇదేనా!

Published Thu, Jun 29 2017 3:27 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

త్యాగానికి ప్రతిఫలం ఇదేనా! - Sakshi

త్యాగానికి ప్రతిఫలం ఇదేనా!

- వ్యవసాయానికి అధికారులు అడ్డుపడితే సహించేది లేదు
సోమశిల ముంపువాసులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, బోనస్‌ ఇవ్వాలి
ఉద్యోగావకాశాలు, పునరావాసం కల్పించాలి
పాదయాత్రలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి డిమాండ్‌
 
కడప కార్పొరేషన్‌: సోమశిల ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులను సాగు చేయనీయకుండా అడ్డుకోవడం దారుణమని, రైతుల త్యాగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రశ్నించారు. సోమశిల ముంపు వాసులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రాజీవ్‌ స్మృతివనం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సెంట్రల్‌ జైలు, వైఎస్‌ఆర్‌ సర్కిల్, మినీబైపాస్, అంబేడ్కర్‌ కూడలి మీదుగా కొత్త కలెక్టరేట్‌కు చేరింది. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించాలని రైతులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.

సోమశిల ప్రాజెక్టు కారణంగా 120 గ్రామాల్లోని 20వేల కుటుంబాల ప్రజలు ఆశ్రయం కోల్పోయి, పంటభూములను వదులుకొని నెల్లూరుకు సాగునీరు, చెన్నైకి తాగునీరు ఇచ్చారని తెలిపారు. ఇంతటి త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయలేదని, బోనస్‌ అసలే లేదన్నారు. ఎకరాకు రూ.2లక్షలివ్వాలని రైతులు అడిగితే దివంగత సీఎం వైఎస్సార్‌ రూ.2.50లక్షలు ఇచ్చారని, ఆయన ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జారీ చేసిన జీఓను ప్రస్తుత ప్రభుత్వం మూలనపడేసిందన్నారు. రైతులు తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఒక మహిళా అధికారిణి అడ్డుకుంటూ ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించడం దారుణమని మండిపడ్డారు. ఆమె వైఖరి మారకపోతే అలాంటి కేసులనే ఆమె కూడా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

ప్రభుత్వం పూర్తిగా పరిహారం అందించి, పునరావాసం కల్పించేవరకూ రైతులను వ్యవసాయం చేసుకోనివ్వాలని కోరారు. 78 టీఎంసీల సామర్థ్యంతో సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి జిల్లా రైతులు కన్నీళ్లు పెట్టుకొని భూములను త్యాగం చేశారన్నారు. అదే సోమశిల నీటిని ఒంటిమిట్ట, కడపలకు తాగునీటి కోసం 2 టీఎంసీలు తెచ్చుకుంటుంటే ప్రస్తుత టీడీపీ నేత సోమిరెడ్డి ఆనాడు నెల్లూరులో ధర్నా చేశారని గుర్తుచేశారు.  ప్రస్తుతం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కొనసాగుతున్న ఆ పెద్దమనిషి మనకు న్యాయం చేస్తారా... అని అయన అనుమానం వ్యక్తం చేశారు.

జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి మాట్లాడుతూ సోమశిల ముంపు బాధితుల సమస్యలను జిల్లా పరిషత్‌ సమావేశంలో చర్చించి, వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం, పునరావాసం అందించాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా ముంపుబాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పదిహేను రోజులుగా అటవీశాఖ అధికారులు రైతులను సాగు చేసుకోనివ్వకుండా కేసులు పెట్టడం దారుణమన్నారు.
 
కదంతొక్కిన శ్రేణులు, ముంపువాసులు
ముంపు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో పార్టీశ్రేణులు, ముంపువాసులు కదం తొక్కారు. లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రగా వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి బైపాస్‌ సర్కిల్‌లో జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బీ అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం బైపాస్‌లో ఉన్న దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటునుంచి అందరూ పాదయాత్రలో కలిసి నడిచి కొత్త కలెక్టరేట్‌ చేరుకున్నారు. అనంతరం ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ–2 శివారెడ్డికి అందజేశారు.
 
పోలవరం రైతులకు ఇచ్చిన పరిహారం తరహాలో ఇవ్వాలి:
పోలవరం ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి ప్రభుత్వం ఎకరాకు రూ.50లక్షల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, బోనస్‌ ఇచ్చిం ది. సోమశిల ముంపువాసులకు కూ డా అదే తరహా పరిహారం ఇవ్వాలి. రైతులు పంటలు పండించుకోకుండా అధికారులు అడ్డుపడటం దారుణం. సోమశిల ముంపువాసుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం.
– పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే
 
ఎకరాకు ఐదారు లక్షలు ఇవ్వడం అన్యాయం:
నష్టపరిహారం రాక ఐదేళ్లుగా ముంపువాసులు ఇబ్బందులు పడుతున్నా రు. భూములను సాగు చేసుకుందామంటే అధికారులు ఆటంకా లు కల్పిస్తున్నారు. సోమశిల ముంపువాసుల సమస్యలను ఎంపీ అవినాష్‌రెడ్డి కేంద్రమంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకుపోయారు. గండికోట ప్రాజెక్టు వల్ల మునకకు గురైన చౌటపల్లివాసులకు ఎకరాకు రూ.7లక్షలు ఇస్తే సోమశిల కింద భూములు కోల్పోయిన వారికి ఐదువేలు, పదివేలు ఇవ్వడం అన్యాయం.  
– కె. సురేష్‌బాబు, కడప మేయర్‌
 
రైతులంటే టీడీపీ ప్రభుత్వానికి అలుసు
సోమశిల కింద భూములు కోల్పోయి న వారికి నష్టరిహారం ఇవ్వాలని ఎన్‌టీఆర్‌ జీఓ ఇస్తే ఆయన తర్వాత సీఎం అయిన చంద్రబాబు దాన్ని పక్కనబెట్టారు. వైఎస్‌ఆర్‌ సీఎం అయ్యాకే ముంపువాసులకు నష్టపరిహారం అందించారు. బద్వేల్, రాజంపేట, పెనగలూరు రైతులు నెల్లూరుకు సాగునీరు, చెన్నైకి తాగునీరు ఇవ్వడానికి సహకరిస్తే, ప్రభుత్వం వారికి చిప్పచేతికిచ్చింది. 9900 ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులు నోటిఫై చేశారు. ఆ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆదుకుంటాం. 
– కొరముట్ల శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే
 
రైతులకు అన్యాయం
తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు 80శాతం మం ది రైతులకు నష్టపరిహారం ఇచ్చారు. మిగిలిన 20 శాతం మందికి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది. ఇంటికో ఉద్యోగం ఇచ్చేలా జారీ చేసిన జీవోను తుంగలో తొక్కారు. నష్టపరిహారం చెల్లించేవరకూ పంటలు పండించుకోనివ్వాలి. 
– ఎస్‌బి అంజద్‌బాషా, కడప ఎమ్మెల్యే 
 
ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలి
అన్ని ప్రాజెక్టులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేస్తున్నారు. సోమశిలకు మాత్రమే లేదు. రైతులు ఎకరాకు రూ.2లక్షలు కావాలంటే రూ.2.50లక్షలు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దే.  ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆయన జీఓ జారీ చేసి 82మందికి ఉద్యోగాలిచ్చారు. పూర్తి స్థాయిలో పరిహారం, బోనస్‌ ఇస్తేనే న్యాయం జరుగుతుంది. 
– ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ 

పారించుకొనేది నెల్లూరులో, తాగేది చెన్నైలో... నష్టపోయేది మేమా..!
సోమశిల ప్రాజెక్టు వల్ల నెల్లూరులో సాగునీరు పారించుకుంటున్నారు.  చెన్నైకి తాగునీరు అందిస్తున్నారు, వారికోసం మేము నష్టపోవాలా...! ఎకరాకు రూ.5వేలు చొప్పున అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చిన ప్రాజెక్టు సోమశిలే. అది కూడా పొలానికిస్తే ఇంటికివ్వలేదు, ఇంటికిస్తే పొలానికి ఇవ్వలేదు. 
– ఏ. రామక్రిష్ణారెడ్డి, అట్లూరు రైతు నాయకుడు 
 
పైర్లు పెట్టవద్దని అటవీ అధికారులు భయపెడుతున్నారు..
అక్రమార్కులు అడవులు, కొండలను ఆక్రమించి దున్నుతుంటే  ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకుంది. పేద ఎస్సీలు, బీసీలు పైర్లు పెట్టుకుంటుంటే మాత్రం ఫారెస్ట్‌ అధికారులు కేసులు పెడతామని భయపెడుతున్నారు. ఫారెస్ట్‌ అధికారులు పెంచిన సామాజిక అడవులను నరికితే పట్టించుకొనే వారు లేరుగానీ, రైతులు ఒకటి, అర ఎకరాల్లో పైరు పెట్టుకుంటే తప్పేంటి..?    
 – గోపిరెడ్డి, నందలూరు రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement