
చంద్రబాబు దగ్గర అడ్జెస్ట్ అవుదామని వచ్చా
'ఇప్పటివరకు నేను మూడు పార్టీలు మారాను. ఏ నాయకునితోనూ ఇమడలేకపోయాను. నా మాటతీరు వల్లే అలా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు దగ్గర అడ్జెస్ట్ అవుదామని వచ్చా..
విజయవాడ: 'ఇప్పటివరకు నేను మూడు పార్టీలు మారాను. ఏ నాయకునితోనూ ఇమడలేకపోయాను. నా మాటతీరు వల్లే అలా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు దగ్గర అడ్జెస్ట్ అవుదామని వచ్చా. ఇన్నాళ్లూ చంద్రబాబును విమర్శించింది వాస్తవమే. అయితే అవన్నీ సద్విమర్శలేనని గుర్తించాలి. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నిర్భయంగా చెబుతా. నిజానికి నేను ఎన్ని పార్టీలు మారినా ఇంట్లో ఎన్టీఆర్, చంద్రబాబుల ఫొటోలు తీయలేదు. పొద్దున్నే లేచాక ఆ రెండు ఫోటోలు చూశాకే నా దినచర్య మొదలవుతుంది' అంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తాను పార్టీ మారడాన్ని సమర్థించుకున్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోతుల టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నెహ్రూకు పచ్చ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నెహ్రూకు యనమల సెటైర్లు
టీడీపీలోకి చేరిక సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై నుంచే మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై సెటైర్లు వేశారు. 'ఈ రోజు నెహ్రూ మన పెళ్లికొడుకు. ఆయనతో వచ్చినవారంతా పెళ్లికొడుకులే. జ్యోతుల ఉన్న పార్టీ మునిగిపోతుందన్న ఆలోచన నుంచి బయటపడాలి. ఆయన మనసు విశాలంగా ఉన్నా మాట మాత్రం గొడవలా ఉంటుంది' అని యనమల వ్యాఖ్యానించారు. మంత్రి మాటలకు స్పందించిన నెహ్రూ మాట ఎలా ఉన్నా నిర్ణయాలు మాత్రం గట్టిగానే తీసుకుంటానని బదులిచ్చారు.
రాష్ట్రమంతా టీడీపీనే ఉండాలని..
జ్యోతుల నెహ్రూ చేరిక సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ విభజనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, అభివృద్ధి చేసుకునే క్రమంలో అందరినీ కలుపుకొనిపోవాలని నిర్ణయించుకున్నామని, అందుకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు.