ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో పూర్తి మద్దతు ప్రకటించిన చంద్రబాబు ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా ఆయన కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేరని వైఎస్సార్‌సీపీ కేంద్రపాలకమండలి సభ్యులు జూపూడి ప్రభాకరరావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 75శాతం మంది జనాభా సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని తెలిసినా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేశాయని విమర్శించారు. నాడు వైఎస్సార్ వదిలేయడం వల్లే చంద్రబాబు జైలుపాలు కాకుండా తప్పించుకున్నారని, కానీ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే జైలుకు వెళ్లక తప్పదనే ఉద్దేశంతోనే కుట్రపన్ని జగన్‌మోహన్‌రెడ్డిని జైలుపాలు చేశారన్నారు. రాష్ట్ర విభజన విషయంలో భారతదేశ పార్లమెంట్ ఎలా వ్యవహరిస్తుందో అంటూ అత్యంత ఆసక్తిగా విదేశాలు చూశాయని, కానీ వాటి అంచనాలకు భిన్నంగా రాష్ట్ర విభజన ప్రక్రియను విజయవంతం చేశామని చెప్పడం హాస్యాస్పందంగా ఉందని జూపూడి అన్నారు.
విభజనకు నాలుగు సార్లు లేఖ ఇచ్చిన చంద్రబాబు సీమాంధ్రలో ఏవిధంగా అడుగుపెట్టగలరన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి మిగిలిన ఏకైక మార్గం సొంత పార్టీ పెట్టుకోవడం ఒక్కటే అన్నారు. ఆయన పార్టీ పెట్టినా వైఎస్సార్‌సీపీకి ఎటువంటి నష్టం లేదని అన్నారు. సీమాంధ్రలోని 175 స్థానాల్లో 150 సీట్లను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కేవలం టీడీపీ, కిరణ్ కలిపి పాతిక సీట్లలోపే పరిమితమవుతారని ప్రస్తుత సర్వేలు వెల్లడిస్తున్నాయని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనే ఏకైక లక్ష్యంగా సోనియా గాంధీ వ్యవహరించారని విమర్శించారు. కుమ్మక్కైన మూడు పార్టీలను జనం ఏమాత్రం క్షమించే ప్రశ్నే లేదన్నారు.