వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు మతీన్
సాక్షి, సిటీబ్యూరో:మైనార్టీల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నిరంతరం తపించేవారని, ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా పనిచేద్దామని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు మతీన్ ముజ్దాది పిలుపునిచ్చారు. శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అజామ్ అలీ సారథ్యంలో మౌలాలికి చెందిన 300 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసేందుకు ఇప్పటి పాలకులపై ఒత్తిడి చేయాల్సి ఉందన్నారు.
అందుకోసం అందరం కలిసి పార్టీ అధినేత వైఎస్ జగన్ వెంట నడవాల్సి ఉందన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఈ సందర్భంగా మౌలాలికి చెందిన సయ్యద్ హయత్, ఎండీ షఫీ, సయ్యద్ జాఫర్, మహమ్మద్, పర్వేద్ హుస్సేన్, టి.రాము, ఎండీ ఆషీద్ అలీతోపాటు 300 యువకుకులకు మతీన్ పార్టీ కండువా కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి రిజ్వాన్, నాయకులు మాజీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ ఆశయ సాధన కోసం పనిచేద్దాం
Published Sun, Dec 11 2016 3:32 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement