ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన సీఎం చంద్రబాబునాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్‌సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.
గుంతకల్లు టౌన్ : ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన సీఎం చంద్రబాబునాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్‌సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు భయంతో ముఖ్యమంత్రి అటు కేంద్రం, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో లాలూచీపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆయన ఆరోపించారు. తాను జైలుకు పోకతప్పదని భావించిన బాబు తన తనయుడు లోకేష్‌ను మంత్రివర్గంలో తీసుకునే ఆలోచనలో ఉన్నారన్నారు.
స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని స్వయానా దేశ అత్యున్నత న్యాయస్థానం అక్షింతలు వేసినా బాబు మాత్రం తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యత సింగపూర్ కంపెనీలకు అప్పగించి రైతులిచ్చిన భూములతో రియల్ ఎస్టేట్ జాయింట్ వెంచర్ వ్యాపారానికి తెరలేపారన్నారు. ఈ అంతర్జాతీయ కుంభకోణంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. వేరుశనగ పంటలన్నీ 60 శాతం దెబ్బతిన్నాక రెయిన్‌గన్లు ఇస్తే ఏం ప్రయోజనమని ఆయన నిలదీశారు. వేరుశనగ పంట నష్టపోయిన రైతన్నలకు ఎకరాకు రూ.25 వేల పంటనష్ట పరిహారాన్ని చెల్లించాలని వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు గోపి, అహ్మద్ , మాజీ కౌన్సిలర్ సుంకప్ప, భాస్కర్ పాల్గొన్నారు.