ఎన్నిసార్లు చెప్పినా మారరా?
మచిలీపట్నం (చిలకలపూడి) : ‘ఎన్నిసార్లు చెప్పినా మారరా?.. కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప కోట్ల రూపాయలు వెచ్చించి బందరు ప్రభుత్వాస్పత్రిలో నిర్మించిన కొత్త భవనాన్ని వినియోగంలోకి తీసుకురారా?’ అని ఇంజినీరింగ్ అధికారులపై జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. తొలుత విద్య, వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన స్థాయి సంఘ సమావేశంలో చైర్‌పర్సన్ మాట్లాడుతూ గర్భిణుల కోసం ఆస్పత్రిలో నిర్మించిన భవనానికి త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల్లో బాలికల కోసం ప్రత్యేక శానిటరీ ఏర్పాట్లకు జిల్లా పరిషత్ ద్వారా నిధులు కేటాయిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్‌కు సంబంధించి విలువగల భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని జిల్లా పరిషత్ స్థలంలో రూ.5 కోట్లతో కన్వెన్షన్ హాలు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ తోట్లవల్లూరు మండలంలో ఉపాధి నిధులతో శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరారు.
జిల్లా పరిషత్ అతిథిగృహం కేటాయింపుపై సభ్యుల ఆవేదన
విజయవాడలోని జిల్లా పరిషత్ అతిథిగృహం గదుల కేటాయింపులో జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వెళ్లినప్పుడు జెడ్పీటీసీ సభ్యులకు గదుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్‌కు చెందిన అతిథిగృహంలో ఇతర శాఖల అధికారులకు కేటాయించటంపై అసహనం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ సభ్యులకే అతిథిగృహంలో గదులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్‌ను కోరారు. అనంతరం వైస్‌చైర్మన్ శాయన పుష్పావతి అధ్యక్షతన వ్యవసాయ స్థాయి సంఘ సమావేశం, బంటుమిల్లి జెడ్పీటీసీ సభ్యులు దాసరి కరుణజ్యోతి అధ్యక్షతన సాంఘిక సంక్షేమం స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో టి.దామోదరనాయుడు, జెడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.