సంపాదకీయం: వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఏ అంశాలు ఎజెండాలోకి వస్తాయో తేల్చుకోకుండానే ప్రధాన రాజకీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం కోసం తాపత్రయపడిపోతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌కు ఎదురుపడగల సమస్యలేమీ లేవు. ఆ పదవికి రాహుల్‌గాంధీ సరైన అభ్యర్థి అని ఈమధ్యే మరొక్కసారి ప్రకటించి ప్రధాని మన్మోహన్‌సింగ్ తన విధేయతను చాటుకున్నారు.
ఎటొచ్చీ బీజేపీకే ఎక్కడలేని కష్టాలూ వచ్చిపడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోగల పార్టీ బీజేపీయేనని సర్వేలన్నీ కోడై కూస్తున్నా ప్రధాని అభ్యర్థి గొడవ ఆ పార్టీ కాళ్లకు చుట్టుకుని ముందుకు కదలనివ్వడం లేదు. అలాగని ఆ పదవికి బీజేపీ అభ్యర్థి ఎవరన్న అంశంలో ఎవరికీ అనుమానాలు లేవు. ఆ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. అందుకు సంబంధించి లాంఛనప్రాయమైన ప్రకటన ఎప్పుడన్నదే సమస్య. నిరుడు డిసెంబర్‌లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా మూడోసారి పార్టీని విజయపథంవైపు నడిపించిన నరేంద్ర మోడీ ప్రధాని పదవిపై తనకున్న ఆశల్ని ప్రకటించుకున్నారు.
‘పార్టీ అధిష్టానం నా భుజస్కంధాలపై ఉంచే ఏ బాధ్యతనైనా కష్టపడి నిర్వర్తిస్తా’నని అప్పట్లో ప్రకటించారు. అటు తర్వాత దశల వారీగా ఆ ఆశల్ని అందరికీ మరింత తేటతెల్లం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ లోపలా, బయటా ఎన్ని నిరసన ధ్వనులు వినిపించినా ఆయన విననట్టే ప్రవర్తించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పార్టీప్రచార సారథిగా మోడీని మూడు నెలలక్రితం ప్రకటించిన నాడు అద్వానీ ఆగ్రహించి పార్టీ పదవులన్నిటికీ రాజీనామా చేసినా ఆయన మొర ఆలకించినవారే లేకపోయారు. తాను ప్రధాని పదవిని ఆశించడం తన రాజకీయ గురువు అద్వానీకి ద్రోహం చేసినట్టు అవుతుందేమోనన్న అనుమానం మోడీకి కలగలేదు. 2002లో గుజరాత్ నరమేథం సమయంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించడానికి అప్పటి ప్రధాని వాజపేయి ప్రయత్నించినప్పుడు ఆదుకున్నందుకైనా అద్వానీ గురించి ఆయన ఆలోచించలేదు. మోడీయే ప్రధాని అభ్యర్థి అయితే తాము కూటమిలో కలిసివుండలేమని జేడీ(యూ) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రకటించినా... తమ ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రుల్ని బర్తరఫ్ చేసినా మోడీ చలించలేదు. ఆ పార్టీ వె ళ్లిపోతే ఎలా అని మిగిలిన బీజేపీ నేతలు బెంగపడ్డారు తప్ప మోడీ ఏమీ జరగనట్టే ఉండిపోయారు.
కేంద్రంలో బీజేపీ అధికార పీఠానికి దూరమై దాదాపు పదేళ్లు కావస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రచార సారథ్యం స్వీకరించిన అద్వానీ ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు ఇవ్వలేకపోయారు. 2004 ఎన్నికల్లో 138 స్థానాలు గెల్చుకున్న బీజేపీ, 2009లో 116 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. అయినా ఆయన వెనక్కి తగ్గడంలేదు. 2014లో మరోసారి తనకు అవకాశమిస్తే పార్టీని విజయపథంలో నడిపించగలనని ఆయన నమ్ముతున్నారు. అయితే, అద్వానీ ప్రస్తుత స్థితికి ఈ గెలుపోటములొక్కటే కాదు...ఇతరేతర కారణాలు కూడా పనిచేశాయి. పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు మహ్మదాలీ జిన్నాను ‘సెక్యులరిస్టు’ అని పొగడటం ద్వారా అద్వానీ సంఘ్ పరివార్‌కు ఆగ్రహం తెప్పించారు. అప్పటి నుంచీ పార్టీలో అద్వానీ ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలైంది.
ఈ సంగతి తెలిసినా అనేక యుద్ధాల్లో ఆరితేరివున్న అద్వానీ చలించలేదు. ఎన్నడూ బయటపడలేదు. అయితే, అనుకోని రీతిలో తన శిష్యుడిగా ఉన్న వ్యక్తే అలాంటి ప్రత్యామ్నాయంగా అవతరించే సరికి ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఒకప్పుడు తనను ‘లోహ్‌పురుష్’గా, ‘అభినవ సర్దార్ పటేల్’గా అభివర్ణించినవారే ఇప్పుడు మోడీకి హారతులు పడుతుండటం ఆయనకు నచ్చలేదు. జూన్‌లో పార్టీ పదవులకు ఆయన చేసిన రాజీనామాలను తిరస్కరించిన పార్టీ అధినాయకత్వం... అప్పటినుంచీ చేసిందంతా మారిన పరిస్థితులకు అద్వానీని మానసికంగా సిద్ధపరచడమే. అయితే, ఆ కృషిలో అది బొత్తిగా విజయం సాధించలేకపోయిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్నంతా పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ మోడీ విషయంలో ఆయనను ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుత అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అద్వానీతో బుధవారం అరగంటసేపు సమావేశమైనా ఉపయోగం లేకపోయింది.
నవంబర్‌లో జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే బీజేపీ తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించింది. ఆ ఎన్నికల్లో గెలుపు చేతికందితే, వచ్చే లోక్‌సభ ఎన్నికలపై దాని ప్రభావం పడి తనకు రాగలవనుకుంటున్న స్థానాలను మరింతగా పెంచుకోవచ్చని ఆశిస్తోంది. అందుకే, నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఈ వారంరోజుల వ్యవధిలో ఎప్పుడో ఒకప్పుడు ప్రకటించాలని భావిస్తోంది. మోడీని వ్యతిరేకిస్తూ వస్తున్న అద్వానీ ఈసారి వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని కాకుండా... అందుకు ఎంచుకున్న సమయాన్ని అద్వానీ ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందైతే అది వికటించినా వికటించవచ్చన్నది ఆయన వాదన.
ప్రధాని అభ్యర్థిత్వం లోక్‌సభ ఎన్నికల అంశంగానే ఉండాలి తప్ప అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దాని ప్రస్తావన ఎందుకని అద్వానీ అభిప్రాయం. పార్టీ పార్లమెంటరీ బోర్డులో మోడీ అభ్యర్థిత్వంపై చర్చ జరిగి, అద్వానీ, సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషిలు గట్టిగా వ్యతిరేకిస్తే బీజేపీకి మొదటికే మోసం వస్తుంది. అందుకే దాని ప్రమేయంలేకుండా... చేయదల్చుకున్నది ఎలా చేయాలన్నదే పార్టీ, సంఘ్ పరివార్ ముందున్న ప్రశ్న. దేశాన్నేలుతున్న యూపీఏను చావు దెబ్బ తీయడానికి వ్యూహాలను అల్లవలసిన సమయంలో బీజేపీ తన శక్తియుక్తులను అద్వానీ రూపంలో అంతర్గతంగా తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించడానికి వెచ్చించవలసి వస్తున్నది. దీన్నుంచి ఆ పార్టీ ఎలా బయటపడుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.
‘కొరకరాని కొయ్య’ అద్వానీ!
Published Thu, Sep 12 2013 12:11 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement