డీఎన్‌ఏ బిల్లుతో బహుపరాక్ | becareful with DNA bill set to be launched | Sakshi
Sakshi News home page

డీఎన్‌ఏ బిల్లుతో బహుపరాక్

Published Mon, Aug 3 2015 12:19 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

మానవ డీఎన్‌ఏ నమూనాలను సేకరించడానికీ, భద్రపరచడానికీ వీలు కల్పించే కీలకమైన బిల్లు తయారైంది. బహుశా వర్షాకాల సమావేశాలు సక్రమంగా సాగితే ఈపాటికే అది పార్లమెంటు ముందుకొచ్చేది.

మానవ డీఎన్‌ఏ నమూనాలను సేకరించడానికీ, భద్రపరచడానికీ వీలు కల్పించే కీలకమైన బిల్లు తయారైంది. బహుశా వర్షాకాల సమావేశాలు సక్రమంగా సాగితే ఈపాటికే అది పార్లమెంటు ముందుకొచ్చేది. డీఎన్‌ఏ(డీ ఆక్సీరైబో న్యూక్లిక్ ఆసిడ్) పరీక్షల విషయంలో అందరికీ అపారమైన విశ్వాసం ఉంటుంది. అవి సందేహాతీతం గా దేనినైనా నిరూపించగలవన్న నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా నేరాలు జరిగిన ప్పుడు, వారసత్వం, బంధుత్వం, వ్యక్తుల గుర్తింపు వగైరా అంశాలను నిర్ధారించడా నికి డీఎన్‌ఏను మించింది లేదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. సశాస్త్రీయమైన దర్యాప్తునూ, సంప్రదాయక సాక్ష్యాలనూ కాదని కేవలం ఇలాంటి సాంకేతికాంశాల పైన ఆధారపడటం సరైంది కాదన్న వాదన కూడా ఎప్పటినుంచో ఉంది. అందుకు మద్దతుగా ఇజ్రాయెల్ శాస్త్రవేత్త ఒకరు 2009లో ఒక అనుమానిత వ్యక్తి డీఎన్‌ఏ నమూనాను పోలిన డీఎన్‌ఏను కృత్రిమంగా రూపొందించి అందరినీ ఆశ్చర్యపరి చాడు. దాదాపు అన్ని దేశాల్లోనూ 1988 ప్రాంతంనుంచి డీఎన్‌ఏ నమూనాల సేకరణ మొదలైంది. దాదాపు 60 దేశాలు నేరస్తుల డీఎన్‌ఏ డేటా బ్యాంకులను నిర్వహిస్తున్నాయి. మన దేశంలో న్యాయస్థానాలు కూడా డీఎన్‌ఏ పరీక్షల ఆధారం గా చేస్తున్న నేర నిర్ధారణలనూ, ఇతర అంశాలనూ 1985 నుంచీ ఆమోదిస్తున్నాయి.
 
 డీఎన్‌ఏ పరీక్షల విషయంలో ఒక నియంత్రణ వ్యవస్థ ఉండాలన్న వాదనతో విభేదించేవారెవరూ ఉండరు. రెండు దశాబ్దాలుగా దేశంలో డీఎన్‌ఏ పరీక్షలు, వాటి ఆధారంగా కేసుల నిర్ధారణ కొనసాగుతున్నా దానికి ఒక చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదు. దీనిపై ఒక చట్టం ఉండాలని 2003లో ఆనాటి ఎన్డీయే ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది. బిల్లు ముసాయిదా కూడా తయారైంది. నిపుణుల కమిటీని నియమించి ఆ బిల్లుకు తదనంతరకాలంలో ఎన్నో మార్పులు చేశారు. అయితే, ఇన్నేళ్లుగా ఈ బిల్లులోని అంశాలపైనా, అది చట్టమైతే ఉండే పర్యవసానాలపైనా ప్రజల్లో తగినంత చర్చ జరగలేదు. ఇటీవల ఆధార్ కార్యక్రమంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కు కాదని వాదించారు. ఈ నేపథ్యంలో డీఎన్‌ఏ బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచనలుండే అవకాశముందో వేరే చెప్పన వసరం లేదు. నేర స్థలంలో సేకరించే జన్యుపరమైన నమూనాల సేకరణ, వాటి పరీక్షలపైనే కాక ఈ బిల్లు డీఎన్‌ఏ డేటా బ్యాంకుకు కూడా వీలు కల్పిస్తున్నది గనుక, అందులో పౌరులకు సంబంధించిన అనేక అంశాలు  ఇమిడి ఉంటాయి గనుక దానిపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది.


 ఈ బిల్లు జాతీయ స్థాయి డేటా బ్యాంకు ఏర్పాటుకు వీలు కల్పిస్తోంది. దీనికి అనుబంధంగా రాష్ట్ర స్థాయి, ప్రాంతీయ స్థాయి డేటా బ్యాంకులు పనిచేస్తాయి. వీటి పర్యవేక్షణకు జాతీయ బోర్డు ఒకటుంటుంది. ప్రతి డేటా బ్యాంకులోనూ ఆరు క్యాటగిరీలకింద డీఎన్‌ఏ డేటాను నిక్షిప్తం చేస్తారు. ఇవి- నేర స్థలంలో సేకరించేవి, అనుమానితులకు సంబంధించినవీ, నేరస్తులకు సంబంధించినవీ, ఆచూకీ తెలియ నివారికి సంబంధించినవీ, గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించినవీ, స్వ చ్ఛందంగా ఇచ్చే నమూనాలు. భవిష్యత్తులో ప్రభుత్వాలు అవసరమనుకుంటే ఈ వర్గీకరణ ఇంకా పెరగనూవచ్చు.
 
 
 చూడటానికి ఇందులో తప్పేమిటని అనిపించవ చ్చుగానీ ఇది అనేక కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అసలు నేరస్తులనుంచి డీఎన్‌ఏ సేకరణ స్వచ్ఛందంగా జరుగుతుందా లేక వారిపై బలవంతంగా దాన్ని అమలు చేస్తారా? వారు స్వచ్ఛందంగా ఇస్తారనుకున్నా...ఒకసారి నేరం చేసినవారు జీవి తాంతం నేరస్తులుగానే ఉంటారన్న సిద్ధాంతాన్ని ఇది బలపర్చడం లేదా? ఇది బ్రిటిష్ వలసపాలకులు కొన్ని జాతులను నేరస్త జాతులుగా గుర్తించినట్టుగా లేదా? ఇక అనుమానితుల పేరిట ఎవరి డీఎన్‌ఏనైనా సేకరించడానికి బిల్లు ఆస్కారం కల్పి స్తోంది. ఇది భవిష్యత్తులో అత్యంత వివాదాస్పదమయ్యే క్లాజు. జరిగిన నేరంతో సంబంధం ఉండవచ్చునన్న సాకు చూపి పోలీసులు ఎవరి డీఎన్‌ఏనైనా సేకరించ డానికి ఇది వీలు కల్పిస్తోంది. అలాగే డీఎన్‌ఏ విశ్లేషణకు రక్తమిచ్చేవారినుంచి తీసుకునే అంగీకార పత్రంలో వారి పేరు, ఇతర అంశాలతోపాటు వారి కులం వివరాలను సేకరించేలా రూపొందించారు. కుల, మత విద్వేషాలు తరచుగా రగుల్కొనే మన దేశంలో ఇది ఎలాంటి దుష్పరిణామాలకు దారితీయగలదో వేరే చెప్పనవసరం లేదు. ఈ బిల్లుపై ఏర్పరిచిన నిపుణుల కమిటీలో ఉన్న ఉషా రామనాథన్, సునీల్ అబ్రహాంవంటివారు లేవనెత్తిన అభ్యంతరాలను చాలామటు కు బుట్టదాఖలు చేశారని వారు చెబుతున్న అంశాలనుబట్టి తెలుస్తోంది. ఈ డేటా బ్యాంకుల నిర్వహణ, వాటి పనితీరు పర్యవేక్షణ అంశాలకోసం నెలకొల్పే బోర్డు విషయంలోనే ఆ ఇద్దరూ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. డీఎన్‌ఏ ఫలితాలను తారుమారు చేసిన సందర్భాల్లో నిర్దోషులు అన్యాయంగా బలైపోయే అవకాశం... అసలు నిందితులు తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అందుకు కారకులైనవారికి విధించే శిక్షలేమిటో బిల్లులో పొందు పర్చలేదు. అనుద్దేశపూర్వకంగా, మానవ తప్పిదం కారణంగా తారుమారైన పక్షంలో... వాటి ఆధారంగా అమాయకులకు శిక్షలు పడిన సందర్భంలో అందుకు కారకులపై ఉండే చర్యలేమిటో చెప్పలేదు. బాధ్యతనూ, జవాబుదారీతనాన్నీ నిర్దేశించని ఏ చట్టమైనా ఆచరణలో చట్టుబండలే అవుతుంది. ఈ బిల్లు చట్టమైతే డీఎన్‌ఏ నమూనాల సాయంతో నేరస్తుల గుర్తింపు, వారిని శిక్షించడం సులభమవు తుందని... నేరాలు తగ్గుముఖం పడతాయని ఆశించడం తప్పేమీ కాదు. కానీ... ఇప్పటికే ఇలాంటి డేటా బ్యాంకుల్ని నిర్వహిస్తున్న దేశాలు ఈ కృషిలో ఎంతవరకూ సఫలీకృతమయ్యాయో ఒక్కసారి అధ్యయనం చేయడం ఉత్తమం. లేనట్టయితే అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా పౌరుల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది. వారి హక్కులకు భంగం కలుగుతుంది. పాలకులు దీన్ని గుర్తించాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement