అంతర్మథన పర్వం
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక గెలిచిన పక్షం ఎటూ ప్రభుత్వం ఏర్పాటుపైనా, పదవుల పంపకంపైనా దృష్టి పెడుతుంది. ఆశావహులను ఎలా బుజ్జగించాలో... మిత్రులకు ఎలా సర్దిచెప్పాలో తెలియక నేతలు సతమతమవుతారు. ఇటు-ఓడిన పార్టీ అంతర్మథనంలో పడుతుంది. అంచనాలకూ, ఫలితాలకూ మధ్య ఎక్కడ దారి తప్పామో తెలియక సతమతమవుతుంది. వెల్లువలా వచ్చిపడే సలహాల్లో, విశ్లేషణల్లో పనికొచ్చే ముక్క కోసం గాలిస్తుంది. సంస్కరణల ఎజెండానుంచి పక్కకు తప్పుకోవద్దుసుమా అంటూ ఇప్పటికే ఇంగ్లిష్ మీడియా హెచ్చరించింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్దేశించుకున్న విధానాన్ని ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలనుబట్టి మార్చుకోవాల్సిన అవసరం లేదని హితవు చెప్పింది. దాంతోపాటు పడిలేచిన స్టాక్ మార్కెట్‌లలో మదుపుదార్ల భయాందోళనల జాడ కూడా పసిగట్టారేమో...కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారంనాడు 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలు సడలిస్తున్నట్టు ప్రకటించారు. 49 శాతం మొదలుకొని 100 శాతం వరకూ ఎఫ్‌డీఐలకు అనుమతినివ్వబోతున్నట్టు ఆయన తెలిపారు.
ఇదంతా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. ఇటు బీజేపీ, ఆరెస్సెస్‌లు కూడా అంతర్మథనాన్ని ప్రారంభించాయి. ఫలితాలు వెలువడ్డాక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్‌ను కలిశారు. ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్య కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికే బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఒకరు అన్నారు. భాగవత్ వ్యాఖ్యానాల అంతరార్థాన్ని వివరించడంలో పార్టీ విఫలమైందన్నది ఆరెస్సెస్‌కు సంబంధించినవారి జవాబు. తుది దశ పోలింగ్‌కు ముందు రోజు ఆరెస్సెస్ ఒక ట్వీట్ ద్వారా తానే భాగవత్ వ్యాఖ్యలపై వివరణనిచ్చింది. రిజర్వేషన్లు తొలగించాలని ఆరెస్సెస్ మోదీ సర్కారుకు సూచించిందంటూ మహా కూటమి కరపత్రాల ద్వారా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నదన్నది ఆ ట్వీట్ సారాంశం. మహా కూటమి అధికారంలోకొస్తే ఓబీసీ కోటాను ముస్లింలకు పంచుతుందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో చెప్పిన మాటను విశ్వసించకుండా...కూటమి కరపత్రాలనే జనం ఎందుకు నమ్మారో ఆరెస్సెస్ ఆలోచించుకోవాలి.
బాధ్యతారహిత ప్రకటనలవల్లే బిహార్‌లో ఓటమి సంభవించిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం చెప్పిన మాట గనుక ఆ అంశంపై గట్టిగానే చర్చ జరిగిందనుకోవాలి. కానీ అలా బాధ్యతారహిత ప్రకటనలు చేసినవారి జాబితాలో ఎవరెవరున్నారో తెలిస్తే తప్ప ఈ చర్చ ఆత్మ విమర్శగా సాగిందా లేక వేరేవారిపై నెపం వేసే దిశగా సాగిందా అన్న సంగతి తెలియదు. ఎందుకంటే అలాంటి ప్రకటనలు చేసినవారు పార్టీలో కిందినుంచి పై వరకూ ఉన్నారు. వాటివల్ల బీజేపీకి రావలసిన సీట్లు కొన్ని పోయిన మాట వాస్తవమే అయినా...దేశంలోని సామరస్య వాతావరణానికి అంతకన్నా ఎక్కువ నష్టం జరిగిందన్నది నిజం. ఎందుకంటే అలా వ్యాఖ్యానించినవారిలో నరేంద్రమోదీ, అమిత్ షా మొదలుకొని విజయ్ వరిగియా, సాధ్వీ ప్రాచీ వరకూ ఎందరో ఉన్నారు. హేతువాద భావాలను ప్రచారం చేసే మేథావుల ప్రాణాలు తీయడంనుంచి...దాద్రీలో గొడ్డు మాంసం తిన్నారంటూ ఒక కుటుంబంపై దాడిచేసి ఆ ఇంటి పెద్దను హతమార్చడం వరకూ చోటు చేసుకున్న అనేక ఘటనల విషయంలో వివిధ నేతలు చేసిన వ్యాఖ్యానాలు సరిగా ఆలోచించే పౌరులందరినీ కలవరపరిచాయి.
దేశంలో ఏర్పడిన వైషమ్య వాతావరణంపై ఆందోళన కనబరుస్తూ సాహిత్య అకాడెమీ అవార్డుల్ని తిరిగి ఇచ్చేసిన రచయితలు, కళాకారులు, కవులు, శాస్త్రవేతలు, చరిత్రకారులను బీజేపీ నేతలంతా ఏమని విమర్శించారో, వారిపై ఎలాంటి ఆరోపణలు చేశారో ఎవరూ మరిచిపోరు. వారిలో తాను కూడా ఉన్న సంగతిని అరుణ్ జైట్లీ గుర్తుంచుకోవాలి. నేరాలకు పాల్పడేవారికీ, నోరు జారేవారికీ మధ్య తేడా చూడాలని జైట్లీ చెబుతున్నారు. నేరంతో నేరుగా ప్రమేయం లేకపోవచ్చుగానీ అలాంటి స్వభావం లేకుండా ఆ మాటలొస్తాయా? ఇప్పుడు బిహార్‌లో నష్టం జరిగింది గనుక అవన్నీ ‘బాధ్యతారహిత ప్రకటనల’ని పార్టీ గుర్తించిందిగానీ వేరే రకమైన ఫలితాలొస్తే కనీసం ఈ మాత్రమైనా ఆలోచించేవారా? ఇకనుంచి ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాల విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేయకుండా ఆచితూచి వ్యవహరించాలని అమిత్ షాకు భాగవత్ సూచించారని అంటున్నారు. కానీ ఇలాంటి అంతర్మథనం జరుపుకుని 24 గంటలు గడవక ముందే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు జరపడాన్ని నిరసిస్తూ బీజేపీ, వీహెచ్‌పీలు ఆందోళన చేపట్టడం, హింస చోటుచేసుకోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
ఎప్పటినుంచో నరేంద్ర మోదీపైనా, అమిత్ షా పైనా గుర్రుగా ఉన్న అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్‌సిన్హా, అరుణ్ శౌరి తదితర నేతలు కూడా విడిగా మంగళవారం సమావేశమై తీవ్ర పదజాలంతో వారిని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల ఓటమి సమయంలోనే ఇలాంటి ఆలోచన చేసినా మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో పార్టీ విజయం తర్వాత వారంతా తగ్గి ఉన్నారు. సహజంగానే బిహార్ ఓటమి వారికి అందివచ్చింది. అయితే వారి ఉద్దేశాల మాట అటుంచి ఆ నేతల తర్కం మాత్రం కొట్టిపారేయదగ్గది కాదు. బిహార్ ఎన్నికల ప్రచారానికి సారథ్యంవహించినవారే ఓటమిపై సమీక్షించుకుని ఏదో ఒక నిర్ణయానికి రావడం సరికాదన్న వారి వాదనలో పస ఉంది. విజయం సాధిస్తే సొంతం చేసుకునేవారు ఓటమికి ఎందుకు బాధ్యతవహించరన్న వారి ప్రశ్న సహేతుకమైనదే. మరో ఏడాది వ్యవధిలో మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీలో ప్రస్తుతం సాగుతున్న అంతర్మథనం అప్పటికైనా పరిస్థితిని మెరుగుపరుస్తుందేమో చూడాలి.