నిత్యమూ నెత్తుటి చరిత్రను రచిస్తున్న రోడ్డు ప్రమాదాల గురించి ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీ మంచి పని చేశారు. ఉగ్రవాదాన్ని మించిన పెను రక్కసిగా మారిన రోడ్డు ప్రమాదాల గురించి అవసరమైనంతగా చర్చ జరగడం లేదు.
నిత్యమూ నెత్తుటి చరిత్రను రచిస్తున్న రోడ్డు ప్రమాదాల గురించి ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీ మంచి పని చేశారు. ఉగ్రవాదాన్ని మించిన పెను రక్కసిగా మారిన రోడ్డు ప్రమాదాల గురించి అవసరమైనంతగా చర్చ జరగడం లేదు. ఉన్నత స్థానాల్లోనివారు ఇలాంటి సమస్యలను ప్రస్తావిస్తే వాటిపై అందరి దృష్టీ పడుతుంది. వాటి పరిష్కారానికి ఒక దోవ దొరుకుతుంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే దుర్మరణం పాలైనప్పుడు రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణమే సమగ్రమైన చట్టం తీసుకురావాలని కేంద్రం భావించింది. నెలరోజుల్లోనే ఆ పని చేస్తామని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఏడాదిన్నర కావస్తుండగా త్వరలోనే బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్టు తాజాగా మోదీ తెలిపారు.
మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడాన్ని గమనించాక నిరుడు సుప్రీంకోర్టు జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ మొన్న ఫిబ్రవరిలో సమర్పించిన నివేదిక చూస్తే రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కళ్లకు కడుతుంది. దేశంలో కేరళ, యూపీ, నాగాలాండ్ మినహా మరే రాష్ట్రమూ రహదారి భద్రతా విధానాన్ని రూపొందించుకోలేదని కమిటీ తెలిపింది. డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీలో, భద్రతకు సంబంధించిన నిబంధనలను అమలుపర్చడంలో ప్రభుత్వాలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని చెప్పింది.
రహదారి భద్రతకు సంబంధించి ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రభుత్వాలు శాశ్వతమైన, శాస్త్రీయమైన వ్యవస్థ ఏర్పర్చుకోలేదని వివరించింది. ప్రమాదాల్లో గాయపడినవారిని తరలించేందుకు అంబులెన్స్‌లుగానీ, వారికి సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన కేంద్రాలు గానీ లేవని తేల్చింది. ప్రమాదం జరిగినప్పుడు తొలి గంటలో చికిత్స ప్రారంభిస్తే 50 శాతం మరణాలను నివారించవచ్చునని వైద్యులు చెప్పినట్టు 201వ లా కమిషన్ నివేదిక తెలిపింది. ఇలాంటి సమయాల్లో బాధితులను వెనువెంటనే సమీపంలోని ఆస్పత్రులకు చేర్చడానికి కూడా చాలామంది భయపడతారు. పోలీసులు అనుమానితులుగా చూస్తారని, కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుందని వెనుకంజ వేస్తారు. ప్రమాదాల సమాచారం చేరేయడానికి 1033 నంబర్‌తో ఫోన్‌లైన్ ప్రారంభించబోతున్నట్టు ప్రధాని చెప్పారు. ఇలాంటి సమయాల్లో సాయపడేవారికి వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటామని, ఆస్పత్రులు సైతం వెనువెంటనే చికిత్స ప్రారంభించేలా నగదు రహిత వైద్యానికి వీలుకల్పిస్తామని ప్రధాని ఇచ్చిన హామీ గాయపడినవారి ప్రాణాలను కాపాడటానికి వీలు కలిగిస్తుంది.
‘మన్ కీ బాత్’లో నరేంద్రమోదీ వెల్లడించిన గణాంకాలు విస్తుగొలుపుతాయి. మన దేశంలో ప్రతి నిమిషమూ ఒక రోడ్డు ప్రమాదం, ప్రతి నాలుగు నిమిషాలకూ ఒక మరణమూ సంభవిస్తున్నాయని ఆ గణాంకాలు చెబుతున్నాయి. రోజుకూ దాదాపు 380మంది మరణిస్తుంటే అందులో 16మంది పిల్లలు. 2013లో రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 1,37,000మంది మరణించగా... నిరుడు ఆ సంఖ్య 1,45,526కు చేరుకుంది.
మొత్తంగా ఇలాంటి ప్రమాదాల్లో మృతుల సంఖ్య 3 శాతం పెరిగింది. ఇదే సమయంలో గాయపడినవారి సంఖ్య 4,80,000! వీరిలో అత్యధికులు జీవితాంతం వికలాంగులుగా వెళ్లదీస్తున్నారు. గడపదాటి బయటకెళ్లి పనిచేయలేని స్థితికి చేరుకుని ఉపాధి కోల్పోతున్నారు. పర్యవసానంగా ఆ కుటుంబాలన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రమాదాల్లో అధికభాగం ద్విచక్ర వాహనాలవల్లనే జరుగుతున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలు వివరిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలోనూ, తెలంగాణ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నాయని బ్యూరో తెలిపింది. సాధారణంగా గణాంకాలు సమస్య తీవ్రతను తెలియజెబుతాయి. సమస్యకు గల కారణాలేమిటో తెలుసుకోవడం ప్రభుత్వాల బాధ్యత.
మన దేశంలో కార్ల మార్కెట్ పెను వేగంతో పెరుగుతున్నది. ఏటా 20 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడవుతాయని ఒక అంచనా. నిరుడు కోటీ 40 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయని వాహన తయారీదారులు చెబుతున్నారు. ఏటా వెల్లువలా వచ్చిపడుతున్న ఈ వాహనాలవల్ల ఒక చోటునుంచి మరో చోటుకు వెళ్లడం ఒక సాహసయాత్రలా మారుతోంది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వాలు అసమర్థంగా నడపడంవల్ల కావొచ్చు...వాహనాలు సమకూర్చుకోవడం తేలికవడంవల్ల కావొచ్చు ప్రతి నెలా వేలాది వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. బ్యాంకుల్లో రైతులకు పంట రుణాలు రావడం సమస్య కావొచ్చుగానీ...వాహన కొనుగోళ్లకు మాత్రం రుణాలు సులభంగా దొరుకుతాయి. అసలు వాహనాల డిజైన్, వాటి నిర్మాణం ఇక్కడి రోడ్లకు అనుగుణంగా ఉంటున్నాయా...లేదా, ప్రమాదాలు జరిగితే అవి తట్టుకునే స్థితిలో ఉంటాయా అనే సంగతిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. బ్రిటన్‌లోని ఒక సంస్థ వివిధ బ్రాండ్ల కార్లపై భద్రతా పరీక్షలు నిర్వహించినప్పుడు ఓ మాదిరి ప్రమాదాలను తట్టుకోగల స్థితిలో కూడా అవి లేవని వెల్లడైంది. అలాంటి బ్రాండ్లన్నీ మన మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.
ఇక రోడ్ల డిజైన్‌గానీ, వాటి నిర్మాణంగానీ పాదచారులుంటారన్న సంగతినే విస్మరించినట్టు కనబడతాయి. కనీసం సైకిళ్లకు కూడా అందులో చోటుండదు. కొత్తగా తీసుకొస్తున్న రహదారి భద్రతా బిల్లు వాహనాల డిజైన్ మొదలుకొని వాటి నిర్వహణ వరకూ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, వాహనాలకు ‘క్రాష్ టెస్టుల’ నిర్వహణ తప్పనిసరి చేస్తాయని చెబుతున్నారు. దీంతోపాటు రోడ్ల నిర్మాణం, నిర్వహణపైనా గురిపెడతారని అంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి విషయంలో కఠినంగా వ్యవహరించేలా నిబంధనలున్నాయని ఆమధ్య గడ్కరీ వివరించారు. అయితే ఇవి మాత్రమే సరిపోవు. ప్రభుత్వాలు తమ వంతుగా చేయ వలసినవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు, రోడ్ల సక్రమ నిర్వహణ, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు ఎంతో అవసరం. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులుంటే, అవి సమయానికొస్తుంటే వాహనాల జోలికి వెళ్లేవారుండరు. దిద్దుబాటు చర్యలు తమతో ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని పాలకులు గుర్తించాలి.