కొన్ని అంశాలపై జరిగే చర్చలు ఊహించని మలుపు తిరుగుతాయి. అనుద్దేశిత లక్ష్యంవైపు సాగుతాయి. అంతవరకూ ఎజెండాలో లేని కొత్త విషయాలను వెలుగు లోకి తెస్తాయి. ఆధార్ కార్డు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ముందు దాదాపుగా పూర్తయిన విచారణలో ఇప్పుడు అలాంటి పరిణామమే చోటుచేసుకుంది. చడీ చప్పుడూ లేకుండా, చట్టపరమైన ప్రాతిపదిక లేకుండా జన జీవితాల్లోకి తొమ్మిదేళ్ల క్రితం ప్రవేశించిన ఆధార్ కార్డు సంగతిని తేల్చడానికి సర్వోన్నత న్యాయస్థానం సమాయత్తం కాగా... అసలు గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కు కాదని వాదించి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అందరినీ నివ్వెరపరిచారు.
ఆధార్ కార్డు జారీ చేయడం కోసం సేకరించే వేలిముద్రలు, ఐరిస్ గుర్తింపు వగైరాలన్నీ పౌరుల గోప్యతను దెబ్బతీస్తాయని, ఇది ప్రాథమిక హక్కులకు భంగకరమని దాఖలైన పిటిషన్లపై ముకుల్ రోహత్గీ ఈ వాదన చేశారు. పౌర స్వేచ్ఛలో గోప్యత భాగం కానప్పుడు అసలు ఆ స్వేచ్ఛకు అర్ధమేమిటని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వం లోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. పౌరుల జీవించే హక్కుకూ, స్వేచ్ఛకూ పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ లోనే గోప్యతగా ఉండే హక్కు అంతర్లీనంగా ఉన్నదని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యక్తం చేసిన అభిప్రాయం ఎన్నదగ్గది. గోప్యత ప్రాథమిక హక్కు కాదనడం ద్వారా ఆధార్ కార్డు కోసం పౌరులనుంచి బయోమెట్రిక్ డేటాను సేకరించడంలో హక్కుల ఉల్లంఘన జరగలేదని, పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడలేదని కేంద్ర ప్రభు త్వం చెప్పదల్చుకున్నదని స్పష్టమవుతోంది.
ఈ కేసులో ధర్మాసనం ఏం తీర్పునిస్తుందో ఇంకా వేచి చూడాల్సి ఉన్నా రోహత్గీ చేసిన వాదనలోని మూలాలను ఒకసారి పరిశీలించాలి. 1954లో ఒకసారి, 1964లో ఒకసారి విస్తృత ధర్మాసనాలు గోప్యత ప్రాథమిక హక్కు కాదని తీర్పులి చ్చాయని ఆయన చెప్పారు. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కని 1970 తర్వాత వెలువరించిన తీర్పులన్నీ ఇద్దరూ లేదా ముగ్గురు న్యాయమూర్తులుండే ధర్మాసనా లే ఇచ్చాయని రోహత్గీ వాదన. కనుక ఈ గోప్యత అంశాన్ని మరో విస్తృత ధర్మాస నానికి అప్పగించాలన్నది ఆయన సూచన. వాస్తవానికి 1954లో గోప్యతకు సంబం ధించి ఎనిమిదిమంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు సందర్భం వేరు. ఇంట్లో సోదాలు నిర్వహించి, విలువైన పత్రాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవ డాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తీర్పునిస్తూ గోప్యత ప్రాథమిక హక్కు కాదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. 1964నాటి కేసు కూడా ఇలాంటిదే. తన ఇంటికి తరచు పోలీసులు రావడం, తన గురించి చుట్టుపక్కల అందరినీ అడిగి తెలుసుకోవడంవల్ల గోప్యతకు భంగం కలుగుతున్నదని, 21వ అధిక రణ ప్రకారం ఇది హక్కుల ఉల్లంఘనవుతుందని యూపీకి చెందిన ఖరక్‌సింగ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.
అయితే దీన్ని తోసిపుచ్చిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గోప్యత అనేది ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం చెప్పలేదని తీర్పునిచ్చింది. ఈ రెండు సందర్భాలూ నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు సంబంధించిన కేసులు. సాధా రణ పౌరులకుండే హక్కుల గురించి, వాటికుండే రాజ్యాంగబద్ధత గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భంలో రోహత్గీ ఈ కేసులను ప్రస్తావించారు. మన రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక హక్కులు తిరుగులేనివేమీ కాదు. వాటికి సహేతుకమైన పరిమితులున్నాయి. అలాగే... విస్తృత ధర్మాసనాలే చెప్పినా ఆ తీర్పులు సమీక్షకు అతీతమైనవి కాదు. మారిన కాలమాన పరిస్థితులు కొత్త ఆలోచనలకు తావిస్తాయి. మన అవగాహననే మారుస్తాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పిన భాష్యం ఆ రాజ్యాం గాన్ని మరింత సమున్నతం చేసింది.
నిజానికి ఆధార్ కార్డు వ్యవహారంలో సేకరించే బయోమెట్రిక్ డేటా అన్యుల చేతుల్లో పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ఆ డేటాను భద్రపరిచే సర్వర్లు దుర్భేద్యమైనవని కేంద్రం చెప్పగలిగి ఉంటే వేరుగా ఉండేది. ఆ విషయం లో ప్రభుత్వానికే అంత నమ్మకం లేకపోవడం వల్ల కావొచ్చు.... అలాంటి డేటా తీసుకోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందన్న వాదన మొద లెట్టింది. మరో విధంగా చెప్పాలంటే ఆధార్ ఉంటే తప్ప దిక్కూ మొక్కూ లేని స్థితిలో పడే పౌరులకు రాజ్యాంగపరంగా ఎలాంటి హ క్కూ ఉండబోదని చెప్పినట్ట యింది. ఒక సమస్యనుంచి బయటపడటం కోసం కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద సమస్యను ముందుకు తెచ్చింది. ఆధార్‌ను పోలిన కార్యక్రమాలను లోగడ అమెరి కా, బ్రిటన్‌లు కూడా చేపట్టాయి.
‘నో టు ఐడీ’ పేరిట బ్రిటన్‌లో ఆరేళ్లపాటు సాగిన ఉద్యమం ఫలించి అంతవరకూ సేకరించిన పౌరుల డేటాను ధ్వంసం చేస్తున్నట్టు 2010లో కామెరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా సైతం ఈ విషయంలో కొన్ని పరిమితులు విధించుకుంది. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయి, ఎంతో భద్రమైనవనుకున్న అమెరికా రక్షణ శాఖ సర్వర్లలోకి సైతం చొరబడి డేటాను తస్క రించే పరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ఆధార్ పేరిట సేకరిస్తున్న డేటాకు సమకూర్చిన రక్షణలేమిటో కేంద్రం చెప్పగలిగితే బాగుండేది. విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయడం మొదలుకొని రైతుల రుణమాఫీ వరకూ అన్నిం టికీ ఆధార్ కార్డే మూలమని మన ప్రభుత్వాలు ఊదరగొడుతున్న తీరు ఎంతో ప్రమాదకరమైనది. ఆధార్ లేకపోతే ఇకపై ఊపిరి తీసుకోవడం కూడా కష్టమని అనుకునేంతగా ఈ ప్రచారం సాగుతున్నది. దాన్ని మొదలు పెట్టినప్పుడు ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ దాన్నొక గుర్తింపు కార్డుగా మాత్రమే చెప్పారని గుర్తుంచు కుంటే ఇప్పుడు ప్రభుత్వాలు పెడుతున్న ఆంక్షలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
రోహత్గీ అంటున్నట్టు గోప్యత అనే హక్కు రాజ్యాంగ అధికరణల్లో అంతర్లీనం గా అయినా లేకపోతే దాన్ని కల్పించాల్సిన నైతిక బాధ్యత పాలకులకు ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆధార్ కార్డు కోసం సేకరించే డేటా దుర్వినియోగమయ్యే పక్షంలో కారకులపై తీసుకునే చర్యలేమిటో...పౌరుల గోప్యతకు అధికారంలో ఉన్న వారినుంచిగానీ, ప్రైవేటు వ్యక్తులనుంచి గానీ ముప్పువాటిల్లిన సందర్భాల్లో స్వీయ రక్షణకు రాజ్యాంగపరంగా పౌరులకుండే వెసులుబాటేమిటో స్పష్టత చేకూరు తుంది. ఆ తర్వాతే ఆధార్ అయినా, మరొకటైనా అమలు కావాలి.
గోప్యత హక్కు కాదా?!
Published Sat, Aug 8 2015 12:15 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement