ఎటు చూసినా నిరాశా నిస్పృహలు అలుముకున్నప్పుడు, నిజ వేతనాలు పడిపోయి పౌరులు నానా కష్టాల్లో కూరుకుపోయినప్పుడు, అవినీతి రివాజుగా మారినప్పుడు, అరాచకం తాండవించిన ప్పుడు ఎక్కడైనా ఏమవుతుందో మెక్సికోలో కూడా అదే అయింది. రెండు దశాబ్దాలుగా రెండు పార్టీల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడానికి అలవాటుపడిన మెక్సికో పౌరులు ఈసారి అధ్యక్ష ఎన్ని కల్లో కొత్తగా ఆవిర్భవించిన మూడో పార్టీకి పట్టంగట్టి యధాతథ స్థితిని బద్దలుకొట్టారు. ఆదివారం దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వామపక్ష మొరెనా పార్టీ అభ్యర్థి ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్(ఆమ్లో) 53 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆబ్రడార్ ఎన్నికయ్యారని ప్రకటించిన వెంటనే పొరుగు దేశమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆయన్ను అభినందించినా వారిద్దరి మధ్య సంబంధాలు ఉప్పు–నిప్పులాగే ఉంటాయని, ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేయడానికి ట్రంప్ మార్గాలు వెదకటం ఖాయమని వారిద్దరి సంగతీ తెలిసిన రాజకీయ విశ్లేషకులు అంచనా.
ఆబ్ర డార్‌కు ‘మెక్సికో ట్రంప్’ అన్న పేరుంది. అలాగని ఇద్దరి సిద్ధాంతాలకూ పొంతన లేదు. కానీ అమల్లో ఉన్న వ్యవస్థను తూర్పారబట్టడంలో, ప్రత్యర్థులను చీల్చిచెండాటంలో, ప్రభుత్వ విధా నాలపై ఓటర్లలో ఉన్న ఆగ్రహాన్ని పసిగట్టి దానికి తగినట్టు మాట్లాడటంలో ఇద్దరూ ఒకటే. అయితే సిద్ధాంతరీత్యా ఆబ్రడార్ వామపక్షవాది గనుక అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి త్వానికి డెమొక్రటిక్ పార్టీలో హిల్లరీతో పోటీపడిన వామపక్షవాది బెర్నీ శాండర్స్‌తో ఆయన్ను పోల్చవచ్చు.
అధ్యక్ష భవనంలో ఆబ్రడార్ ప్రవేశం అమెరికాకు మింగుడుపడనిది. కానీ చిత్రంగా ట్రంప్ విధానాలే అందుకు కారణమయ్యాయి. ఒకపక్క మెక్సికో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్‌డీఐ) అమెరికా వాటాయే అత్యధికమైనా, అమెరికాకు అది మూడో పెద్ద వాణిజ్య భాగస్వామి అయినా ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు సరే... తర్వాత కూడా మెక్సికో పౌరులను తరచు కించ పరుస్తూ మాట్లాడారు. వారు అమెరికాను కొల్లగొడుతున్నట్టు ప్రచారం చేశారు. మెక్సికోతో ఉన్న సరిహద్దుల పొడవునా గోడ కడతామని, అందుకయ్యే ఖర్చంతా ఆ దేశమే భరించాలని చెప్పారు. అమెరికాకు చట్టవిరుద్ధ వలసలు మెక్సికో నుంచే అధికంగా ఉంటాయన్నది నిజమే అయినా, వారంతా పొట్టకూటి కోసమే వస్తున్నారు. చిన్నా చితకా పనులు చేసుకుని ఎదగడమే వారి ధ్యేయం.
మెక్సికోలో పెట్టుబడులు పెట్టి ఏటా భారీయెత్తున లాభాలు గడిస్తున్న అమెరికా పెట్టుబడిదారుల్లా వారేమీ నిలువుదోపిడీకి దిగలేదు. మెక్సికో నుంచి మాదకద్రవ్యాలు వచ్చిపడుతుండటం అమెరి కాకు సమస్య అయితే... అమెరికా నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించే మారణాయుధాలు మెక్సికోకు ప్రాణాంతకమవుతున్నాయి. వాటి సాయంతోనే మాదకద్రవ్య ముఠాలు విచ్చలవిడిగా కిడ్నాప్‌లకూ, హత్యలకూ పాల్పడుతున్నాయి. నిరుడు ఆ దేశంలో 30,000 హత్యలు జరిగాయి. సెనేట్‌కూ, దిగువ సభకూ ఎన్నికలు ప్రకటించాక 50మంది అభ్యర్థులతోసహా 130మంది నేతల్ని చంపేశారు. బెదిరింపుల పర్యవసానంగా 600మంది పోటీ నుంచి తప్పుకున్నారు. ట్రంప్ అధ్య క్షుడు కాకముందు మెక్సికో పౌరుల్లో అత్యధికులకు అమెరికా అంటే వల్లమాలిన అభిమానం. కానీ ట్రంప్ నిత్య దూషణలతో అది కాస్తా ఆవిరైంది. అదే సమయంలో ట్రంప్‌కు దీటుగా, ఘాటుగా జవాబిచ్చిన ఆబ్రడార్‌ను మెక్సికో పౌరులు ఆదరించారు.
మెక్సికో అనేక సమస్యలతో అట్టుడుకుతోంది. అక్కడ పౌరులను మాయం చేయడం నిత్య కృత్యం. ఈ ‘అదృశ్యాలకు’ అటు భద్రతా బలగాలు– ఇటు మాదకద్రవ్య ముఠాలు కారణమే. గత దశాబ్దకాలంలో 32,000మంది పౌరులు ఆచూకీ లేకుండా పోయారు. అపహరణలపై కేసులు, అరెస్టులు రివాజు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ కేసుల అతీగతీ ఉండదు. అప్పుడప్పుడు శవాల దిబ్బలు బయటపడుతుంటాయి. వాటిని తవ్వి డీఎన్‌ఏ పరీక్షలు జరిపి అదృశ్యమైన వ్యక్తులు చని పోయారని ధ్రువీకరించడం తప్ప ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. వీటికితోడు మెక్సికోతో 1994లో కుదిరిన ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా)ను తిరగదోడతానని ట్రంప్ ప్రక టించడంతో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది.
అనేక అమెరికా సంస్థలు ట్రంప్ విధానాల పర్యవసానంగా అయోమయంలో పడ్డాయి. చిత్రమేమంటే ఆబ్రడార్ కూడా నాఫ్టాకు తొలినుంచీ వ్యతిరేకి. అది దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపణ. అమల్లో ఉన్న ఒప్పందం వల్ల అమెరికాకు అన్యాయం జరిగిందని వాపోయే ట్రంప్ ఒకపక్కా... దీనివల్ల మెక్సికో ప్రజలు నష్ట పోయారని వాదించే ఆబ్రడార్ మరోపక్కా ఉంటే ఇరు దేశాల మధ్యా కొత్త వాణిజ్య ఒప్పందం సంగతలా ఉంచి, అసలు ఎలాంటి ఒప్పందమైనా సాధ్యమేనా అని చాలామంది సందేహం. ఆబ్ర డార్ విజయం ఇప్పుడు అమెరికా పెట్టుబడిదారులను, మెక్సికో వాణిజ్యవేత్తలను కూడా భయ పెడుతోంది. అయితే పాలనకు ఆబ్రడార్ పూర్తిగా కొత్త వ్యక్తేమీ కాదు. ఆయన 1976 నుంచి రాజకీయాల్లో ఉన్నారు.
మెక్సికో మేయర్‌గా పనిచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణ దశలో ఉండగా, అవినీతి, నేరాలు అడ్డూ ఆపూ లేకుండా విస్తరించిన దశలో, సంక్షేమ పథకాలకు, పింఛన్లకు కోతపడిన సమయంలో ఆబ్రడార్ దేశాధ్యక్షుడు కాబోతున్నారు. 2003లో బ్రెజిల్ అధ్యక్షుడిగా వామపక్షవాది లూలా డి సెల్వా ఎన్నికైనప్పుడు, ఇంచుమించు అదే సమయంలో చిలీలో సోషలిస్టు నాయకుడు మైకేల్ బాచెలే విజయం సాధించినప్పుడు ఆ దేశాల స్థితిగతులు మెక్సికో మాదిరే ఉన్నాయి. వారిద్దరూ సమర్ధవంతంగా పాలించి ఆ దేశాలను గట్టెక్కించారు. ఆర్థిక వ్యవస్థల్ని బలో పేతం చేసి సంక్షేమ పథకాలను అమలు చేశారు. అసమానతలను ఏదో మేరకు తగ్గించగలిగారు. ఇటీవలకాలంలో వివిధ దేశాల్లో లెఫ్టిస్టులు దెబ్బతింటుండగా మెక్సికో చరిత్రలో తొలిసారి వామ పక్షం విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. అయితే మెక్సికోను ఆబ్రడార్ ఎలా చక్కదిద్దగలరో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment