శ్రీదేవి (ఫైల్ ఫొటో)
బాలనటిగా ప్రవేశించి దాదాపు అయిదు దశాబ్దాలపాటు తన నటనాపాటవంతో వెండితెరపై కాంతులు విరజిమ్మి రసహృదయాలను మైమరపించిన అపురూప సౌందర్యరాశి శ్రీదేవి కనుమరుగయ్యారు. ఆమె సినీ రంగ జీవితం ఒక అద్భుత మైతే... ఆమె హఠాన్మరణం ఒక దిగ్భ్రమం. ఏ మరణమైనా విషాదకరమైనదే... కానీ హఠాన్మరణం ఆ విషాదాన్ని మరిన్ని రెట్లు పెంచుతుంది.
ఇది చాలదన్నట్టు ఇప్పుడామె మరణం చుట్టూ అల్లుకుంటున్న సవాలక్ష సందేహాలు అందరినీ విస్మ యపరుస్తున్నాయి. అందులోని నిజానిజాలేమిటో ఎటూ ఒకటి రెండు రోజుల్లో వెల్లడవుతాయి. ఆమె మరణవార్త తొలిసారి విన్న ప్రతి ఒక్కరూ అది నిజం కాదేమోనన్న సందేహం వెలిబుచ్చారంటే ఆమెపై ఉన్న వల్లమాలిన అభిమానమే అందుకు కారణం. కేవలం 54 ఏళ్ల వయసులోనే ఊహకందని విధంగా ఆమె మృత్యువుబారిన పడటం అందరినీ కలచివేసే అంశం. ఆమెకు గుండెపోటు రావ డం వల్ల ఈ దురదృష్టకర ఘటన జరిగిందని తొలిరోజు చెప్పారు. ఇప్పుడది కార ణమే కాదంటున్నారు. స్నానాలగదిలోని నీళ్లున్న తొట్టెలో ప్రమాదవశాత్తూ పడి పోయి కన్నుమూశారంటున్నారు.
బాలనటిగా నాలుగేళ్ల వయసుకే కెమెరా ముందుకొచ్చి ఇంతింతై ఎదుగుతూ దక్షిణాదిన మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభి మానుల్ని ఆమె సంపాదించుకున్నారు. ఆ ముఖంలో కనబడే అమాయకత్వం, అందులో ఇంకా కనుమరుగుకాని పసితనం, పాత్రోచితంగా ఒదిగిపోయే స్వభావం శ్రీదేవిని ఈ స్థాయికి చేర్చాయి. లోకజ్ఞానం అంతగా లేని వయసులో పాత్ర స్వభావం గురించి డైరెక్టర్ చెప్పింది ఆకళింపు చేసుకోవడం, తాను చెప్పవలసిన సంభాషణలను కంఠతా పట్టడం, కెమెరా ముందు సహజత్వం ఉట్టిపడేలా వాటిని చెబుతూ చుట్టూ ఉన్నవారి అభినందలను అందుకోవడం ఓ వరం. ఇలాంటి సామ ర్ధ్యం ఉన్నవారు క్రమేపీ ఒక రకమైన ఆధిక్యతాభావనకు లోనవుతారు.
తమను తాము అతీతులుగా సంభావించుకుంటారు. కానీ శ్రీదేవి ఇందుకు విరుద్ధం. నిరుడు ‘మామ్’’ చిత్రం విడుదలైన సందర్భంలో సైతం నటనలో తానింకా విద్యా ర్థినేనని చెప్పారు. ఇది ఎదిగేకొద్దీ ఒదిగి ఉండటంగా కనబడవచ్చుగానీ, ఇంకా ఏదో నేర్చుకోవాలన్న పట్టుదల, తనకప్పగించిన పాత్రను మరింత మెరుగుపరచాలన్న తపన, చేసే పని పట్ల ఉండే అంకితభావం శ్రీదేవిని అలా తీర్చిదిద్దాయి.
ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీరంగాల్లో దిగ్గజాలనదగ్గ నటుల వద్ద బాలనటిగా నటించారు. అనంతరకాలంలో వారి సరసనే హీరోయిన్‌గా వెలిగారు. అదే వింతనుకుంటే ఆ దిగ్గజాల వారసుల పక్కన సైతం కథానాయికగా చేసి అందరినీ మెప్పించారు. మరే హీరోయిన్‌కూ ఇది సాధ్యపడలేదు. దక్షిణాది భాషల కంటే విస్తృతమైన మార్కెట్ గల హిందీ సినీ రంగానికెళ్లి దాన్ని సైతం జయించగలిగారు.
అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అవతార్’లో ఆమెతో నటింపజేయాలని జేమ్స్ కామెరాన్ తహతహలాడాడంటే అందుకు శ్రీదేవి లోని నటనావైదుష్యమే కారణం. అసమాన ప్రతిభాపాటవాలున్నపక్షంలో భౌగోళిక సరిహద్దులు మటుమాయమవుతాయని ఆమె నిరూపించారు. హిందీ చిత్రసీమలో శ్రీదేవికి ముందు వైజయంతిమాల, హేమమాలిని వంటివారు పేరుప్రఖ్యాతులు గడించి ఉండొచ్చుగానీ ‘సూపర్‌స్టార్’ కీర్తిశిఖరాలను అధిరోహించిన ఖ్యాతి మాత్రం ఒక్క శ్రీదేవికే దక్కింది. ఆ తర్వాత వచ్చిన నటీమణులెవరూ ఆమె స్థాయికి చేరుకోలేకపోయారు. పురుషాధిక్యత రాజ్యమేలే సినీరంగంలో ఒక మహిళ ‘సూపర్‌స్టార్’గా వెలుగులీనడం సాధారణ విషయం కాదు.
భారీ పెట్టుబడులతో మరింత భారీగా లాభాలను ఆర్జించాలని తహతహలాడే చలనచిత్ర రంగంలో హీరోయిన్ అనగానే గ్లామర్, శరీరాకృతి వంటివే ఎక్కువగా ప్రాధాన్యతలోకొస్తాయి. కథానాయకుడి పక్కన కుందనపు బొమ్మలా కనిపించడం, పాటల్లో గంతులేస్తూ నటించడమే కథానాయిక పని అనుకునేచోట హీరోయిన్ ప్రాధాన్యతను ఆమె తెలియజెప్పారు. కథానాయికగా మొదట్లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ మొదలుకొని అనేక చిత్రాల్లో ఆమె వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించి అందరితో ఔరా అనిపించుకున్నారు.
1983లో వచ్చిన హిందీ చిత్రం ‘హిమ్మత్ వాలా’లో హీరోయిన్‌గా సమ్మోహనపరిచిన నటే అంతకు ముందు సంవత్సరం తమిళ చిత్రం ‘మూండ్రాంపిరై’(తెలుగులో వసంత కోకిల)లో ప్రమాదంబారినపడి గతాన్ని మరచిన యువతిగా నటించి ప్రేక్షక లోకాన్ని కంట తడిపెట్టించిందంటే ఎవరూ నమ్మలేరు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘క్షణం క్షణం’ వంటి చిత్రాలు సైతం శ్రీదేవిని ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలబెట్టాయి.
ఇరవై ఆరేళ్లపాటు తెల్లారుజామునే లేచి తయారుకావడం, రోజుకు రెండు మూడు షూటింగ్‌లు, భిన్నమైన పాత్రలు, నిరంతరం అవుట్‌డోర్‌లు, ఆర్క్‌లైట్ వెలు గులు... ఇవే జీవితంగా గడిపిన శ్రీదేవి ఆ తర్వాత దాదాపు 20 ఏళ్లపాటు నిజ జీవితంలో గృహిణి పాత్రలో ఒదిగిపోయారు. కుటుంబమే ప్రపంచంగా బతికారు. అయినా సరే 2012లో మళ్లీ ముఖానికి రంగేసుకుని ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రంలో నటించేనాటికి కూడా ఆమె అభిమాన ప్రపంచం చెక్కుచెదరలేదు.
గ్లామర్ ప్రపంచం ఆడవాళ్లను శాసించినంతగా మగవాళ్ల జోలికి రాదు. నాజూగ్గా కనబడాలని ఎవరూ చెప్పినట్టు, ఆదేశించినట్టు కనబడదు. కానీ ఏమూలో దానికి లొంగిపోయే స్వభావం ప్రతివారిలోనూ ఎంతో కొంత ఉంటుంది. కోట్లాదిమందిని ఆకట్టుకునే మాధ్యమంలో దిగ్గజాలుగా వెలుగుతున్నవారికి అది అప్పుడప్పుడు శాపమవుతోంది. శ్రీదేవి మరణానికి అలాంటిదేమైనా కారణమా అన్నది తెలియదు. కానీ సహజంగానే సామాజిక మాధ్యమాల్లో ఆ కోణంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చిత్రపరిశ్రమలో ఏనాడూ వివాదాల జోలికి పోకుండా, చివరికంటా ఎంతో హుందాగా జీవించి అందరి ఆదరాభిమానాలూ చూరగొన్న శ్రీదేవి రానున్న తరాలకు సైతం అపురూపంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment