ఏ రాష్ట్రాన్నయినా కేంద్రం చల్లగా చూసి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులందిస్తాననడం హర్షించదగిన విషయం. అభివృద్ధి చెందడానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉండి, ఆ వనరుల వినియోగానికి తోడ్పడే ప్రాజెక్టులకు నిధులు కరువై దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి సమస్యలను గుర్తించి, వాటిని తీరుస్తామంటే... భవిష్యత్తును దివ్యంగా తీర్చిదిద్దుతామంటే కాదనేవా రెవరు? కనుక బిహార్‌లో మంగళవారం జరిగిన ఒక బహిరంగసభలో ఆ రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. అందుకు ఎంచుకున్న సమయంపైనే... అలాంటి స్థితిలో ఉన్న ఇతర రాష్ట్రాల గురించి పట్టించుకోకపోవడంపైనే ఎవరైనా ప్రశ్నిస్తారు. ఆంతర్యాన్ని నిలదీస్తారు.
అధికార పగ్గాలు చేపట్టాక నరేంద్ర మోదీ చాలా తరచుగా ‘సహకార ఫెడరలిజం’ గురించి మాట్లాడారు. దానికి అనుగుణంగా తమ రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను తామే రూపొందించుకోవ డానికి తగిన స్వేచ్ఛనివ్వాలని అయిదు నెలలక్రితం జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రులందరూ డిమాండ్ చేశారు. అలా కోరిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మొదలుకొని బీజేపీ సీఎంలు వసుంధర రాజే సింధియా (రాజస్థాన్), మనోహర్‌లాల్ ఖట్టార్ (హర్యానా) వరకూ చాలామంది ఉన్నారు. ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చేయదల్చు కున్నారో కేంద్రంలోని పాలకులు ప్రకటించడం కాక... ఎక్కడెక్కడ ఏం అవసరాలు న్నాయో... వాటి విషయంలో చేయాల్సిందేమిటో మమ్మల్నే చెప్పనివ్వాలన్నది ఆ సీఎంల వాదన.
ఇప్పుడు ప్రకటించిన బిహార్ ప్యాకేజీ ఆ రకంగా రూపుదిద్దుకున్నది కాదు. అలా ప్రకటించేముందు మీ అవసరాలేమిటి...మీ ప్రతిపాదనలేమిటని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను అడిగిందీ లేదు. కేవలం మరికొన్నాళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయన్న ఏకైక కారణంతో మాత్రమే ఈ ప్యాకేజీని ప్రకటించారన్నది నిజం. ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికైనా, అందుకు అవసరమైన ప్యాకేజీలు ఇవ్వడానికైనా ఆ రాష్ట్రం స్థితిగతులు మాత్రమే ప్రాతిపదిక కావాలి తప్ప అక్కడ జరిగే ఎన్నికలు కాకూడదని ఎవరైనా అంగీకరిస్తారు. మోదీ ఇటీవల తరచు అంటున్నట్టు చాలా వెనకబడినాయంటున్న బిమారు రాష్ట్రాల్లో బిహార్ కూడా ఒకటి. కనుక దాన్ని అభివృద్ధి చేయాల్సిందే. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాల్సిందే.
ఆ కారణాలే గీటురాయి కాదల్చుకుంటే దేశంలో ఇంకా చాలా రాష్ట్రాలూ... చాలా రాష్ట్రాల్లోని ప్రాంతాలూ బాగా వెనకబడి ఉన్నాయి. ఈమధ్యే విడుదలైన సామాజిక-ఆర్ధిక కుల గణన(ఎస్‌ఈసీసీ) గణాంకాలను గమనిస్తే ఈ సంగతి వెల్లడవుతుంది. అయితే ఈ గణాంకాలు రూపొందించడానికి అనుసరించిన ప్రాతిపదికలపై చాలా మందికి అభ్యంతరం ఉంది. ఎందుకంటే... రిఫ్రిజిరేటర్ లేదా టెలిఫోన్(ల్యాండ్‌లైన్) లేదా నెలకు రూ. 10,000 కన్నా తక్కువ నెలసరి ఆదాయం పొందే కుటుంబాలు ఎన్ని ఉన్నాయని లెక్కలు తీసి... మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ కుటుంబాలు వెనకబడి ఉన్నట్టు లెక్కేశారు. పోనీ దాని ప్రకారమే చూసుకున్నా బీజేపీ ఏలుబడిలోని ఛత్తీస్‌గఢ్ చాలా అంశాల్లో అట్టడుగున ఉంది. ఆ తర్వాత ఒడిశా, జార్ఖండ్‌లున్నాయి. మధ్యప్రదేశ్ సైతం అభివృద్ధి లేమితో ఇబ్బందులు పడుతోంది. ఈ రాష్ట్రాల్లో అసలే అభివృద్ధి జరగలేదనుకోవాలా... లేక అమలు చేస్తున్న అభివృద్ధి నమూనాలు లోపభూయిష్టమైనవనుకోవాలా? మరోపక్క సంపన్న రాష్ట్రాలుగా పరిగణిస్తున్న చోట సైతం అత్యంత వెనకబడిన ప్రాంతాలున్నాయి. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అవుతుందనీ... వెనకబడిన ప్రాంతాలున్నంతవరకూ దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యంకాదనీ అనుకున్నప్పుడు అందుకు సంబంధించిన సమగ్ర వ్యూహం అవసరమవుతుంది. ఆ వ్యూహం కోసం కేంద్రం రాష్ట్రాలతో చర్చించి, వాటి అవగాహనలో లోపమున్నా, తమ విధానాల్లో లోపమున్నా సవరించుకోవాల్సి ఉంటుంది. బిహార్ విషయంలో ఇదేమీ జరగలేదు.
ఎన్నికలవల్ల ఒరిగేదేమీ ఉండదని, సామాన్య పౌరుల జీవితాలేమీ మారవని కొందరు నిర్లిప్తంగా మాట్లాడతారుగానీ... వాటికుండే ఉపయోగాలు వాటికున్నాయి. ఇప్పుడు ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ అయినా... మొదటినుంచీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూసేకరణ సవరణ బిల్లును పక్కనబెట్టడమైనా రాబోయే బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది నిజం. మరి ఇప్పట్లో ఎన్నికలు లేని రాష్ట్రాల మాటేమిటి? అవి అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? నిరుడు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రచారానికి సారథ్యం వహించిన నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కలిసి అనేక బహిరంగ సభలు నిర్వహించి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఆచరణలో ఇంతవరకూ ఒరిగిందేమీ లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని కొన్నాళ్లూ... ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని కొన్నాళ్లూ చెబుతూ పొద్దుపుచ్చు తున్నారు. ఇప్పటికి 14 నెలలవుతున్నా ప్రత్యేక హోదా మాట అటుంచి ఇతరత్రా హామీలు కూడా సరిగా నెరవేర్చలేకపోయారు.
పరిమాణం రీత్యా చూస్తే బిహార్ ప్యాకేజీ భారీగానే ఉంది. అందులో పేర్కొన్న ప్రాజెక్టులన్నీ సాకారమైతే బిహార్‌లో గణనీయమైన అభివృద్ధే జరగొచ్చు. అయితే అక్కడ జరిగే ఎన్నికలను ఎలాగైనా గెలిచితీరాలన్న మోదీ దృఢ నిశ్చయాన్నే అది ఎలుగెత్తి చాటుతోంది. కేవలం బిహార్ అభివృద్ధే ప్రధాన ధ్యేయమైతే ప్యాకేజీని ప్రకటించడానికి 14 నెలల సమయం తీసుకోనవసరం లేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ విషయంలోనైనా ఈ ఒరవడికి భిన్నంగా ఆలోచించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నదని నరేంద్రమోదీ గుర్తించాలి.
బిహార్‌కు వరాల జల్లు
Published Thu, Aug 20 2015 12:42 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement