‘వర్తమాన స్థితిగతులను చూస్తుంటే ఈ దేశం ఏమైపోతుందోనన్న ఆవేదన కలు గుతోంది. నా కళ్ల వెంట రక్తాశ్రువులు స్రవిస్తున్నాయి’ అన్నాడు విప్లవవీరుడు భగత్‌సింగ్. జైల్లో ఉరికంబం నీడన ఉండి, వెలుపల జరుగుతున్న మత ఘర్షణల గురించి విని చలించి ఒక పత్రికకు రాసిన వ్యాసంలో అన్న మాటలివి. దాదాపు తొమ్మిది దశాబ్దాలనాడు ఆయన ఇలా రాసేనాటికి దేశం బ్రిటిష్ వలసపాలనలో మగ్గుతోంది. మనకు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా ఈనాటికీ ఆ పరిస్థితులే ఉన్నాయని బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గతవారంలో శ్రీరామ నవమి పండగనాడు, ఆ తర్వాత చోటు చేసుకున్న ఉదంతాలు రుజువు చేశాయి. పశ్చిమబెంగాల్‌లో చిత్రమైన పరిస్థితి. అక్కడ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీలు తమ రాజకీయ ఆధిక్యతను ప్రదర్శించుకోవడానికి శ్రీరామనవమి పర్వ దినాన్ని ఎంచుకున్నాయి.
ఫలితంగా పలు జిల్లాలు భయాందోళనల్లో మునిగాయి. టీఎంసీ రాష్ట్రంలోనూ, బీజేపీ కేంద్రంలోనూ ప్రభుత్వాలకు నాయకత్వంవహిస్తున్నా బాధ్యతమరిచాయి. రెండు పార్టీలూ పోటాపోటీగా ఊరేగింపులు జరిపాయి. ఎవ రెన్ని ప్రదర్శనలు నిర్వహించారు... ఎవరికి జనం అధికంగా వచ్చారన్నది ప్రధానం అయిపోయింది. ఇందులో మత విశ్వాసాలకూ, భక్తికీ ఏమాత్రం చోటులేదు. బీజేపీ శ్రేణులు కత్తులతో ఊరేగాయి. ఊరేగింపులు ఎదురుపడినచోట పోటాపోటీ నినా దాలు హోరెత్తాయి. మత ఘర్షణలు అధికంగా జరిగిన అసన్‌సోల్ నియోజక వర్గానికి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ప్రాతినిధ్యంవహిస్తున్నారు. నల్లమద్ది వృక్షాన్ని హిందీలో అసన్ అంటారు. మంటల ధాటిని మద్ది బాగా తట్టుకో గలదంటారు. ఆ వృక్షాలు ఎక్కువున్న ప్రాంతం గనుక అది అసన్‌సోల్ అయింది. కానీ రాజకీయ పార్టీలు ఎగదోసిన మతం మంటలు ఆ ప్రాంతాన్ని వారం రోజులుగా అట్టుడికిస్తున్నాయి.
ఒక గుంపు అకారణంగా స్థానిక ఇమామ్ కుమా రుణ్ణి అపహరించి తీసుకుపోతే కొన్ని గంటల తర్వాత పదిహేడేళ్ల ఆ పిల్లవాడు ఒళ్లంతా నుజ్జునుజ్జయి విగతజీవిగా కనబడ్డాడు. అతణ్ణి బలవంతంగా తీసుకు పోతుంటే దగ్గర్లోనే ఉన్న అతని సోదరుడు గమనించి పోలీసుల్ని హెచ్చరించినా వారు రంగంలోకి దిగేసరికి ఆలస్యమైపోయింది. తన కుమారుడికి జరిగినట్టు మరెవరికీ జరగొద్దని, అందరూ ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లిపోవాలని ఇమామ్ ప్రాధే యపడి ఉండకపోతే అసన్‌సోల్ మరింత నెత్తురు కళ్లజూసేది. 24 పరగణాల జిల్లాలో విద్యావేత్త, స్వతంత్ర భారత తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి ఒక గుంపు నిప్పుపెట్టింది. అసన్‌సోల్, 24 పరగణాల జిల్లా మాత్రమే కాదు... మరో అయిదారు జిల్లాలు ఇలా అట్టుడికాయి. తనను ‘హిందూ వ్యతిరేకి’గా చిత్రించే బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పశ్చిమబెంగాల్ ముఖ్య మంత్రి, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ ఆ పార్టీకి దీటుగా ప్రదర్శనలు చేయించడంపై దృష్టిపెట్టారు. ఆ క్రమంలో శాంతిభద్రతలు ఏమవుతాయన్న సంగతిని మరిచారు.
జేడీ(యూ)–బీజేపీ కూటమి సర్కారు ఏలుబడిలో ఉన్న బిహార్‌లో సైతం పలు జిల్లాలు మతఘర్షణలు చవిచూశాయి. పండగలొచ్చాయంటే ఉద్రిక్తతలు అలుము కోవడం ఆ రాష్ట్రంలో రివాజుగా మారింది. ఈసారి శ్రీరామనవమి ఊరేగింపులకు కొన్ని నిబంధనలతో అనుమతినిచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మత ఉద్రి క్తతలు ఏర్పడకుండా చూడటం కోసం అన్య మతస్తులు అధికంగా ఉన్న ప్రాంతాలు, గ్రామాల మీదుగా అవి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామన్నది. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది.
ఫలితంగా భాగల్పూర్, ముంగేర్, ఔరంగాబాద్, సమస్తిపూర్, నలందా, ముజఫర్‌పూర్, సీతామడి వగైరాల్లో అల్లర్లు చెలరేగాయి. చాలాచోట్ల రెచ్చగొట్టే నినాదాలు, హెచ్చరికలు మిన్నంటాయి. ఇందుకు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జేడీ కారణమని బీజేపీ ఆరోపిస్తుంటే, బిహార్ ప్రభుత్వం మాత్రం కేంద్రమంత్రి అశ్వినీకుమార్ చౌబే కుమారుణ్ణి భాగల్పూర్ మతఘర్షణల కేసులో అరెస్టు చేసింది. అసలు చాలాచోట్ల ప్రభుత్వం నిర్దేశించిన మార్గాల్లో కాకుండా వేరే మార్గాల ద్వారా ఊరేగింపులు ఎలా వెళ్లాయో, స్థానిక పోలీసులు ఎలా అనుమతించారో బిహార్ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. చిత్రమేమంటే నితీష్ సొంత జిల్లా నలందాలో తొలిసారి మత ఘర్షణలు చెలరేగాయి.
మొన్న ఫిబ్రవరిలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మత ఘర్షణలపై విడుదల చేసిన నివేదిక వర్తమాన స్థితిగతుల్ని కళ్లకు కట్టింది. నిరుడు దేశవ్యాప్తంగా 822 మతఘర్షణలు చోటుచేసుకోగా వాటిలో 111మంది మరణించారని, 2, 384మంది గాయపడ్డారని ఆ నివేదిక గణాంకాలిచ్చింది. మిగిలిన రాష్ట్రాలతోపోలిస్తే ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 195 ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత స్థానం కర్ణాటక రాష్ట్రా నిది. అక్కడ వంద ఘర్షణలు జరగ్గా 9మంది మరణించారు. 229మంది గాయ పడ్డారు. మూడో స్థానంలో ఉన్న బిహార్ 85 ఘర్షణలు చవిచూసింది. పరిస్థితులు సవ్యంగా లేవని తెలిసినా, ప్రతి ఏటా అల్లర్లు జరుగుతున్నాయని అర్ధమైనా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదు. రెచ్చగొడుతున్న శక్తుల్ని గుర్తించి వారిని ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకునే ప్రయత్నాలు చేయడంలేదు.
సరిగదా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక మత ఘర్షణలు నమోదైన యూపీలో అక్కడి సర్కారు మతపరమైన కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై ఈమధ్యే కేసులు ఎత్తేసే పనిలో పడింది. 60మందికిపైగా మరణానికి దారితీసిన ముజఫర్‌నగర్–షామ్లీ ఘర్షణల్లో 131 కేసుల్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. 2013 నాటి ఆ ఘర్షణల్లోని బాధితులు ఈనాటికీ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. రాజకీయ లబ్ధికోసం పర్వదినాలను బలప్రదర్శనకు సందర్భాలుగా మార్చుకుని సాధారణ పౌరుల ప్రాణాలతో, వారి విశ్వాసాలతో చెలగాటమాడే ధోరణులకు రాజకీయ పక్షాలు స్వస్తిపలకాలి. ఈ దేశానికొక రాజ్యాంగం ఉన్నదని, తాము సైతం దానికి లోబడి ఉండాలని గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment