పార్లమెంటు తీరు మారదా!
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తీరు గమనించినవారికి ఈ శీతాకాల సమావేశాలపై పెద్దగా నమ్మకాలు లేవు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన రెండు రోజుల ప్రత్యేక సమావేశాల చివరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అలా నిరాశ పడేవారిని ఆలోచింపజేసింది. అందరినీ కలుపుకొనిపోయే రీతిలో ఆయన మాట్లాడటం...ఆ తర్వాత మోదీ నివాసానికి సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌లు వెళ్లడం శుభసూచకమని అందరూ అనుకున్నారు.
కానీ అసహనంపై సోమవారం జరిగిన చర్చల్లో రేగిన దుమారం అలాంటి భరోసానివ్వడం లేదు. లోక్‌సభ పదే పదే వాయిదా పడిన తీరు...సభ్యుల ఆగ్రహావేశాలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. నిజానికి ఈ అంశంపై చర్చను సభ్యులంతా సహనంతో సాగిస్తారని, ఆవేశాలు అసలే వ్యక్తం కావని ఎవరూ అనుకోలేదు. కనీసం ఒకరు చెప్పేది ఒకరు వింటారని, జరిగిన ఉదంతాలపై స్పందించే సందర్భంలో ప్రభుత్వ పక్షం కూడా దూకుడుగా వ్యవహరించదని భావించారు.
కానీ సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం చేసిన ఆరోపణ తర్వాత సభ యధాప్రకారం వాయిదాల బాణీలో సాగింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక అంతర్గత సమావేశంలో చేశారని చెబుతున్న వ్యాఖ్య గురించి ఆంగ్లపత్రికను ఉటంకిస్తూ సలీం చేసిన ప్రసంగంతో ప్రభుత్వ పక్షం ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడమే కాదు, ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టడం...అందుకు సలీం నిరాకరించడంలాంటి పరిణామాలతో సభ స్తంభించిపోయింది. మొత్తంగా రోజులో సగభాగం వృథా అయింది.
సాధారణంగా సభను స్తంభింపజేసే పాత్రను విపక్షం తీసుకుంటుంది. ప్రభుత్వ కార్యకలాపాలు సాగకుండా అడ్డుకుని దాన్ని దారికి తెచ్చుకోవాలని చూస్తుంది. కానీ ఇవాళ అధికార పక్షమే ఆ పని చేసింది. ఆరోపణలను ఉపసంహరించుకునేవరకూ సభ సాగదని అధికార పక్షం ప్రకటించడం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి కావొచ్చు. సలీం ఆరోపణలు రాజ్‌నాథ్‌ను తీవ్రంగానే కదిలించాయని ఆయన స్పందన చూస్తేనే అర్ధమవుతుంది. రాజ్‌నాథ్‌సింగ్ నేపథ్యాన్ని గమనించినా, ఆయన నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకుండే ప్రాముఖ్యాన్ని గ్రహించినా ఆయన స్పందన ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు. రాజ్‌నాథ్‌కు ఆదినుంచీ సౌమ్యుడన్న పేరుంది. ఏ స్థాయికైనా వెళ్లి దూకుడుగా మాట్లాడే నేతలకు ఆయన భిన్నం. పైగా నరేంద్ర మోదీ సర్కారులో ఆయనది రెండో స్థానం.
నిరుడు ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడి తీరుపై మోదీ ఆగ్రహించి అతన్ని పిలిచి మందలించారని వార్తలొచ్చినప్పుడు కూడా ఆయన కలవరపడ్డారు. ఇందులో ఏ కొంచెం నిజమున్నా రాజకీయ జీవితంనుంచి తప్పుకుంటానని ప్రకటించారు. సలీం ఆరోపణలకు ఆయన మళ్లీ అదే స్థాయిలో స్పందించారు. చివరికది రికార్డుల్లోకి ఎక్కడం లేదని స్పీకర్ ప్రకటించాక సద్దుమణిగినా రోజులో సగభాగం వాయిదాల్లో గడిచిపోయింది.
అసహనానికి సంబంధించి విపక్షాల ఆరోపణల్ని తిప్పికొడుతున్న సందర్భంలో బీజేపీ మొదటినుంచీ చేస్తున్న వాదననే మరోసారి చెప్పింది తప్ప అందులో కొత్తదనం లేదు. అవార్డులు వెనక్కి ఇస్తున్నవారికి 1984లో జరిగిన సిక్కుల ఊచకోత, హషీంపురా, ముజఫర్‌నగర్ మతకల్లోలాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించడం...సాహితీవేత్త కల్బుర్గిని కాల్చిచంపడం, దాద్రీలో ఒక ముస్లిం కుటుంబంపై దాడిచేసి యజమానిని కొట్టి చంపడంవంటి అంశాల్లో దర్యాప్తు జరిపి దోషులను పట్టుకునే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదని వాదించడం బీజేపీకి కొత్తేమీ కాదు.
లోక్‌సభలో ఆ పార్టీ తరఫున మాట్లాడిన మీనాక్షి లేఖి ఆ మాటలే మరోసారి చెప్పారు. అవార్డులు వెనక్కి ఇస్తున్నవారిని ఫలానా సమయంలో ఎందుకివ్వలేదని ప్రశ్నించడం శుద్ధ తర్కమవుతుందేమోగానీ సరైన జవాబు కాదు. ఇదంతా ‘కాంగ్రెస్‌ను అప్పుడేమీ అనలేదు కాబట్టి మమ్మల్ని కూడా ఇప్పుడు ఏం అనకండి’ అని వాదించినట్టుంది. హత్యల విషయంలో బీజేపీ చేస్తున్న వాదన మరీ ఘోరం. హత్య కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల సంరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివని ఆ పార్టీ ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆ సంగతి అందరికీ తెలుసు.
కానీ అలాంటి ఉదంతాల తర్వాత బీజేపీ నేతలు ఇచ్చిన ప్రకటనలు చూసినా, ఆ పార్టీతో సాన్నిహిత్యాన్ని ప్రదర్శించే పరివార్ సంస్థల నేతలు మాట్లాడిన మాటలు విన్నా వాటిని ఏదో మేరకు సమర్థించినట్టే, ఆ మాదిరి శక్తులకు ఊతం ఇచ్చినట్టే కనబడింది. వారలా మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోదీ లేదా మరో ముఖ్య నాయకుడు జోక్యం చేసుకుని చక్కదిద్ది ఉంటే, ఆ అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని చెబితే వేరుగా ఉండేది. అలా చెప్పనందువల్లే ఈ విమర్శలన్నీ వచ్చాయని బీజేపీ నేతలు ఇంకా గ్రహించడంలేదని తాజా చర్చ గమనించాక అర్ధమవుతుంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నయం. రాజ్యాంగంపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంలో అసహనం అంశం ప్రస్తావనకొచ్చినప్పుడు అది నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందునుంచీ ఉన్నదని ఆయన అంటూనే... కొందరు నేతలు మాట్లాడిన మాటలు సరిగా లేవని అంగీకరించారు. అలాంటి నాయకులను ఏకాకులను చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
మొన్నటి వర్షాకాల సమావేశాలు ఒక్కనాడైనా సజావుగా సాగకుండా వాయిదా పడ్డాయి. లోక్‌సభ సమయంలో 48 శాతం, రాజ్యసభ సమయంలో 9 శాతం మాత్రమే సద్వినియోగమైంది. నిజానికి గత అయిదేళ్లుగా పార్లమెంటు తీరు తెన్నులు ఇలాగే ఉన్నాయి. అధికార, విపక్షాలు రెండూ ఈమధ్య కనబరిచిన సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేసి, ఈ స్థితిని మార్చాలి. పార్లమెంటులో జరిగే చర్చలు ప్రజలకు ఒక భరోసానిచ్చేలా, అసహనాన్ని రెచ్చగొట్టే ఉన్మాదులకు హెచ్చరికగా ఉండాలి. అంతేతప్ప ఉన్న వాతావరణాన్ని మరింత దిగజార్చకూడదు. ఆ సంగతిని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి.