ఎందరు ఎంతగా తెగనాడుతున్నా ఇజ్రాయెల్ మరోసారి పొరుగునే ఉన్న పాలస్థీనాలోని గాజా స్ట్రిప్ అనే ఒక చిన్న ప్రాంతంపై తన ప్రతా పాన్ని ప్రదర్శించింది. నిరాయుధులు, నిస్సహాయులూ అయిన సామా న్య పౌరులపై గత వారంరోజులుగా ఎడతెగకుండా బాంబుల వర్షం కురిపిస్తూ ఇప్పటికి 177 మందిని పొట్టనబెట్టుకున్నది. ఇందులో సగం మందికిపైగా పసిపిల్లలు, మహిళలు. మరో 1,300మంది గాయాలతో ఆస్పత్రులపాలయ్యారు. ఇవి చాలవన్నట్టు అది గాజా సరిహద్దుల్లో ట్యాం కులతో, సైన్యంతో మోహరించింది. ఏ క్షణంలోనైనా భూతల దాడులను ప్రారంభించి ఆ ప్రాంతాన్ని వల్లకాడుగా మార్చేందుకు అన్ని సన్నాహాలూ చేసుకున్నది. గాజా ప్రాంతం విస్తీర్ణంలో కేవలం 365 చదరపు కిలోమీ టర్లు. జనాభా 17 లక్షలు మించరు. ఆ చిన్న ప్రాంతం తాజా పరిణామాల నేపథ్యంలో రుధిరధారలతో తడిసిముద్దయింది. ఎన్నో భవనాలు నేలమ ట్టమయ్యాయి. రోజుకు పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు పోతున్నాయి. వేలాదిమంది వలసపోతున్నారు. జనావాసాలపై దాడులే మిటని నిలదీస్తే మిలిటెంట్లు ఆ ప్రాంతంలోనే స్థావరాలు ఏర్పర్చుకున్నా రని, ఆయుధాలు పోగేశారని ఇజ్రాయెల్ జవాబిస్తున్నది. శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో గాజాలోని ఒకే కుటుంబానికి చెందిన 18మంది చనిపోయారు. అయినా నాగరిక ప్రపంచంగా చెప్పుకుంటున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఈ ఏకపక్ష దాడులను చేష్టలుడిగి చూస్తు న్నాయి. ‘సంయమనం’పాటించమని ఇజ్రాయెల్‌ను కోరడం మినహా ఇతరేతర ప్రయత్నాలేమీ చేయడంలేదు. ఐక్యరాజ్యసమితి సైతం మౌనంగా మిగిలిపోయింది. ఎందుకీ మారణహోమం? పాలస్థీనాపై ఇజ్రాయెల్ దాడి చేయడానికి ప్రతిసారీ ఏదో ఒక సాకు దొరుకుతుంది. ఈసారి ముగ్గురు టీనేజ్ యువకుల అపహరణ, హత్య ఇజ్రాయెల్ దాడులకు కారణాలయ్యాయి. ఆ యువకులను అపహరించిందెవరో, అటుపై ఎందుకు హతమార్చవలసివచ్చిందో ఇంతవరకూ నిర్ధారణ కాలేదు. కానీ, ఇజ్రాయెల్ మాత్రం ఈ పని హమాస్‌దేనని తేల్చేసింది. ఆ వెంటనే దాడులు ప్రారంభించింది.
యువకుల అపహరణ, హత్య ఉదం తాన్ని హమాస్ సంస్థ ఖండించింది. దానితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. పాలస్థీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ కూడా ఆ ఉదంతం అమానుషమైనదని నిరసించారు. ఇద్దరు పాలస్థీనా పౌరులు ఈ ముగ్గురు యువకులనూ అపహరించి ఇజ్రాయెల్ జైళ్లలో బందీలుగా ఉన్న తమవారిని విడిపించుకునే ప్రయత్నం చేయబో యారని కొందరంటున్నారు. ఈ ప్రయత్నం బెడిసికొట్టి చివరకు యువకు లను చంపారన్న వాదన వినబడుతున్నది. ఇజ్రాయెల్ కాస్త సంయమనం పాటించివుంటే, తగిన వ్యవధి తీసుకుని విచారణ జరిపివుంటే ఇందు లోని నిజానిజాలు వెల్లడయ్యేవి. అలా వెల్లడైతే పాలస్థీనాపై దాడికి అవ కాశం దొరకదనుకున్నదేమో వెనువెంటనే దాడులకు దిగింది. తమ పౌరు లను హతమార్చినవారిపై ఇజ్రాయెల్ చర్య తీసుకోకూడదని ఎవరూ అనరు. అయితే, దానికొక పద్ధతుంటూ ఉండాలి. కారకులైనవారిని గుర్తిం చి వారిని తమకు అప్పగించమని కోరడం అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన విధానం. పాలస్థీనా అందుకు నిరాకరిస్తే అంతర్జాతీయ వేదికలపై దాన్ని లేవనెత్తి న్యాయం కోరవచ్చు. ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు ఏ దేశమైనా అనుసరిస్తున్న విధానం ఇదే. అంతేతప్ప యుద్ధ విమానాలను ఉసిగొల్పి జనావాసాలపై బాంబులు కురిపించడం, రాకెట్ దాడులు చేయడం ఎలాంటి యుద్ధనీతి? 2012లో సైతం ఇజ్రా యెల్ ఇదే తరహాలో దాడులకు పాల్పడింది. ఆ దాడుల్లో దాదాపు 90మంది మరణించారు. అప్పుడు కూడా చాలా చిన్న కారణాన్ని సాకుగా తీసుకుని దాడులు చేసింది.
ఈ ఏడాదిని పాలస్థీనా ప్రజల అంతర్జాతీయ సౌహర్ద్రతా సంవత్స రంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించివున్నది. దానికితోడు పాలస్థీనాలో పరస్పరం తలపడే హమాస్, ఫతా సంస్థలు రెండూ ఒక ఒప్పందాని కొచ్చాయి. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం అవుతున్నది. సమరశీలంగా ఉండే హమాస్ సంస్థ వాస్తవానికి ఇటీవలికాలంలో తన మిలిటెంటు స్వభా వాన్ని వదులుకున్నది. బాధ్యతాయుతమైన పక్షంగా తనను తాను తీర్చిది ద్దుకుంది. పాలస్థీనాలో జరిగే ఇలాంటి పరిణామాల ప్రభావం ఇజ్రాయెల్ పై ఉంటుంది. అక్కడ శాంతియుత వాతావరణం ఏర్పడితే ఆ దేశ ప్రగతికి కూడా అదెంతో దోహదకారి అవుతుంది. నిత్యమూ కలహించే మిలిటెంటు సంస్థలుంటే, నాయకుల అదుపాజ్ఞల్లో పని చేయని శ్రేణులుం టే అది తనకెంతమాత్రమూ క్షేమదాయకం కాదు. అందరి ఆమోదాన్ని పొందిన బాధ్యతాయుత ప్రభుత్వంతో సమస్యలను చర్చించడం సులభం. పరిష్కారం కూడా సాధ్యం. కానీ, పాలస్థీనాలో ఏర్పడుతున్న ఈ మంచి వాతావరణాన్ని ఇజ్రాయెల్ తన మతిమాలిన చర్యలతో చెడగొట్టింది.
పాలస్థీనాపై వైమానికి దాడులతో సంతృప్తిచెందని ఇజ్రాయెల్ నేత లు కొందరు గాజా స్ట్రిప్‌కు ఇంధనం, విద్యుత్ సరఫరాలను నిలిపేయ మంటున్నారు. అదే జరిగితే గాజా మరింత సంక్షోభంలో చిక్కుకుం టుంది. ఈ ఆరేళ్లలో పాలస్థీనాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం ఇది మూడోసారి. అంతా పూర్తయ్యాక భద్రతామండలి సమావేశం కావడం, అన్ని పక్షాలూ సంయమనం పాటించాలనడం రివాజే. ఎవరి పేరూ ఎత్తకుండా జరిగిన దారుణాన్ని ఖండించడమూ సర్వసాధారణమే. ఈసా రైనా అలాంటి ‘మర్యాదస్తుల’ మాటలతో సరిపెట్టక వివాదం లోతుల్లోకి వెళ్లాలి. పాలస్థీనా మరోసారి నెత్తురోడకుండా అవసరమైన అన్ని చర్యలకూ సమాయత్తం కావాలి. దేశదేశాల్లోని ప్రభుత్వాలపైనా ప్రపంచ ప్రజానీకం గట్టిగా ఒత్తిడి తెస్తేనే ఇది సాధ్యమవుతుంది. వర్తమాన విషాద పరిణామాలు అందుకు దోహదపడగలవని ఆశించాలి.
గాజాపై నెత్తుటి పంజా!
Published Tue, Jul 15 2014 12:42 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement