మరో అయిదు రోజుల్లో తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మిగిలిన రంగాల మాటెలా ఉన్నా దౌత్య రంగంలో మంచి మార్కులే పడతాయి. ప్రమాణస్వీకారం రోజున సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించడం ద్వారా ఇరుగుపొరుగుతో సంబంధాల మెరుగుదలకు శ్రీకారం చుట్టిన మోదీ... ఏడాది కాలం పూర్తి కావస్తుండగా చైనా, మంగోలియా, దక్షిణ కొరియా చుట్టివచ్చారు. ఈ పన్నెండు నెలలకాలంలో ఆయన 18 దేశాలు పర్యటించారు. ఇందుకోసం మొత్తం 53 రోజుల సమయాన్ని వెచ్చించారు. ఈ పర్యటనల్లో లాంఛనప్రాయమైనవీ, వ్యూహాత్మకమైనవీ, వ్యాపార సంబంధమైనవీ, కేవలం ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించినవీ ఉన్నాయి. ఈ పర్యటనలవల్ల...మరీ ముఖ్యంగా చైనా పర్యటనవల్ల దేశానికి పెద్దగా ఒరిగిందేమిటని ప్రశ్నించేవారూ ఉన్నారు. వారి విమర్శల్లో కొంత నిజం లేకపోలేదు.
ఇరుదేశాలమధ్య ఉన్న సరిహద్దు సమస్య తేలేలోగా ముందు వాస్తవాధీన రేఖపై స్పష్టత సాధిద్దామన్న మోదీ ప్రతిపాదనపై చైనా సానుకూలంగా స్పందించలేదు. అందుకు భిన్నంగా సరిహద్దు వివాదం విషయంలో ప్రస్తుతం ఉన్న శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి అవసరమైన పరస్పర విశ్వాస చర్యలు మరిన్ని అవసరమని ఉమ్మడి ప్రకటన పేర్కొంది. అదేవిధంగా భద్రతామండలిలో మనం కోరుతున్న శాశ్వత సభ్యత్వం విషయంలోనూ చైనా మౌనంగా ఉండిపోయింది. మండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన చైనా... ఆసియాలో తనకు పోటీగా ఎదుగుతున్న భారత్‌వంటి దేశానికి శాశ్వత సభ్యత్వం విషయంలో అంతత్వరగా మద్దతునివ్వగలదనుకోవడం కూడా సరికాదు. అయితే, రాజకీయాల్లాగే దౌత్యం కూడా సాధ్యాసాధ్యాలను ప్రయత్నించి చూసే కళ. నిరంతరాయంగా జరిగే చర్చలు, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి మార్పునకు దోహదపడతాయి. గత ప్రధానుల ప్రయత్నానికి మోదీ పర్యటన కొనసాగింపుగా ఉన్నదా, లేదా అనేదే ప్రధానం. ఆ రకంగా చూస్తే మోదీ పర్యటన నిస్సందేహంగా ముందడుగే.
భారత-చైనాలమధ్య సంబంధాల మెరుగుదలకు జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా పనిచేసినప్పుడు వాజపేయి అంకురార్పణ చేశారు. అప్పటితో పోలిస్తే ఈ సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. సరిహద్దు సమస్య అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే దౌత్య స్థాయిలో సమస్యల విషయంలో ఎలాంటి చర్చలు సాగుతున్నా బహిరంగంగా వాటిని గురించి ప్రస్తావించకపోవడం, ఇతరేతర వివాదాస్పద అంశాల జోలికి పోకుండా దౌత్యమర్యాదలను పాటించడం ఇన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోంది. మోదీ దానికి బ్రేక్ వేశారనే చెప్పాలి. ఆయన చైనా పర్యటనకు బయల్దేరి వెళ్లే ముందే ఆ దేశం నిర్మించ తలపెట్టిన ‘న్యూ సిల్క్ రూట్’ ప్రాజెక్టుపై మన దేశం గట్టిగా అభ్యంతరం చెప్పింది. ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో రహదార్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది. అరుణాచల్‌ప్రదేశ్ వాసులకు చైనా స్టేపుల్డ్ వీసాలు మంజూరు చేయడాన్ని మోదీ ఈ పర్యటనలో అన్యాపదేశం గానైనా ప్రస్తావించి... ఇందుకు సంబంధించిన వైఖరిని మార్చుకోవాలని చైనాకు సూచించారు. అదే సమయంలో తాము చైనీయులకు ఈ-వీసా సౌకర్యం కల్పించబోతున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాద మూలాలు మన పొరుగునే ఉన్నాయని, అందువల్ల ఇరుదేశాలూ భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు. పాకిస్థాన్ విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరిపై ఇది ఒకరకంగా విమర్శవంటిది. ఇలా చేస్తూనే గత ప్రధానులకంటే సంబంధాల మెరుగుదలలో మోదీ మరో అడుగు ముందుకేశారు. చైనాతో సంబంధాలు మలి దశకు వెళ్లడానికి సరిహద్దు సమస్య పరిష్కారం ముందస్తు షరతుగా ఉన్న గత విధానాన్ని ఆయన సవరించారు. చైనా పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఇందువల్ల ఇరుదేశాల కార్పొరేట్ సంస్థల మధ్యా 2,200 కోట్ల డాలర్లమేర వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. తొలిసారిగా పర్యాటక రంగంలోనూ సంబంధాల విస్తరణకు మార్గం సుగమమైంది.
చైనాతో ఇలా దగ్గరవుతూనే ఆ దేశానికి పొరుగునున్న మంగోలియా, దక్షిణ కొరియాలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి మోదీ ప్రయత్నిం చారు. మనతో సఖ్యతగా ఉంటూనే పాకిస్థాన్‌ను దువ్వడం, మన ప్రాంతంలోని దేశాలతో సన్నిహితమవుతూ ఆసియాలో తిరుగులేని శక్తిగా ఎదగాలని కోరుకోవడం వంటి చైనా ఆకాంక్షలకు దాని భాషలోనే బదులిచ్చారు. కారణం ఏమైతేనేం దక్షిణ కొరియాతో సంబంధాలకు మన దేశం ఇంతకాలం పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. అలాంటి దేశంతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ తలుపులు తెరిచారు. పర్యవసానంగా ఆ దేశం భారత్‌లో 1,000 కోట్ల డాలర్లమేర పెట్టుబడులకు ముందుకొచ్చింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, రైల్వేలు, విద్యుదుత్పాదన వంటి మౌలిక రంగాల్లో ఈ పెట్టుబడులుంటాయి. ఇక మంగోలియా విషయానికొస్తే లోగడ ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా ఆ దేశం వెళ్లారుగానీ... మన దేశంనుంచి అక్కడ పర్యటించిన తొలి ప్రధాని మోదీయే. యురేనియం, బొగ్గు, రాగి, బంగారం నిల్వలు అపారంగా ఉన్న దేశం గనుక మంగోలియాతో సంబంధాలు మనకెంతో ఉపయోగపడతాయి.
అలాగే భారత్ పెట్టుబడులకు ఆ దేశంలో విస్తృతమైన అవకాశాలున్నాయి. అటు మంగోలియా కూడా తన పొరుగునున్న రెండు పెద్ద దేశాలు చైనా, రష్యాలమధ్య ఒత్తిడికి లోనవుతున్నది. మూడో దేశంతో సంబంధాలు నెలకొల్పుకునే దిశగా కదలాలని మంగోలియా ఎప్పటి నుంచో భావిస్తున్నది. ఆరురోజులపాటు నరేంద్ర మోదీ సాగించిన ఈ పర్యటనలతో మన లుక్ ఈస్ట్ (తూర్పువైపు చూపు) విధానం మరింత పదునుదేరిందనే చెప్పాలి. రాగల రోజుల్లో దీని ఫలితాలు మరింత ప్రస్ఫుటమవుతాయి.
మోదీ సుడిగాలి పర్యటన!
Published Thu, May 21 2015 12:54 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement