దేశవ్యాప్తంగా ఉన్న పలు విశ్వవిద్యాలయాలు అశాంతితో, ఆందోళనలతో అట్టుడు కుతున్న వేళ గురువారం సూరజ్‌కుండ్‌లో జరిగిన వైస్ చాన్సలర్ల సమావేశంపై సహజంగానే అధ్యాపక, విద్యార్థి వర్గాల్లో...విద్యారంగ నిపుణుల్లో ఆసక్తి ఏర్పడింది.
దేశవ్యాప్తంగా ఉన్న పలు విశ్వవిద్యాలయాలు అశాంతితో, ఆందోళనలతో అట్టుడు కుతున్న వేళ గురువారం సూరజ్‌కుండ్‌లో జరిగిన వైస్ చాన్సలర్ల సమావేశంపై సహజంగానే అధ్యాపక, విద్యార్థి వర్గాల్లో...విద్యారంగ నిపుణుల్లో ఆసక్తి ఏర్పడింది. విశ్వవిద్యాలయాల పాలనా నిర్వహణ, అక్కడ ఏర్పడుతున్న ఇతరత్రా సమస్యల విషయంలో ఎలాంటి చర్చ జరుగుతుందో, ఏ నిర్ణయాలు వెలువడతాయోనని వారనుకున్నారు. సదస్సు 12 తీర్మానాలను ఆమోదించింది. దేశంలోని 46 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో త్రివర్ణ పతాకం ఎగరేయాలన్నది ఆ తీర్మానాల్లో ఒకటి. విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు...ప్రత్యేకించి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో ఈ నెల 9న జరిగిన సమావేశం లోనూ, రెండు రోజులక్రితం పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం లోనూ దేశ వ్యతిరేక, జాతి వ్యతిరేక నినాదాలు మిన్నంటాయన్న ఆరోపణల నేపథ్యంలో సహజంగానే ఈ తీర్మానం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి పతాకాన్ని జేఎన్‌యూలో ఆవిష్కరించాలని కూడా నిర్ణయించారు. జాతీయ జెండాకు సముచితమైన గౌరవాన్ని కల్పిస్తూ ఏ పౌరుడైనా ఏడాది పొడవునా దాన్ని ఎగరేయవచ్చునని 2004లోనే సుప్రీంకోర్టు చెప్పింది. దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైనా, వివిధ ప్రభుత్వరంగ సంస్థల భవనాలపైనా ఆ జెండా ఎగురుతూనే ఉంది. కనుక ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని ప్రత్యేకించి తీర్మానించడమేమిటని కొందరికి అనిపిస్తుంది. దేశంలోని ఏ విశ్వవిద్యాలయమూ ఆ పతాకాన్ని ఎగరేయడం లేదేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ అది నిజం కాదు. ఇప్పుడు ఆందోళన కొనసాగుతున్న జేఎన్‌యూలో సైతం ఆ జెండా ఎగురుతోంది. తీర్మానం చర్చకొచ్చినప్పుడు జేఎన్‌యూ వైస్‌చాన్సలర్ జగదీశ్‌కుమార్ ఆ సంగతిని చెప్పారు. తాజా తీర్మానం ఆ పతాకానికి సంబంధించి నిర్దిష్టమైన సూచనలిచ్చింది గనుక అన్ని విశ్వవిద్యాలయా ల్లోనూ ఇకపై అది ఒకే తరహాలో ఉంటుంది. ఏ దేశ పతాకమైనా ఆ దేశ గౌరవ ప్రపత్తులకూ, సార్వభౌమత్వానికీ చిహ్నం. కనుక దాన్ని ఎగరేయాలని చెప్పడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. అయితే అదే సమయంలో ఎవరో కొందరు చేసిన నినాదాలను మొత్తం విద్యార్థులకు ఆపాదించి చూడటం...విద్యార్థుల్లో జాతీయ భావాలు, దేశభక్తి తగ్గిపోతున్నాయని ఆందోళనపడటం అనవసరం. బడి పిల్లలుగా ఉన్నప్పటినుంచి జెండా వందనాలు, దేశభక్తి గేయాలు వారిని ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి. ఉంటాయి. ఇప్పుడు రాజద్రోహం, కుట్ర వంటి అరోపణలతో నిర్బం దంలో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్ ఈనెల 11న చేసిన ప్రసంగాన్ని గమనిస్తే ఈ దేశంపట్లా, ఇక్కడి ప్రజలపట్లా విద్యార్థుల్లో ఎలాంటి అవగాహన ఉన్నదో...వారి దేశభక్తి ఏపాటిదో సులభంగానే తెలుస్తుంది. ఇక్కడ అమలవుతున్న కుల వ్యవస్థపై తమకు నమ్మకం లేదని, తమ విశ్వాసం ఈ దేశ రాజ్యాంగంపై మాత్రమేనని ఆయన చెప్పాడు. దేశంలో ప్రజాస్వామిక సంస్కృతి పెంపొందాలన్నాడు. కనుక దేశభక్తిలో విద్యార్థులు ఎవరికీ తీసిపోరు. కానీ తమ నిర్లక్ష్య వైఖరితో, సాచివేత ధోరణితో ఈ దేశ ప్రజలను నిరాశపరుస్తున్నది నాయకులే. కన్హయ్యకుమార్‌ను ఢిల్లీలోని పటియాల కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొచ్చినప్పుడు దాడిచేసిన న్యాయవాదుల చేతుల్లో జాతీయ జెండాలున్నాయి. కానీ వారు చేసిందేమిటి? విద్యార్థులపై, అధ్యాపకులపై, పాత్రికేయులపై దౌర్జన్యం చేశారు. తీవ్రంగా కొట్టారు.
మన పార్లమెంటుతోసహా చట్టసభలన్నిటిపైనా త్రివర్ణ పతాకం రెపరెప లాడుతుంది. కానీ దాని స్ఫూర్తిని స్వీకరిస్తున్నారా? అలా స్వీకరిస్తే మన చట్టసభలు చాలా భాగం వాయిదాల్లో ఎందుకు గడిచిపోతున్నాయి? అర్ధవంతమైన చర్చలకు తావులేని పరిస్థితులు ఎందుకుంటున్నాయి? కోట్లాదిమంది ప్రజల భవితవ్యాన్ని నిర్ణయించే కీలకమైన బిల్లులు సైతం ఎలాంటి చర్చకూ నోచుకొక గిలెటిన్ ఎందుకు అవుతున్నాయి? వేలాదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వారి సమస్యలను తీర్చడంపై పాలకులకు శ్రద్ధ కలగదేం? స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా పౌష్టికాహారలోపంతో పసిగుడ్డులు ఎందుకు మరణించవలసి వస్తున్నది? ఇవన్నీ మన నేతల దేశభక్తిని వెక్కిరించడంలేదా?
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యువ దళిత మేధావి రోహిత్ ఆత్మహత్య, అనంతరం జరిగిన ఆందోళన అనేక అంశాలను ఎజెండాలోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఉన్నదని...దళిత విద్యార్థులకు రావలసిన మార్కుల్లో కోతపెడుతున్నారని...కొన్ని సందర్భాల్లో గైడ్‌ను ఇవ్వకుండా వేధిస్తున్నారని విద్యార్థులు ససాక్ష్యంగా వివరించారు. ఇలాంటి వివక్ష కారణంగా సకాలంలో పీహెచ్‌డీని పూర్తిచేయలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారి భవిష్యత్తు దెబ్బతింటున్నదని చెప్పారు. ఆ ఆందోళనల తర్వాత వైస్ చాన్సలర్ల సమావేశం జరపాలని కేంద్రం నిర్ణయించడంతో ఈ అంశాలన్నీ వీసీల సమావేశం చర్చిస్తుందని అందరూ అనుకున్నారు. చర్చ ఏమేరకు జరిగిందోగానీ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకున్న చర్యలు పెద్దగా కనబ డవు. అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. మంచిదే. అయితే ఈ ఒక్క నిర్ణయమే మొత్తం పరిస్థితిని మార్చదు. ఫిర్యాదులు రుజువైతే కఠిన చర్యలుంటాయన్న భావం కలిగించాలి. వివక్ష ప్రదర్శించేవారిని కీలక బాధ్యతలనుంచి శాశ్వతంగా తప్పించాలి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని గౌరవించి, వాటి కార్యకలాపాల్లో ప్రభుత్వా లతోసహా బయటివారు జోక్యం చేసుకోకుండా ఉండటం ముఖ్యం. అప్పుడు మాత్రమే విశ్వవిద్యాలయాల ప్రాంగాణాల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. మెరికల్లాంటి వారిని సమాజానికి అందించగలుగుతాయి.