‘పులి పవరు’ కావాలా!
మన దేశంలో పారదర్శకంగా ఉండమంటే ఆమడ దూరం పారిపోతారుగానీ... అపరిమిత అధికారాలు కావాలని అడిగేవారికి లోటుండదు. ఆ జాబితాలో ఇప్పుడు ఎన్నికల సంఘం (ఈసీ) వచ్చి చేరింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో తమ సంస్థ పరువుతీసేలా ఆరోపణలు చేసేవారిని ధిక్కారనేరం కింద శిక్షించే అధికారం ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో ‘కొన్ని’ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిర్వహణను ప్రశ్నిస్తున్నారని, చిన్నపాటి ఆధారమైనా లేకుం డానే ఆ ప్రక్రియపై జనంలో అనవసర అపోహలు రేకెత్తిస్తున్నారని ఆ లేఖలో తెలిపింది. ఒకపక్క ఎన్నికల పనుల్లో తలమునకలై ఉండే ఈసీకి ఇవన్నీ అదనపు భారంగా మారి, వాటికి సంజాయిషీ ఇచ్చుకోవడానికే సమయం వెచ్చించాల్సి వస్తు న్నదని ఆ సంస్థ ఆవేదన చెందింది.
ఈసీ రాసిన ఈ లేఖ పూర్తి అవాస్తవాలతో కూడుకున్నదని ఎవరూ అనలేరు. ఎన్నికల కోలాహలంలో వివిధ పక్షాల నాయకులు ఈసీకి వినతులు సమర్పించు కోవడం... ఫలానా అధికారి పాలక పక్షంతో కుమ్మక్కయ్యారని ఫిర్యాదు చేయడం రివాజు. అందులో నిజానిజాలపై ఆరా తీసి చర్య తీసుకోవడం లేదా ఫిర్యాదులో నిజంలేదని చెప్పడం కూడా తరచు జరిగేదే. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇలా స్థానికంగా ఎన్నికలు నిర్వహించేవారిపైన కాక నేరుగా ఎన్నికల సంఘంపైనే ఆరోపణలు చేసింది. అది బీజేపీతో కుమ్మక్కై వోటింగ్ యంత్రాలనే తారుమారు చేసిందన్నది ఆ ఆరోపణల సారాంశం. తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఓ డమ్మీ ఓటింగ్ యంత్రంతో ఓట్లు ఎలా దారిమళ్లుతాయన్న అంశాన్ని ‘ప్రదర్శించి’ చూపింది. కాంగ్రెస్‌కీ, ఆప్‌కీ, మరో పార్టీకీ పడిన ఓట్లు బీజేపీ ఖాతాలోకి పోయి నట్టు అందులో ‘నిరూపించింది’.
ఆ విషయంలో ఎన్నికల సంఘానికీ, ఆప్‌కూ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఆప్ ఒక్కటి మాత్రమే కాదు... కాంగ్రెస్, బీఎస్‌పీలు కూడా ఈ మాదిరి ఆరోపణలే చేశాయి. దీనికితోడు ఢిల్లీ సర్కారు పార్ల మెంటరీ కార్యదర్శులుగా పదవులిచ్చిన 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో ఉంటున్నట్టు పరి గణించాలని కోరే ఫిర్యాదుపై రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘం అధికారులిద్దరు విచారణ జరుపుతుండగా ఆ అధికారుల నిష్పాక్షికతపై తనకు నమ్మకం లేదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పర్యవసానంగా వారిలో ఒకరు విచారణ నుంచి తప్పుకున్నారు. ఇక ఈవీఎంలపై ఆరోపణ కొత్తదేం కాదు. 2009లో దారుణంగా ఓటమిపాలైనప్పుడు చంద్రబాబు సైతం ఆ ఆరోపణే చేశారు. నవ్వులపాలయ్యారు.
ఆరోపణలొచ్చినప్పుడు వ్యక్తుల వ్యవహారశైలికీ, సంస్థలు స్పందించే తీరుకూ తేడా ఉంటుంది. వ్యక్తులు వారి వారి భావోద్వేగాలతో ఒక్కోసారి సహనం కోల్పో వడం, ఇష్టానుసారం అవతలివారిని దూషించడం, దౌర్జన్యం చేయడం తరచు కనబడుతుంటుంది. నియంతృత్వ దేశాల సంగతేమోగానీ... ప్రజాస్వామ్య వ్యవస్థ లున్నచోట సంస్థల స్పందన తీరు వేరుగా ఉండాలి. వాటికి ఓపిక అవసరం. వేలా దిమంది పనిచేస్తున్నందువల్లా, వారి పని విధానంలో ఉండే విస్తృతివల్లా ఆరోప ణలు రావడం అత్యంత సహజం. తాము నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నామని నిరూ పించగలిగినప్పుడు ఆరోపణలు చేసినవారే పలచన అవుతారు. మన ఎన్నికల సంఘానికి దేశంలోనేకాదు... ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు రావడమన్నది ఇంత వరకూ దానిపై ఒక్క ఆరోపణా లేకపోవడం వల్ల కాదు.
ఆ వచ్చిన ఆరోపణల్లో చాలామటుకు అవాస్త వమని అది ఎప్పటికప్పుడు నిరూపించుకోవడంతోపాటు... ఆరోపణ నిజమైన పక్షంలో బాధ్యులపై సత్వరం చర్య తీసుకోవడం వల్ల... భవి ష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టం చేయడం వల్ల! నిజమే కొన్ని అంశాల విష యంలో ఇప్పుడున్న అధికారాలు ఆ సంస్థకు చాలడం లేదు. ఉదాహరణకు భారీ యెత్తున నోట్లకట్టలు పట్టుబడినప్పుడు లేదా ఓటర్లను ప్రలోభ పెట్టేలా విలువైన సరుకులు పంచుతున్నప్పుడు అందుకు బాధ్యులైన అభ్యర్థులను గుర్తించి చర్య తీసుకోవడం దాని పరిధిలో లేదు. అలాగే ఎన్నికల్లో నెగ్గడమే ధ్యేయంగా బాధ్య తారహితంగా వాగ్దానాలు చేస్తూ, అధికారంలోకొచ్చాక వాటిని ఉల్లంఘించే పార్టీలను కూడా అది ఏమీ చేయలేకపోతోంది. ఇలా అనేక అంశాల్లో దానికున్న అధికారాల పరిధి తక్కువ. అవన్నీ కావాలని కోరితే ఎవరూ ఆక్షేపించరు. ఎందుకంటే ఆ అధికారాలు మొత్తంగా ఎన్నికల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల విశ్వసనీయతను పెంచుతాయి.
కానీ ఈసీ అడుగుతున్నదేమిటి? తప్పుడు ఆరోపణలు చేసినవారిని ధిక్కార నేరంకింద శిక్షించే అధికారం ఇమ్మంటున్నది. విఖ్యాత కథా రచయిత రావిశాస్త్రి పరి భాషలో చెప్పాలంటే ‘పులి పవరు’ (ఫుల్ పవర్) కావాలంటున్నది. అందుకు అది ఫిలిప్పీన్స్, ఘనా, పాకిస్తాన్, లైబీరియాల ఎన్నికల సంఘాలకున్న అధికారాలను చూపుతోంది. నిజానికి ఈ జాబితాలోని దేశాలకు ప్రజాస్వామిక దేశాలుగా పేరు ప్రఖ్యాతులేమీ లేవు. సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలన అక్కడ రివాజు. అలాంటిచోట ఎన్నికల సంఘాలకున్న అధికారాల సంగతి అటుంచి, వాటికుండే విశ్వసనీయత ఏపాటో ఎవరికీ తెలియదు. అసలు న్యాయ వ్యవస్థకు ‘కోర్టు ధిక్కార నేరం’కింద శిక్షించడానికుండే అధికారాలనే తొలగించాలని అనేకులు కోరుతు న్నారు. బ్రిటన్, అమెరికా వంటి దేశాలు సైతం ఈ మాదిరి అధికారాలను చాలా పరిమితం చేశాయి. ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థకూ, ఇలాంటి అధికారాలకూ పొసగదని ప్రజాస్వామికవాదులు భావిస్తారు.
ఇలాంటి తరుణంలో ఆ అధికా రాలూ తమకూ ఇవ్వాలని ఈసీ కోరడం విపరీతమనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో కీలకమని భావించే ఎన్నికలు నిర్వహించాల్సిన సంస్థ దృక్పథం ప్రజాస్వామికం గానే ఉండాలి తప్ప దానికి విరుద్ధంగా కనబడకూడదు. ఈ మాదిరి అధికారాలు కావాలనడానికి బదులు ఓటర్ల జాబితాలో ఉన్నట్టుండి కొందరి పేర్లు ఎందుకు మాయమవుతాయో, బోగస్ ఓటర్లు ఎలా వచ్చి చేరతారో... ఈ జాడ్యాన్ని అరి కట్టడానికి, బాధ్యులను శిక్షించ డానికి తీసుకోవాల్సిన చర్యలేమిటో ఈసీ చర్చిస్తే, పరిష్కారాలను కనుగొంటే బాగుంటుంది.