అడిగే నాథుడు లేక అయిదేళ్లుగా రాష్ట్రానికి ఏ ప్రాజెక్టునూ ఇవ్వ కుండా రైల్వే బడ్జెట్‌లను కానిచ్చేస్తున్న యూపీఏ ప్రభుత్వ సంప్రదా యాన్నే ఎన్డీయే సర్కారు కూడా కొనసాగించదల్చుకున్నట్టుంది. కాక పోతే, ఈసారి విభజన సాకుతో ఆ పనిచేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఒక కమిటీ వేశామని, ఆ నివేదికొచ్చాక ఒరగబెడతామన్న హామీ తప్ప ఈ బడ్జెట్‌లో అటు తెలంగాణకైనా, ఇటు ఆంధ్రప్రదేశ్‌కైనా దక్కిందేమీ లేదు. కొత్తగా ఆంధ్రప్రదేశ్‌కు ఒక ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇచ్చారు. ఇది సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ తరహాలోనే విజయవాడ - న్యూఢిల్లీ మధ్య ఉంటుంది. అయితే, ఈ ఎక్స్‌ప్రెస్‌ను ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించాలో, లేదో అర్థం కాని పరిస్థితి. ఆ రైలు విజయవాడలో బయలుదేరిన గంటకల్లా తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి వరంగల్ చేరాక దాని ప్రయాణమంతా ఏపీ ఎక్స్‌ప్రెస్ దోవనే వెళ్తుంది. ఏతా వాతా బయలుదేరే స్టేషన్ తప్ప మిగిలిన ప్రయాణమంతా తెలం గాణ ప్రాంతంలోనే ఉంటుంది. సీమాంధ్రకు మేలు చేద్దామన్న సంకల్పం ఉంటే, ఆ ప్రాంతంలోని జిల్లాలకు ప్రయోజనం చేకూ రుద్దా మనుకుంటే దాన్ని విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిపాల్సింది. రైల్వే బడ్జెట్‌కు రూపకల్పన చేసేటపుడు రాష్ట్రాలను సంప్రదించే సంప్ర దాయం ఉంటే ఇలాంటి లోపాలు సరిదిద్దే అవకాశం ఉంటుంది. కానీ, అటు కేంద్రానికీ ఈ ఆలోచన ఉండదు. ఇటు రాష్ట్ర ప్రభు త్వాలూ పట్టించుకోవు. అందువల్లే కాబోలు... ప్రకటించిన 18 కొత్త రైలు మార్గాల సర్వేల్లో ఉభయ రాష్ట్రాలకూ ఒక్కటీ లేదు. రైళ్ల పొడిగింపులోగానీ, డబ్లింగ్, గేజ్ మార్పిడి వంటి పనుల్లోగానీ, తీర్థ యాత్రల రైళ్లలోగానీ రెండు రాష్ట్రాలకూ ఇచ్చిందేమీ లేదు. మొత్తానికి ఎంపీలు ఇచ్చిన వినతులన్నీ ఎప్పటిలా బుట్టదాఖలా అయినట్టే కనిపిస్తున్నది. మన దక్షిణ మధ్య రైల్వే లాభాలు గడించే రైల్వే జోన్లలో అగ్రభాగాన ఉన్నా అందుకు తగినట్టుగా ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు, రైళ్లు రావడంలేదు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నది. పదమూ డేళ్లక్రితం అనుమతి లభించిన కోటిపల్లి-నర్సాపురం రైలు మార్గం నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. 1999లో అనుమతి వచ్చిన కాకి నాడ-పిఠాపురం లైను పరిస్థితీ అలాగే ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు మంజూరైన నిజామా బాద్ - పెద్దపల్లి మార్గం ఇప్పటికీ పూర్తికాలేదు. ఇక కాజీపేట వ్యాగన్ల తయారీ పరిశ్రమదీ అదే స్థితి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్, తెలం గాణలకు ఇంత అన్యాయం చేసిన రైల్వే బడ్జెట్ మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగాల్సిన మహారాష్ట్రపై ఎక్కడలేని ప్రేమనూ ప్రదర్శించింది.
రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) అంగీకరిస్తే భద్ర త విషయమై రాజీపడినట్టే అవుతుందని కేంద్ర హోంశాఖ అభ్యం తరపెట్టినట్టు వార్తలొచ్చాయి. అందువల్ల రైల్వేలకు సంబం ధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగానికి మాత్రమే ఎఫ్‌డీఐలను పరిమితం చేస్తామని రైల్వే మంత్రి సదానందగౌడ ప్రకటించారు. అలాగే, పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత విస్తృతపరుస్తామ న్నారు. రైల్వేల్లో సంస్కరణలకు గత ప్రభుత్వం అంకురార్పణ చేస్తే ఎన్డీయే ప్రభుత్వం దాన్ని మరింత ముందుకు తీసుకుపోదల్చుకు న్నట్టు ఈ ప్రతిపాదనలను గమనిస్తే అర్థమవుతుంది. రూ. 9 లక్షల కోట్లు అవసరంకాగల బృహత్తర ప్రాజెక్టు వజ్ర చతుర్భుజిని చేప ట్టబోతున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కింద మెట్రో నగరా లన్నిటికీ బులెట్ రైళ్లు నడుపుతారు. ముందుగా ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య దీన్ని ప్రారంభిస్తారు. తొలుత ప్రారంభ మయ్యే బుల్లెట్ రైలు కోసమే రూ. 60,000 కోట్లు వ్యయమవు తాయి. ఇంత ఖర్చయ్యే ఈ బుల్లెట్ రైలుకు ప్రధాని స్వస్థలాన్ని ఎంచుకోవడం కూడా రైల్వే శాఖ సంప్రదాయానికి అనుగుణంగానే ఉంది. గతంలో రైల్వే మంత్రులుగా ఉన్నవారంతా తమ రాష్ట్రాలకు ముఖ్యమైన ప్రాజెక్టులను, రైళ్లను సమకూర్చుకున్నారు.
ఆ సంగతలా ఉంచి ఈ ఆరున్నర దశాబ్దాల్లో మన పాలకులు నిర్మించిన కొత్త రైలు మార్గం 11,000 కిలోమీటర్లు మించలేదు. ప్రతి బడ్జెట్‌లోనూ కొత్త రైల్వే లైన్లకు సర్వేలు చేస్తామని ప్రకటించడమే తప్ప చేసినవాటి అతీగతీ ఏమైందో తెలియదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు 5,000 కిలోమీటర్ల మేర 36 కొత్త రైలు మార్గాల కోసం సర్వే చేయించారు. వాటిలో 9 మినహా అన్నీ పూర్త య్యాయని చెప్పారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలకూ ఒక్కటంటే ఒక్క కొత్త రైలు మార్గం రాలేదు. చాలాచోట్ల కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు ప్రమాదాలకు నిలయమవుతున్నాయి. అలాగే, నాసిరకం ట్రాక్‌లు రైలు ప్రయాణమంటేనే హడలెత్తిస్తున్నాయి. వీటిగురించి శ్రద్ధ పెడ తామని చెప్పడం తప్ప అందుకు సంబంధించిన నిర్దిష్ట ప్రణాళికేమీ బడ్జెట్‌లో లేదు. మోడీ సర్కారు ముందు ఇలాంటివాటి సంగతి చూసి బులెట్ రైలు వంటి ప్రతిపాదనలు సిద్ధంచేస్తే బాగుండేది. ఇక బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందే రూ. 8,000 కోట్ల మేర ప్రయాణి కుల చార్జీలను పెంచారు గనుక బడ్జెట్‌లో దాని జోలికెళ్లలేదు. అయితే, గత ఫిబ్రవరినాటికి ప్రయాణికుల తరలింపులో రైల్వేలకు రూ. 30,000 కోట్ల నష్టం వచ్చిందని రైల్వే మంత్రి చెబుతున్నారు. కనుక మరో బడ్జెట్ వచ్చే లోపల చార్జీలు పెరగబోవన్న భరోసా ఏమీ లేదు. మొత్తానికి సంస్కరణలంటూనే పాత వాసనలు వదులు కోని రైల్వే బడ్జెట్ తెలుగు రాష్ట్రాలు రెండింటికీ నిరాశనే మిగిల్చింది.
ఉభయ రాష్ట్రాలకూ నిరాశే!
Published Wed, Jul 9 2014 12:32 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement