‘పుట్టుకతో వచ్చిన బుద్ధి’ని ఓ పట్టాన వ దులుకోలేనని పాకిస్థాన్ నిరూపించుకుంటూనే ఉంది. అధీనరేఖ వద్ద గత పక్షం రోజులుగా వరసబెట్టి చోటుచేసుకుంటున్న ఘటనలకు పరాకాష్టగా ఆదివారం భారీయెత్తున ఆయుధాలు, మందుగుండు పట్టుబట్టాయి. అందులో ఏడు ఏకే-47 రైఫిళ్లు, 10 పిస్టల్స్, గ్రెనేడ్లు, రేడియోసెట్లు ఉన్నాయి. గత నెల 24 నుంచి ఆ సెక్టార్‌లో 30, 40 మంది మిలిటెంట్లు కాశ్మీర్‌లో చొరబడటానికి ప్రయత్నించారని మన సైన్యం చెబుతున్న వివరాలనుబట్టి తెలుస్తోంది. 1999లో జరిగిన కార్గిల్ చొరబాట్లను గుర్తుకుతెచ్చేలా ఇవి చోటుచేసుకున్నాయన్నది సైన్యం విశ్లేషణ.
ఒకపక్క సెప్టెంబర్ 29న ప్రధాని మన్మోహన్‌సింగ్, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. ఆ సమావేశానికి చాలా ముందే ఆ సమావేశాన్ని భగ్నంచేసే ఉద్దేశంతో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం, మిలిటెంట్ల చొరబాటును ప్రోత్సహించడం ముమ్మరం చేసింది. వారిద్దరి సమావేశంలో ఇవన్నీ చర్చకొచ్చాయి. ఇలాంటి ఘటనలను నివారిస్తే తప్ప ఇరుదేశాలమధ్యా సామరస్యపూర్వక సంబంధాలు నెలకొనే అవకాశం లేదని మన్మోహన్‌సింగ్ చెప్పారు. ఈ తరహా ఉల్లంఘనలను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవడానికి ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరళ్ల (డీజీఎంఓ) సమావేశం జరగాలని నిర్ణయించారు కూడా. చర్చలు ముగిశాయి. ఆ సమావేశం ఎప్పుడు జరగాలన్న అంశంపై రెండుదేశాలూ ఇంకా సంప్రదించుకుంటున్నాయి. కానీ, దానికి సమాంతరంగా సరిహద్దుల్లో ఉల్లంఘనలు సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధీనరేఖలోని పూంఛ్ సెక్టార్‌లో ఇవి ఈమధ్య కాలంలో బాగా పెరిగాయి.
ఇప్పుడు సాగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘన ఉద్దేశం ఉగ్రవాదులను భారత్‌లోకి ప్రవేశపెట్టడమేనని మన సైన్యం చెబుతున్నది. సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం ఉంటే ప్రత్యేకించి డీజీఎంఓల సమావేశమే జరగనవసరం లేదు. మన డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా, పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ అమీర్ రియాజ్‌లు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలా మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని గత జనవరినుంచి పాకిస్థాన్ కల్పిస్తూనే ఉంది. ఇద్దరు భారత జవాన్ల తలలు నరికినప్పటినుంచి సరిహద్దులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. అప్పటినుంచీ ఒక్క పూంఛ్ సెక్టార్‌లోనే తరచు ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్క ఆగస్టులోనే అక్కడ 32 ఉల్లంఘనలు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. సెక్టార్లవారీగా చూస్తే సెప్టెంబర్ నెలలో పూంఛ్‌లో 20, రాజౌరిలో 11, బాండీపూరాలో 3 ఉల్లంఘనలు జరిగాయి. సరిగ్గా ఇరుదేశాల ప్రధానులూ సమావేశం కావడానికి మూడురోజుల ముందు జమ్మూ సెక్టార్‌లోని రెండు జిల్లాల్లో ఉగ్రవాదులు రెండుచోట్ల దాడిచేసి ఆరుగురు పోలీసులు, నలుగురు జవాన్లతోసహా 12 మందిని కాల్చిచంపారు.
మిగిలిన ఘటనలైతే కట్టుకథలని పాక్ కొట్టిపారేయొచ్చుగానీ జమ్మూ సెక్టార్‌లోనూ, కేరన్‌లోనూ జరిగినవి చొరబాట్లేనని స్పష్టంగా రుజువవుతున్నది. ఉగ్రవాదులను దేశంలోకి ప్రవేశపెట్టి విధ్వంసాలను ప్రేరేపించడమే వాటి లక్ష్యం. అయితే, ఇలాంటి చొరబాట్లుగానీ, అతిక్రమణలుగానీ లేనేలేవని పాకిస్థాన్ హైకమిషనర్ సల్మాన్ బషీర్ అంటున్నారు. ఇదంతా మీడియా చేస్తున్న అనవసర రాద్ధాంతంగా ఆయన తేల్చేశారు. రెండు దేశాలూ తమ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి విస్తృతస్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. న్యూయార్క్‌లో ఇరుదేశాల ప్రధానులు చర్చలకు కూర్చోవడానికి ముందు సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటనలు ఎంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించాయో అందరూ చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు మన్మోహన్ వెళ్లకూడదని ఒత్తిళ్లు వచ్చాయి. అయినా, మన్మోహన్ పాకిస్థాన్‌తో సంబంధాల మెరుగుదలకు ఇవి తప్పనిసరని భావించారు. వీటన్నిటినీ పాకిస్థాన్ పరిగణనలోకి తీసుకుని తనవైపుగా ఉంటున్న లోపాలను సరిదిద్దుకోవాల్సింది. కానీ, అలాంటి ఛాయలెక్కడా కనిపించడంలేదు. ముఖ్యంగా కేరాన్ సెక్టార్‌లో భారీయెత్తున పట్టుబడిన మారణాయుధాలను చూస్తే భారత్‌తో సత్సంబంధాలు ఏర్పడటం పాకిస్థాన్ సైన్యానికి ఇష్టంలేదనిపిస్తుంది.
పాకిస్థాన్ హైకమిషనర్ చెబుతున్న లెక్కలనుబట్టి చూస్తేనే పాకిస్థాన్‌లో గత వంద రోజుల్లో 110 ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ఎందరో పౌరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఈ దాడులను ఎందుకు నిరోధించలేకపోతున్నామో పాక్‌లో ఎంతవరకూ ఆత్మపరిశీలన జరుగుతున్నదో అనుమానమే. అక్కడ జరుగుతున్న ఘటనల్లోనూ, సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటనల్లోనూ మిలిటెంట్లదే కీలకపాత్ర. తాము దేశంలో నిరోధించలేకపోతున్న మిలిటెంట్లే సరిహద్దుల్లోనూ సంచరించగలుగుతున్నారంటే అర్ధం ఏమిటి? దేశంలో అయితే, వారు ఎక్కడెక్కడ మెరుపుదాడులకు దిగుతారో అంచనా ఉండటంలేదను కోవచ్చు. కానీ, సరిహద్దుల్లో అలా కాదు. అక్కడ గస్తీ తిరుగుతున్న సైన్యం తప్ప మరెవరూ ఉండటానికి ఆస్కారంలేదు. తమ సరిహద్దుల్ని రెప్పవాల్చని నిఘాతో రక్షించే సైన్యానికి అటునుంచి భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మిలిటెంట్లు కనబడటంలేదంటే ఎవరైనా నమ్ముతారా? ఈమధ్య జరిగిన చర్చల్లో తమవైపుగా తప్పులు జరగకుండా చూస్తానని నవాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. కానీ, ఈ ఘటనలు చూస్తుంటే పాక్ సైన్యం ముందు ఆయన నిస్సహాయుడిగా మిగిలారని... తన హామీలను అమలుచేయించగల స్థితి ఆయనకు లేదని అర్ధమవుతోంది. ప్రధానిగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయంలో ఆయన ప్రేక్షకుడిగా మిగిలిపోవడం విచారకరం. సమస్యలకు పరిష్కారం కనుగొనే విషయాన్ని రాజకీయ నాయకత్వానికి వదలాలని ఆయన తమ సైన్యానికి ఇప్పటికైనా నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే, సమస్యలు మరింత ముదిరే ప్రమాదం ఉందని గ్రహించాలి.