భారత–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నెలరోజులుగా ఏర్పడ్డ ప్రతిష్టంభన సడలుతున్న సూచనలు కనబడుతున్నాయి. భారత సైన్యానికి, చైనా సైన్యానికి మధ్య కోర్ కమాండర్ల స్థాయి చర్చల పరంపరలో అవగాహన కుదరడంతో వివాదాస్పద సరిహద్దులనుంచి ఇరు దేశాల సైన్యాలూ 2 కిలోమీటర్లు వెనక్కు వెళ్లాయని రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ చర్చలకు కొనసాగింపుగా బుధవారం మేజర్ జనరల్ స్థాయి చర్చలు దాదాపు అయిదు గంటలపాటు సాగాయి. రాగలరోజుల్లో ఈ చర్చలు ఇంకా కొనసాగుతాయి. ఎల్‌ఏసీ వద్ద చైనా సైన్యం మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని వివిధ పార్టీలు గత కొద్ది రోజులుగా ఆరోపిస్తుండగా కేంద్ర ప్రభుత్వం మౌనంగా వుండిపోయింది. దాంతో అందరిలో కొంత అయోమయం ఏర్పడింది. ఇప్పుడు ఉద్రిక్తతలు పాక్షికంగా ఉపశమించాయని మాత్రమే చెప్పవచ్చు. ఎందుకంటే వివాదం ఏర్పడిన ప్రాంతాల్లో ఒక్క గాల్వాన్ లోయ వద్ద మూడుచోట్ల మాత్రమే సైన్యాలు వెనక్కి వెళ్లాయి. ప్యాంగాంగ్ సరస్సు, చుశాల్ ప్రాంతాల్లో పరిస్థితి యధాతథంగా ఉన్నదంటున్నారు. గత నెల 5న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో మన భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా సైన్యం అక్కడ కొన్ని కాంక్రీట్ నిర్మాణాలు కూడా మొదలెట్టింది. ఇప్పుడు చైనా సైన్యం వెనక్కు వెళ్లడం స్వాగతించదగ్గదే అయినా ఆ కాంక్రీట్ నిర్మాణాలు తొలగించినప్పుడే ఉద్రిక్తతలు పూర్తిగా సమసిపోయాయని అనుకోవాలి. ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకూ వుండే పర్వత ప్రాంతాలను ఇప్పటికీ ఆక్రమించుకునేవుంది. చైనా సేనలు శతఘ్నులతో 20 వాహనాల్లో దాదాపు 3 కిలోమీటర్ల లోనికి చొచ్చుకొచ్చాయని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఆ సమయంలో తమ సరిహద్దుల్లో అది దాదాపు ఏడువేలమంది అదనపు బలగాలను దించిందంటున్నారు. చొచ్చుకొచ్చిన సేనలు వెనక్కెళ్లింది కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే. కనుక పూర్తి స్థాయిలో సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఆ ప్రాంతం మొత్తంలో యధాపూర్వ స్థితిని నెలకొల్పాలని మన దేశం చైనాను కోరుతోంది.
ఎల్‌ఏసీ వద్ద హద్దుమీరి చొచ్చుకురావడం, వివాదం సృష్టించడం చైనాకు అలవాటుగా మారింది. చొరబాట్లకు పాల్పడి, గొడవకు దిగటం ఆ దేశానికి రివాజైంది. యూపీఏ హయాంలో ఏడెనిమిదేళ్లక్రితం దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద కూడా చైనా ఈ పనే చేసింది. 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్‌ఏసీలో నెహ్రూ కాలంనుంచే కొన్ని ప్రాంతాలు వివాదాస్పదంగా వున్నాయి. గత ఏడు దశాబ్దాల్లో చొరబాట్ల ద్వారా ఆ వివాదాస్పద ప్రాంతాల జాబితాను చైనా పథకం ప్రకారం పెంచుకుంటూ పోతోంది. మొన్న చైనా సైన్యం చొరబడేవరకూ గాల్వాన్ ప్రాంతం వివాదాస్పదమైనది కాదు. అక్కడికి చొరబడటంతోపాటు ఆ ప్రాంతంలో మన సరిహద్దు రహదారి సంస్థ(బీఆర్‌ఓ) డర్బుక్–షైలాక్–దౌలత్‌బేగ్ ఓల్డీ వరకూ నిర్మిస్తున్న రోడ్డుకు అభ్యంతరం చెబుతోంది. దాని నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో మన సేనల కదలికలు సులభతరమవుతాయి. ఇప్పటికే మన దేశం షైలాక్ నదిపై 430 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణం పూర్తి చేసింది. అక్కడ మాత్రమే కాదు...ఉత్తర సిక్కింలోని నకులా సెక్టార్ దగ్గర కూడా గత నెలలో చైనా సైనికులు ఘర్షణకు దిగారు. మూడేళ్లక్రితం డోక్లాం ట్రైజంక్షన్ వద్ద కూడా చైనా ఇలాంటి లడాయే పెట్టుకుంది. అక్కడ దాదాపు 73 రోజులపాటు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 20 ఏళ్లక్రితం మన సైనికులు కార్గిల్ సెక్టార్‌లో పాకిస్తాన్ సేనలను తరిమికొట్టే పనిలో నిమగ్నమై వున్నప్పుడు అదే అదునుగా ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో మన భూభాగంలోకి అయిదు కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చి రోడ్డు నిర్మించింది. ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరలేపింది. గత నెల మొదటివారం నుంచీ సరిహద్దుల్లో చైనా సేనలు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో హడావుడి చేస్తున్నాయని వార్తలొచ్చాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెబుతున్నట్టు వాస్తవాధీన రేఖ విషయంలో మొదటినుంచీ భారత్, చైనాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో కొంత, పడమరనున్న అరుణాచల్ ప్రదేశ్ లోని కొంత భాగం తమకు సంబంధించిన సెక్టార్లని చైనా వాదిస్తూ వస్తోంది. 1911లో క్వింగ్ రాచరికం కుప్పకూలినప్పుడు తనకు తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న టిబెట్‌ను దాని ప్రమేయం లేకుండానే బ్రిటన్ 1914లో చైనాతో కుదిరిన సిమ్లా ఒప్పందం ద్వారా చైనాకు ధారాదత్తం చేసింది. అది తనదేనని చైనా చెప్పుకోవడానికి మూలకారణం ఆ ఒప్పందమే. 1950లో జన చైనా ఏర్పడ్డాక ఈ సరిహద్దు వివాదాలపై మన దేశం దానితో సమగ్రంగా చర్చించి అవగాహనకొచ్చివుంటే ఇన్ని సమస్యలు ఏర్పడేవి కాదు. అది జరగకపోవడంతో చైనా సరిహద్దు కాంక్షలు పెరిగిపోతున్నాయి.
సరిహద్దుల్లో వున్న దేశంతో సమస్యలొచ్చినప్పుడు సామరస్యపూర్వకంగా పరిష్కారం సాధించడానికి ప్రయత్నించాల్సిందే. అవి సైనికాధికారుల స్థాయిలో, దౌత్య స్థాయిలో, అధినేతల స్థాయిలో కొనసాగుతూనే వుండాలి. కానీ ఇలాంటి చొరబాట్ల వెనక వేరే వ్యూహాలు కూడా వుంటాయి. మన దేశం అమెరికాతో సన్నిహితం కావడం చైనాకు నచ్చడం లేదు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తన ప్రయోజనాలను దెబ్బతీసేలా అమెరికా పావులు కదుపుతోందని, అందులో భారత్ భాగస్వామిగా మారుతోందని చైనా ఆందోళన. కనుకనే సరిహద్దుల్లో ఈ వివాదాలు. ఏవో సాకులు చూపించి సైన్యాలను మోహరించుకోవడం, ఘర్షణలు పెంచుకోవడం ఏ దేశానికీ మంచిది కాదు. అవి చివరకు పెను ఉద్రిక్తతలకు దారి తీసి యుద్ధాలకు కారణమవుతాయి. ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఫలించి, ఇరు దేశాల మధ్యా సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడితే, చర్చల ద్వారా సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment