సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఊహించని పరిణామాలేర్పడతాయని కొంతకాలంగా నిపుణులు చేస్తున్న విశ్లేషణల్ని నిజం చేస్తూ అమెరికా పావులు కదుపుతోంది. పెరుగుతున్న చైనా ఆర్థిక శక్తిని అడ్డుకోవడానికి అమెరికా–యూరప్ యూనియన్(ఈయూ)లు బలమైన వ్యూహాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఉందంటూ గురువారం ఈయూ నేతలతో జరిపిన వీడియో భేటీలో అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో చేసిన సూచన, అందుకు ఆ దేశాలు సుముఖత కనబర్చడం కీలకమైనది. స్వేచ్ఛాయుత ప్రపంచంవైపుంటారా లేక నిరంకుశ చైనా వైపుంటారా తేల్చుకోమని తాము ఎవరినీ కోరడం లేదని, చైనాయే అందరినీ ఆ పరిస్థితికి నెడుతోందని ఈ సమావేశంలో పాంపియో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఈయూ రెండు పడవ లపై కాళ్లు పెట్టి ప్రయాణిస్తోంది. అమెరికా మాదిరే దానికి కూడా చైనా అనుసరిస్తున్న విధానాలపై చాన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తి వుంది.
మేధోపరమైన హక్కుల్ని అపహరించడంలో చైనా ముందుం టున్నదని మొన్న జనవరిలో ఈయూ విడుదల చేసిన ద్వైవార్షిక నివేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే వాణిజ్యంలో అది అనుసరిస్తున్న పోటీ విధానాలు కూడా ఈయూకు మింగుడుపడటం లేదు. అయినా చైనాపై వాణిజ్య యుద్ధానికి అమెరికా చేస్తున్న ప్రతిపాదనకు ఈయూ సుముఖత చూపడం లేదు. పైగా మధ్యే మార్గాన్ని అనుసరిస్తోంది. వాణిజ్య సంబంధాల విషయంలో, మేధోపరమైన హక్కుల చౌర్యం విషయంలో ఎలాంటి అసంతృప్తివున్నా ఆ సంబంధాలను యధాతథంగా కొన సాగిస్తోంది. ఉద్రిక్తతల్ని పెంచే విధానాలకు దూరంగా వుంటోంది. కానీ రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా వుండవు. ప్రపంచంలోనే ఈయూ అతి పెద్ద వాణిజ్య కూటమి. మొన్న సోమవారం అది చైనాతో జరిపిన చర్చల్లో కొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలుపెడదామంటూ ఒత్తిడి తెచ్చింది. అలాగే ఈయూలో పెట్టుబడిని పెంచాలని కోరింది.
ఇటీవల ఈయూకు కూడా సభ్యత్వం ఉన్న జీ–7 దేశాల విదేశాంగమంత్రుల భేటీ చేసిన తీర్మానం హాంకాంగ్‌లో చైనా తీసుకొచ్చిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. ఈ నెల మొదట్లో ఈయూ ఉన్నత స్థాయి ప్రతినిధి బోరెల్ అమెరికా విదేశాంగమంత్రితో ఆన్‌లైన్ భేటీ జరిపి చైనాకు వ్యతిరేకంగా అట్లాంటిక్ ప్రాంత దేశాల కూటమిని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా వున్నామని చెప్పడం అమెరికాకు సంతోషం కలిగించే అంశమే. ఈ పరిణామాలన్నిటినీ జాగ్రత్తగా గమనించడం మన దేశానికి అవసరం. చైనా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద గల్వాన్‌లోయలో దూకుడుగా ప్రవర్తించి మనతో కయ్యానికి కాలుదువ్వుతున్నట్టే ఇతర దేశాలతోనూ వ్యవహరిస్తోంది. అంతర్జాతీ యంగా కూటములు రూపుదిద్దుకునే ప్రక్రియ ఇంకా ప్రాథమిక స్థాయిలోనేవున్నా, అన్నిటినీ నిశి తంగా పరిశీలిస్తూ మన ప్రయోజనాలకు ఏది తోడ్పడగలదో మన దేశం తేల్చుకోవాల్సివుంటుంది. శుక్రవారం మీడియాలో వచ్చిన కథనాలను చూస్తే గల్వాన్ లోయలో చైనా తీరుతెన్నులు ఏమాత్రం మారలేదని అర్థమవుతుంది.
గల్వాన్‌లోయ, హాట్‌స్ప్రింగ్స్, ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతాల వద్ద ఇప్పటికీ చైనాకు చెందిన ప్రజా విముక్తి సైన్యం(పీఎల్‌ఏ) కదలికలు యధాతథంగా వున్నాయని ఆ కథనాలు చెబుతున్నాయి. ఈ నెల 22న కోర్ కమాండర్ల స్థాయి చర్చలు జరిగినా పరిస్థితిలో ఆవగింజంత మార్పు రాలేదు. ఎల్‌ఏసీ వద్ద సాయుధ బలగాల మోహరింపును అది మే నెలలోనే మొదలుపెట్టిందని తాజాగా మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన వెల్లడించింది. ఇదంతా యధావిధిగా కొనసాగిస్తూనే భారత్‌తో చర్చలకు సిద్ధంగా వున్నామంటూ ఇప్పటికీ అది నంగనాచి కబుర్లు చెబుతోంది. పైగా పరిస్థితి సంక్లిష్టం కావడానికి మన దేశమే కారణమంటోంది. రెండు దేశాల మధ్యా వివిధ సందర్భాల్లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు, మరీ ముఖ్యంగా 1993 నాటి ఒప్పం దంలో ‘ఇరు దేశాలూ సైన్యాలను కనిష్ట స్థాయిలో వుంచుకుని, మంచి ఇరుగు పొరుగుగా వుందా మని, స్నేహపూర్వకంగా మెలగుదామ’ని రాసుకున్నా చైనా అందుకు భిన్నమైన పోకడలకు పోతోంది. ఇప్పుడే కాదు... గతంలో అనేక సందర్భాల్లో అది రుజువైంది. చుమార్, దౌలత్‌బేగ్, డోక్లాం వగైరాల్లో అది వందలసార్లు అతిక్రమణలకు పాల్పడి గిల్లికజ్జాలు పెట్టుకుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరిగే సూచనలు కనబడటంతో ముందుజాగ్రత్త చర్యగా గల్వాన్ లోయలో బలగాలను పెంచుకుని దబాయింపులకు దిగుతోంది.
కరోనా వైరస్ వ్యాప్తికి పూర్తి బాధ్యత చైనాదేనంటూ అమెరికా, పాశ్చాత్య దేశాలు విరుచుకు పడుతున్నాయి. హాంకాంగ్‌లో అది తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా ఒక్కటవు తున్నాయి. వాణిజ్య, మేధో రంగాల్లో చైనాతో ఆ దేశాలకు వున్న విభేదాలు సరేసరి. ఇలా పలు సమ స్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనాకు వ్యతిరేకంగా భారత్ తమతో జట్టు కడుతుందని అమెరికా, పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. మనపట్ల చైనా అనుసరిస్తున్న ధోరణివల్ల అది జరగవచ్చు కూడా. అయితే ఆ దేశాలకు చైనాతో ఏర్పడ్డ విభేదాలకున్న మూలాలు వేరు. మనకు చైనాతో వున్న పొర పొచ్చాల స్వభావం వేరు. స్థానికంగా రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య వచ్చే సరిహద్దు తగాదాల విషయంలో అమెరికా అయినా, ఇతర పాశ్చాత్య దేశాలైనా ఒక స్థాయి వరకూ మాత్రమే మద్దతి స్తాయి. అటు తర్వాత గోడ మీద పిల్లివాటంగా వ్యవహరిస్తాయి. వాటిని మన చొరవతో మనమే పరిష్కరించుకోగలం తప్ప ఆ దేశాల సాయం పరిమితంగానే వుంటుంది. మనతో సన్నిహితంగా వుంటున్నా పాకిస్తాన్ విషయంలో అమెరికా గత కొన్ని దశాబ్దాలుగా ఎలా వ్యవహరిస్తున్నదో, చివరకు అప్ఘాన్ అంశంలో అది ఎవరికి మేలుచేసే నిర్ణయం తీసుకున్నదో తెలుస్తూనే వుంది. కనుక మన స్వీయ ప్రయోజనాల పరిరక్షణ గీటురాయిగా మన అడుగులుండాలి.
Comments
Please login to add a commentAdd a comment