‘‘వివ్ రిచర్డ్స్ ఆడగా నేను ఎప్పుడూ చూడలేదు. కానీ సెహ్వాగ్ నాకు అలాంటి ఆటను చూపించాడు. నేరుగా ఆ విధ్వంసాన్ని చూడగలిగిన నేను అదృష్టవంతుడిని...’’- భారత కెప్టెన్ ధోని చేసిన ప్రశంస ఇది. ఆధునిక క్రికెట్‌లో ఇప్పుడు ఎంతో మంది బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటాన్ని చూస్తున్నాం. కానీ ఆటకు ఈ దూకుడు నేర్పింది సెహ్వాగ్. తర్వాతి వారందరూ అతడిని అనుసరించినవారే. టెస్టు మ్యాచ్ డ్రా కావడం ఖాయమనిపించిన చోట ‘జీతేంగే భాయ్’... అంటూ కెప్టెన్‌కు ధైర్యం ఇవ్వగల ఆటగాడు వీరేంద్రుడు ఒక్కడే. తొలి అంతర్జాతీయ వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన సెహ్వాగ్ తన ముద్ర చూపించడానికి రెండేళ్లు పట్టింది. దమ్మున్నవారికే అదృష్టం కలిసొస్తుంది అన్నట్లుగా సచిన్ గాయం కారణంగా ఓపెనింగ్ చేసే అవకాశం రావడంతో 69 బంతుల్లోనే చేసిన సెంచరీ... వీరూ కెరీర్‌నే కాదు, భారత క్రికెట్ రాతను కూడా మార్చింది. ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంగా మారిన సెహ్వాగ్ మంచినీళ్లప్రాయంలా పరుగులు సాధిస్తూ రికార్డులు కొల్లగొట్టాడు.
సంప్రదాయానికి భిన్నమైన సెహ్వాగ్ బ్యాటింగ్ శైలి, ఆటను అతను చూసే తీరు టెస్టు క్రికెట్‌కు కూడా కొత్త ఆకర్షణను తెచ్చింది. టెస్టులు అంటే నిస్సత్తువగా సాగే బోరింగ్ మ్యాచ్‌లు... ఓపెనర్లు అంటే బంతులు వదిలేయడమే కానీ పరుగులు రావనే పాత కాలపు మాటల కోటలను సెహ్వాగ్ బద్దలు కొట్టాడు. టెస్టుల్లో కూడా వినోదం లభిస్తుందనేది సెహ్వాగ్ మాత్రమే చూపించగల ప్రదర్శన. ఒక్క రోజులో 284 పరుగులు చేసినా... రెండు సెషన్లలోనే ఆసీస్ గడ్డపై 195 పరుగులు బాదినా, అది అతనికే చెల్లింది. సున్నితమైన విధ్వంసం ఎలా ఉంటుందో సెహ్వాగ్ బ్యాటింగ్‌ను చూస్తే తెలుస్తుంది. ఆకాశమే హద్దుగా ఒక వైపు చెలరేగడం మాత్రమే కాదు... ఆఫ్ సైడ్‌లో స్లిప్ లేదంటే థర్డ్ మ్యాన్ మీదుగా అలవోకగా బంతిని కట్ చేస్తూ అతను సాధించిన పరుగులు చూస్తే క్రికెట్‌లోని అందం ఏమిటో కనిపిస్తుంది.
మరే క్రికెటర్ ఊహకు కూడా అందని ఘనతలు సెహ్వాగ్ కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి. భారత్ జట్టు టెస్టులు ఆడటం మొదలు పెట్టిన 72 ఏళ్ల తర్వాత కూడా ఏ ఆటగాడూ ట్రిపుల్ సెంచరీ చేయలేదు. కానీ నాలుగేళ్ల వ్యవధిలో రెండు సార్లు ఆ ఘనతను సాధించిన ఈ ఢిల్లీ సంచలనం, మరో ఏడాది త్రుటిలో మూడో ట్రిపుల్ సెంచరీని కోల్పోయాడు. కెరీర్‌లో ఆరు టెస్టు సెంచరీలు వందకు పైగా స్ట్రైక్ రేట్‌తో ఉండటం, అందులో మూడు సార్లు 250 పరుగులు దాటడం, టాప్-10 ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీలలో ఐదు అతని పేరిటే ఉండటం సెహ్వాగ్ విధ్వంసాన్ని చూపిస్తుంది. ‘నువ్వు కేవలం బంతిపైనే దృష్టి పెట్టు. దానిని చితక్కొట్టడం నీ పని. అది టెస్టు మ్యాచ్‌నా... వన్డేనా...టి20నా అనేది అనవసరం. బంతిని బలంగా బాదాక వచ్చే శబ్దం ఎంత వీనులవిందుగా అనిపిస్తుందో తెలుసా. బంతిని వదిలిస్తే అది నువ్వు వినలేవు’ అని సెహ్వాగ్ మాత్రమే అనగలడు.
తన తరంలోని దిగ్గజ టెస్టు క్రికెటర్లతో పోలిస్తే సాంకేతికపరంగా అతను వెనుకబడి ఉండవచ్చు. కానీ భారత జట్టు టెస్టుల్లో సాధించిన అత్యుత్తమ విజయాల్లో సెహ్వాగ్ కీలక పాత్ర పోషించాడు. జట్టు నంబర్‌వన్ కావడంలో, ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడంలో సెహ్వాగ్ ఇన్నింగ్స్‌లే ఊతంగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. టెస్టు క్రికెట్ దశ, దిశను మార్చిన ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించుకున్న వీరేంద్రుడు వన్డేల్లోనూ డబుల్ సెంచరీతో తన ఘనతను పరిపుష్టం చేసుకున్నాడు. భారత్‌లోని చాలా మంది కుర్రాళ్లలాగే సచిన్ టెండూల్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆటలోకి అడుగు పెట్టిన సెహ్వాగ్, అనేక సందర్భాల్లో అతడిని మించిన ప్రదర్శనతో తన విలువను ప్రదర్శించాడు. కొన్ని సార్లు వైఫల్యాలు ఎదురైనా, తాను నమ్మిన శైలిలోనే, తాను అనుకున్నట్లుగా ఆడిన సెహ్వాగ్ అలాగే కెరీర్‌ను ముగించాడు. అతడిలోని వీరత్వం చూసి చాన్నాళ్లే అయినా... ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ అందరి మదిలో నిలిచిపోయాయి. ప్రపంచ క్రికెట్‌లో సెహ్వాగ్‌లాంటి ఆటగాడిని ఇకపై కూడా మనం చూడలేకపోవచ్చు.
దాదాపు వారం క్రితమే భారత క్రికెట్ అభిమానులు మరో దిగ్గజ క్రికెటర్ రిటైర్మెంట్ వార్త విన్నారు. దశాబ్ద కాలానికి పైగా భారత పేస్ బౌలింగ్ భారం మోసిన జహీర్, కొత్త మిలీనియంలో అరుదైన విజయాలు అందించిన ఘనాపాటి. జహీర్ తాను వ్యక్తిగతంగా ఒక బౌలర్ మాత్రమే కాదు... ఈ తరం పేస్ బౌలింగ్‌కు అతను ప్రతినిధి. జహీర్ మార్గదర్శనంలో తమ కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నవారు ఎంతో మంది ఉంటే, అతడి స్ఫూర్తితో అనుసరించినవారు కోకొల్లలు. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిలో బౌలర్‌గా భారత క్రికెట్ భాగ్యరేఖలు మార్చిన జహీర్ నిష్ర్కమణ కూడా అభిమానులను నిరాశ పరిచేదే.
కొత్త నీరు వచ్చాక పాత నీరు వెళ్లిపోవడం సహజం. ఏడాది విరామంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన జహీర్, సెహ్వాగ్ తప్పుకున్నారు. దాదాపు అదే సమయంలో వచ్చిన యువరాజ్ సింగ్, ఆ తర్వాత మూడేళ్లకు అరంగేట్రం చేసిన గంభీర్... ఇప్పుడు జాతీయ జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇన్నేళ్లలో తమ శక్తియుక్తులంతా ధారబోసి వీరంతా దేశం తరఫున తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించారు. వారికి ఇంకా ఆడాలనే కోరిక, ఆశ ఉండవచ్చు. కానీ ఈతరం కుర్రాళ్లతో పోటీ పడలేక కావచ్చు లేదా వయసు ప్రభావం కావచ్చు... ఈ స్టార్‌లు కూడా నాటి ప్రదర్శనను చూపించలేకపోతున్నారు. ఆటను ముగించడం అంత సులభం కాదు. ఇది భావోద్వేగాలకు కూడా సంబంధించిన విషయం. అయితే మార్పు నిరంతర ప్రక్రియ కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో వీరినుంచి కూడా వీడ్కోలు మాటలు వినాల్సి రావచ్చేమో!
సలామ్ సెహ్వాగ్!
Published Wed, Oct 21 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM
Advertisement
Advertisement