సామాన్యులకు రంగుల ప్రపంచాన్ని వాగ్దానం చేసి, ఆశల్ని కల్పించి అందల మెక్కుతున్నవారు క్రియకొచ్చేసరికి వారిని దగా చేస్తున్న దాఖలాలు దేశంలో చాలాచోట్ల కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు అధికారంలోకొచ్చి ఆర్నెల్లు దాటకుండానే 2013 నాటి భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అది మురిగిపోయిన ప్రతిసారీ ప్రాణప్రతిష్ట చేస్తూ మూడుసార్లు సరికొత్త ఆర్డినెన్స్‌లు పుట్టించింది. చివరకు బిహార్ ఎన్నికలు ముంగిట్లోకొచ్చాక, ప్రజానీకంనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యాక అయిష్టంగానే ఆ వ్యవహారానికి స్వస్తి చెప్పింది. ఆ చట్టం సరిగా లేదనుకుంటే రాష్ట్రాలే మార్పులు చేసుకోవచ్చు నంటూ 2015 జూలైలో జరిగిన నీతిఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పాక చాలా రాష్ట్రాలు ఆ పనిలోబడ్డాయి.
ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు అందరి కన్నా ముందున్నాయి. ఉమ్మడి హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలుపుదల చేసిన జీవో 123 అలా పుట్టుకొచ్చిందే. తెలంగాణ సర్కారు 2015 జూలైలో తీసుకొచ్చిన ఈ జీవో అయినా... ఈమధ్యే శాసనసభ ఆమోదం పొందిన తెలంగాణ రాష్ట్ర భూసేకరణ (సవరణ) బిల్లు–2016 అయినా మురిగిపోయిన కేంద్ర ఆర్డినెన్స్‌కు దగ్గరవే. ఇలాంటి బిల్లునే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని మొన్న ఆగస్టులో చట్టంగా మార్చుకుంది. అటు ఆంధ్రప్రదేశ్ సర్కారు మాయ చేయడంలో అందరినీ మించిపోయింది. భూసమీ కరణ పేరుతో రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నట్టు ప్రచారం చేసుకుని ఇప్పటికే 34,000 ఎకరాలు తన ఖాతాలో వేసుకుంది.
రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో పది లక్షల ఎకరాల భూమిని ఒడిసి పట్టి ‘ల్యాండ్ బ్యాంక్’ను ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ తంతు ఎలా సాగబోతున్నదో అమరావతి ప్రాంత రైతుల దీనావస్థను చూసినా... తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ సంస్థ కోసం 500 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు జారీ చేసిన జీవోను గమనించినా, పశ్చిమగోదావరిలో గోదావరి ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరే కిస్తున్న పల్లెలపై అమలవుతున్న నిర్బంధాన్ని చూసినా అర్ధమవుతుంది.
ప్రజా ప్రయోజనం పేరిట ఈ దేశ పౌరులపై దాదాపు ఏడు దశాబ్దాలుగా స్వారీ చేసిన 1894 నాటి భూసేకరణ చట్టం కోట్లాదిమందిని నిర్వాసితులుగా మార్చింది. ఒకసారి ప్రభుత్వం దేనికైనా ‘ప్రజా ప్రయోజనం’ ముద్రేస్తే ఆ ముసు గులో విలువైన పంట భూముల్ని, జనపదాల్ని, అరణ్యాలను, కొండప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ఆ చట్టం లైసెన్స్‌నిచ్చేది. పర్యవసానంగా ఆయా ప్రాంతాల వనరులను వినియోగించుకునే, వాటి ఆధారంగా ఉపాధి పొందే లక్ష లాదిమంది జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. ఇందులో అధిక శాతంమంది ఆది వాసీలు, దళితులు, నిరుపేద గ్రామీణులు, బక్క రైతులే. తమ చర్యల కారణంగా సర్వస్వం కోల్పోతున్నవారిని ఆదుకోవాలన్న స్పృహ కూడా ప్రభుత్వాలకు లేక పోయింది.
ఒక అంచనా ప్రకారం స్వాతంత్య్రానంతరం ఆ చట్టం వల్ల నిర్వాసి తులైనవారి సంఖ్య 6 కోట్లపైమాటే! వారిలో కనీసం 20 శాతంమందికి కూడా ఇప్పటివరకూ పునరావాసం దక్కలేదు. అంతక్రితం మాటేమోగానీ నర్మదా బచావో, పోస్కో ఉద్యమాలు ఈ నిలువుదోపిడీని నిలదీశాయి. నేలతల్లితో తమ పేగుబంధాన్ని తెంచుతున్న దుష్ట పోకడలపై సింగూరు, నందిగ్రామ్, భట్టాపర్సాల్ వంటి చోట్ల బడుగు జీవులు, బక్క రైతులు తిరగబడ్డారు. తమ ప్రాణాలొడ్డి ప్రతిఘ టించారు. ఈ పరిణామాలన్నిటి తర్వాత ఆ చట్టం మార్చాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయినా ఆరేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత 2013లోగానీ కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి రాలేదు.
ఈ చరిత్రంతా గమనిస్తే 2013 చట్టం పాలకుల భిక్ష కాదని, అది అసహా యులైన ప్రజానీకం సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న హక్కని అర్ధమవుతుంది. నిజానికి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టంపై మొదట్లో తానిచ్చిన హామీల నుంచి వెనక్కు తగ్గింది.
బిల్లు రూపకల్పన దశలో ఉన్న కొన్ని మంచి అంశాలు పార్లమెం టులో ప్రతిపాదించేనాటికి మాయమయ్యాయి. మరికొన్ని నీరుగారాయి. పరిశ్రమ ఏర్పాటయ్యే ప్రాంతంలోని ప్రజల్లో 80 శాతంమంది ఆమోదిస్తేనే భూసేకరణ ఉంటుందన్న నిబంధన కాస్తా భూమిని కోల్పోయేవారిలో 80 శాతంమంది ఆమోదం సరిపోతుందని మారింది. ఒక పరిశ్రమ ఏర్పాటైనప్పుడు నేరుగా నష్టపో యేది భూ యజమానులే అయినా ఆ ప్రాంతంలో నివసించేవారు, అక్కడ జీవించే వారి పరిస్థితేమిటన్నది 2013 చట్టం పట్టించుకోలేదు. ఇక ప్రభుత్వం 5 కేటగిరీల కింద, ‘ఇతర ప్రజా ప్రయోజనాల’కింద స్వాధీనం చేసుకుంటే ఇవేమీ వర్తించవు.
ఆ చట్టమే పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదనుకుంటుంటే...దాని స్థానంలో వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలైనా, బిల్లులైనా అందులోని మంచి అంశాలను సైతం మింగేస్తున్నాయి. సామాజిక ప్రభావ మదింపు (ఎస్‌ఐఏ), రెండు లేదా అంతకుమించి పంటలు పండే భూముల సేకరణపై ఉన్న ఆంక్షలను బేఖాతరు చేస్తున్నాయి. గుజరాత్ చట్టం చూసినా, తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన బిల్లు చూసినా వాటి మూలాలు ఎన్‌డీఏ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో కనబడ తాయి. గుజరాత్ తెచ్చిందని, కర్ణాటక తీసుకురాబోతున్నదని వాదిస్తూ తమ చర్యకు సహేతుకత కోసం సాగునీటి మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలా చెప్పి ఆయా పార్టీల వారిని నోరుమూయించ వచ్చునే మోగానీ జనం నోళ్లెలా మూయిస్తారు? అలా వాదించడానికి ముందు ఈ మాదిరి అంశాలే ఉన్న కేంద్ర ఆర్డినెన్స్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు వ్యక్తమ య్యాయో, చివరికది చట్టంగా ఎందుకు రూపుదిద్దుకోలేదో తెలుసుకుంటే మంచిది. ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పిన అంశాలను గమనించాకైనా తెలంగాణ ప్రభుత్వం తన చర్యలను పునఃసమీక్షించుకోవాలి. రైతులు, కూలీలు, గ్రామీణ ప్రజానీకం చేస్తున్న ఆందోళనలను సానుభూతితో అర్ధం చేసుకోవాలి.
ఇప్పటికైనా ఆలోచిస్తారా?
Published Sat, Jan 7 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
Advertisement