అన్నదాతకు ఆసరా!
సంపాదకీయం
కన్నీటి సేద్యంతో నానాటికీ కృశిస్తూ చివరకు చావే శరణ్యమనుకుంటున్న రైతుకు ఇప్పుడెక్కడా ఆపన్నహస్తం కనబడటం లేదు. అకాల వర్షాలు, వడగండ్లు, ఎప్పుడొస్తుందో తెలియని కరెంటు రైతును బేజారెత్తిస్తుంటే... తమ వంతుగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వ్యవసాయానికి ముందుగా కావాల్సింది పెట్టుబడి సకాలంలో సమకూరడం. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వెనకా ముందూ చూసుకోకుండా చేసిన రుణమాఫీ వాగ్దానం కూడా చివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతుల పాలిటా శాపంగా మారింది. బ్యాంకులనుంచి రుణ సదుపాయం లభించక అధిక శాతం రైతులు ప్రై వేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సివచ్చింది. రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారికి మనో ధైర్యాన్నిచ్చేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మండుటెండల్లో పాదయాత్రకు శ్రీకారంచుట్టి సరిగ్గా పన్నెండేళ్లవు తోంది. అప్పటికి ఉమ్మడి రాష్ట్రంగా చంద్రబాబు ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇంచుమించు ఇవే పరిస్థితులున్నాయి. అతివృష్టితో, అనావృష్టితో వ్యవసాయం చిన్నాభిన్నంకాగా రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమనుకున్న సమయమది. పులి మీద పుట్రలా ఆనాటి సర్కారు విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో 1.7 లక్షలమంది రైతులపై కేసులు పెట్టి అరెస్టులకు పూనుకున్నది. అన్నదాతల బలిదానాలు అవహేళనకు గురయ్యాయి. తిన్నదరక్క చనిపోతున్నారని ఒకరంటే... మరణించిన రైతు కుటుంబాలకు పరిహారమిస్తే అందుకు ఆశపడి మరింతమంది చనిపోతారని ఇంకొకరు ఎద్దేవా చేశారు. పుష్కరకాలం గడిచాక చూస్తే రైతు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్టు కనబడుతున్నది.
ఫిబ్రవరి నెలలో కురిసిన అకాల వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలతోసహా 14 రాష్ట్రాల రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. 6 కోట్ల 20 లక్షల హెక్టార్ల రబీ పంటలో దాదాపు 2 కోట్ల హెక్టార్ల పంట ధ్వంసమైందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక చెబుతోంది. ఇందులో వరి, గోధుమ, నూనె గింజలు, పప్పుధాన్యాలు వగైరాలున్నాయి. మొత్తంగా 30 శాతానికిపైగా పంట నాశనమైనట్టు లెక్క. ఇవికాక కూరగాయలు, పండ్ల తోటలకు సంభవించిన నష్టం అదనం. వాతావరణం బాగుండి, పంట సక్రమంగా చేతికందుతుందని భావిస్తే దానిద్వారా సగటు రైతు కుటుంబానికి వచ్చే ఆదాయం నెలకు రూ. 3,078 మాత్రమేనని ఆమధ్య జాతీయ శాంపిల్ సర్వే సంస్థ లెక్కేసింది. పాడి పశువులు మొదలుకొని ఇతరత్రా వనరుల ద్వారా వచ్చే ఆదాయం మరో మూడు వేలుంటుందని తెలిపింది. ఇదంతా ఇంటిల్లపాదీ రెక్కలు ముక్కలు చేసుకుంటే వచ్చే ఆదాయం. ప్రకృతి వైపరీత్యాలు ఇటీవలికాలంలో ఎక్కువయ్యాయి గనుక రైతు కుటుంబాలకు ఈ మాత్రం ఆదాయం కూడా లభించడం లేదన్నది వాస్తవం. అందువల్లే 58 శాతం రైతు కుటుంబాలు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నాయి. వ్యవసాయ రంగంనుంచి తప్పుకునేవారి సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతున్నది.
ఇలా పెను సంక్షోభంలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం ఊరటనిస్తుంది. ఇటీవలి అకాల వర్షాలు, వడగండ్లవల్ల పంట నష్టపోయిన రైతులకిచ్చే పరిహారాన్ని 50 శాతం పెంచుతామని ప్రకటించడంతోపాటు... సగం పంట నష్టపోయే సందర్భాల్లోనే పరిహారం వర్తిస్తుందన్న నిబంధనను సడలించి మూడో వంతు పంట నష్టపోయినా అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే బాధిత రైతుల నుంచి పంట రుణాల వసూళ్లను వాయిదా వేయాలని బ్యాంకులకు సూచించారు. అంతేకాదు... రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థలు, బ్యాంకులు కూడా తమ వంతుగా రైతును ఆదుకుంటాయని హామీ ఇచ్చారు. కనుక వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం దష్టిసారించిందనే అనుకోవాలి. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతులకు బీజేపీ ఎన్నో హామీలిచ్చింది. తాము అధికారంలోకొస్తే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను 50 శాతం పెంచుతామని అనేక సభల్లో మోదీ స్వయంగా చెప్పారు. తీరా ఇటీవల వివిధ పంటలకు ప్రకటించిన ఎంఎస్‌పీలు రైతులను తీవ్రంగా నిరాశపరిచాయి. వరి, గోధుమలకు ఎంఎస్‌పీ పెంపు 3.6 శాతం మాత్రమే! పెపైచ్చు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర 50 శాతం పెంచడం సాధ్యంకాదని సుప్రీంకోర్టు ముందు అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. కేంద్రం ప్రకటించే ఎంఎస్‌పీ రైతులకు మెరుగైన ధర రావడానికి ఉద్దేశించింది తప్ప అది ‘ఆదాయాన్ని పెంచే విధానం’ కాదని చెప్పారు. మద్దతు ధర విషయంలో ఇలా మాట మార్చడమే కాదు...తాము ప్రకటించిన ధరకు అదనంగా ఒక్క పైసా కూడా బోనస్‌గా ఇవ్వడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇది చాలదన్నట్టు లెవీ విధానాన్ని పూర్తిగా ఎత్తేయడానికి నిర్ణయించింది. 30 నుంచి 75 శాతం వరకూ అమలు చేస్తున్న లెవీ సేకరణను ఇకపై 25 శాతానికి కుదించాలని నిరుడు సెప్టెంబర్‌లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇక లెవీ ఉండే అవకాశం లేదని కూడా సూచనప్రాయంగా చెప్పింది. ఇందువల్ల వరి పండించే రైతులపై మిల్లర్ల, వ్యాపారుల పెత్తనం పెరుగుతుంది. వారు నిర్ణయించిన ధరకే రైతు పంటను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి బాస్మతి బియ్యం మొదలుకొని పత్తి వరకూ అన్నిటి ధరలూ దారుణంగా పడిపోయి రైతును దారుణంగా దెబ్బతీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా రైతులను ఆదుకుంటామని మోదీ చెప్పడం హర్షించదగిందే. పంట నష్ట పరిహారం విషయంలో నిబంధనలను సవరించినట్టే... రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ఇతర విధానాలను కేంద్రం పునః సమీక్షించాలి. దేశానికి అన్నం పెడుతున్న రైతుకు అండగా నిలవాలి.