మళ్లీ ఉగ్ర మూకల దాడి
బెల్జియం రాజధానిగా మాత్రమే కాదు...యూరప్ యూనియన్ ప్రధాన కార్య క్షేత్రంగా ఉన్న బ్రస్సెల్స్‌పై ఉగ్రవాదం పంజా విసిరింది. నగరంలోని అంతర్జా తీయ విమానాశ్రయం, సబ్‌వే మెట్రో స్టేషన్ లక్ష్యంగా ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చి పోయి పేలుళ్లకు పాల్పడి 34మందిని పొట్టనబెట్టుకున్నారు. 270మందిని గాయ పరిచారు. నిత్యం రెప్పవాల్చని నిఘా ఉంటుందనుకున్నచోటే ఇంతటి కిరాతకానికి పాల్పడటం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఏమైనా చేయగలమని ఉగ్రవాదులు నిరూపించదల్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈ ఘటనలకు సంబంధించి 24 గంటలు గడవకుండానే పేలుళ్ల కారకులుగా భావిస్తున్న ఇద్దరు మానవబాంబులను గుర్తించ డంతోపాటు మరొకడి కోసం గాలిస్తున్నారు.
మానవబాంబులుగా మారి తమను తాము పేల్చుకున్న ఉగ్రవాదులిద్దరూ సోదరులని, వీరు పారిస్ పేలుళ్ల ఉదంతంలో ప్రధాన అనుమానితులని చెబుతున్నారు. విమానాశ్రయంలో జరిగిన రెండు పేలు ళ్లకూ మానవబాంబులే కారణమని తేల్చగా మెట్రో స్టేషన్‌లో జరిగిన పేలుడు ఎలాంటిదో ఇంకా నిర్ధారణ కాలేదు. అంతవరకూ నవ్వుతూ, ఆత్మీయులతో సర దాగా గడుపుతూ ఉన్న మనుషులు ఒక్క క్షణంలో మాంస ఖండాలుగా మారి చెల్లా చెదురుగా పడిపోవడమంటే ఊహకందని విషాదం. నాలుగు నెలలక్రితం పారిస్‌లో 130మంది ఉసురుతీసిన ముష్కరులే తప్పించుకుపోయి ఈ ఉన్మాదానికి పాల్ప డ్డారని వస్తున్న వార్తలు దిగ్భ్రాంతికరమైనవి. ఆ పేలుళ్లకు సంబంధించి ఒక ప్రధాన అనుమానితుణ్ణి బ్రస్సెల్స్‌లో అదుపులోకి తీసుకుని నాలుగురోజులు కావస్తుండగా ఈ దాడులు జరిగాయంటే నిఘా విభాగం సరిగా పనిచేయలేక పోయిందని అర్ధం.
ఇలాంటి ఉదంతాలు సమాజాన్ని మొద్దుబారుస్తాయి. సాధారణ పౌరులు సైతం విచక్షణాశక్తిని కోల్పోయేలా చేస్తాయి. మానవ సహజాతాలైన ప్రేమ, కరుణవంటి భావనలు కొడిగట్టడం మొదలవుతుంది. భయాందోళనలు ఆవరించి ఉన్నచోట హేతుబద్ధత కరువవుతుంది. ఉన్మాద ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో, దేశంలో ఇవి తప్పనిసరి పరిణామాలు. అపరిచితులను అనుమానిం చడం మాట అటుంచి...నిన్నటివరకూ తెలిసినవారే అయినా ఆ ఉగ్రవాదులు అనుసరిస్తున్నామని చెబుతున్న మతానికే చెందినవారన్న కారణంతో తెలియని శత్రుత్వాన్ని పెంచుకునే ధోరణులు ప్రబలుతాయి. ఇలాంటి దాడులకు పాల్పడే ఉగ్రవాదులు కోరుకునేది కూడా అదే.
చీలిన సమాజాలు వారికి ప్రాణధాతువుల వుతాయి. అలాంటిచోట విద్వేషాలు నూరిపోయడం, ఎదుటి వర్గంపై అనుమా నాలు రేకెత్తించడం, పరస్పరం కలహించుకునే వాతావరణాన్ని సృష్టించడం చాలా తేలికవుతుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టడం వల్లనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ పారిస్ దాడులు జరిగిన సమయంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లా డారు. ఉగ్రవాదంపై జరిపే ఈ యుద్ధంలో అతిగా స్పందించి అకారణ దాడులకు పాల్పడవద్దని హితవు చెప్పారు. యూదులనో, ముస్లింలనో లక్ష్యంగా చేసుకుని బలప్రయోగానికి దిగితే మనకూ, ఉగ్రవాదులకూ తేడా ఉండదని హెచ్చరించారు. జాతీయవాదం ముసుగులో కొన్ని గ్రూపులు అప్పటికే రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా, ఒకటి రెండుచోట్ల అనుచిత ఘటనలు చోటుచేసుకున్నా ఫ్రాన్స్ మొత్తం ప్రశాంతంగానే ఉందని చెప్పాలి.
తమ గడ్డపైనే పుట్టి పెరిగి ఉగ్రవాదుల ప్రభావంలోకి వెళ్తున్నవారు ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచానికి పెద్ద బెడదగా మారారు. యాంత్రిక జీవనం, కొరవ డుతున్న సామాజిక సంబంధాలు, నిరుద్యోగం, భవిష్యత్తును గురించిన బెంగ వంటివి ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులు కావడానికి తోడ్పడుతున్నాయని మనో విశ్లేషకులు చెబుతున్నారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట ఇరాక్, సిరియా, లిబియా, సోమాలియా తదితర దేశాల్లో అమెరికా, యూరప్ దేశాలు సాగిస్తున్న నరమేథం అల్‌కాయిదా, ఐఎస్‌లాంటి ఉగ్రవాద మూకలకు పశ్చిమాసియాలో ఊపిరి పోస్తున్నాయి. మరోపక్క ఉన్న వనరులన్నిటినీ ఈ నిరర్ధక యుద్ధానికే ఖర్చుచేసే స్థితి ఉండటంవల్ల అభివృద్ధిపై పూర్తిగా కేంద్రీకరించే అవకాశం యూరప్ దేశాలకు కలగటం లేదు.
రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన ఉత్పాతాలను చూశాక మానవాళి మరోసారి అలాంటి విషమ పరిస్థితుల్లో చిక్కుకోకూడదన్న మహదాశయంతో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలివంటి అంతర్జాతీయ వేదికలు ఏర్పడ్డాయి. దేశాలమధ్య ఏర్పడే ఎంతటి క్లిష్ట సమస్యలైనా ఈ వేదికలపైనే పరి ష్కారం కావాలని భావించారు. కానీ అగ్రరాజ్యాలు తమ వెనకటి గుణాన్ని విడనా డలేదు. ఫలితంగానే ఉగ్రవాదం వేళ్లూనుకుంటోంది.
బెల్జియంలో ఉగ్రవాద ఉదంతాలు తక్కువే. 2014లో తొలిసారి బ్రస్సెల్స్‌లో ఒక యూదు మ్యూజియంపై ఉగ్రదాడి జరిగింది. నిరుడు మరొక దాడిని పోలీ సులు ముందుగా పసిగట్టి నివారించగలిగారు. అయితే ఉగ్రవాదులకు చెందిన స్లీపర్ సెల్స్ అక్కడ లెక్కకు మిక్కిలిగా ఉన్నాయని చాన్నాళ్లనుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఈ సెల్స్ ఏ క్షణంలోనైనా దాడులకు తెగబడవచ్చునన్న సూచ నలూ వెలువడ్డాయి. బెల్జియంలో నిఘా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం పాశ్చాత్య దేశాలకు పెద్ద తలనొప్పిగానే మారింది. 2012లో బెల్జియం పౌరుడొకరు తొలిసారి ఉగ్రవాదుల్లో చేరడం కోసం సిరియా వెళ్లాడు. అలాంటివారి సంఖ్య ఇప్పుడు 450కి చేరుకుంది. వారిలో దాదాపు 120మంది స్వస్థలానికి తిరిగొచ్చారు. అందులో ఎందరు నిరాశానిస్పృహలకు లోనైనవారో, ఎందరు తమ గడ్డపైనే ఉగ్రవాద కార్య కలాపాలు సాగించడానికి వచ్చారో తెలుసుకునేందుకు అనువైన వ్యవస్థ బెల్జియం లో సరిగా లేదని నిపుణులు చెబుతున్నారు. బెల్జియంలో భద్రతా విభాగం సిబ్బంది సంఖ్య 600కు మించదని, నిఘా విభాగంలో సైతం వెయ్యిమందికి మించి అధికా రులుండరని గణాంకాలు చెబుతున్నాయి.
యూరప్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యాలయం, దానికి సంబంధించిన అనుబంధ కార్యాలయాలు, నాటో ప్రధాన కార్యాలయం ఉన్నచోట భద్రత ఇంత బలహీనంగా ఉండటాన్ని నిపుణులు తప్పుబడతారు. అయితే గట్టి భద్రత దానంతటదే సురక్షితమైన సమాజానికి హామీ ఇవ్వలేదు. పౌరులందరికీ మెరుగైన అవకాశాలు సాధించే ప్రజాస్వామిక వ్యవస్థ మాత్రమే ఉగ్రవాదం బెడదను సమర్ధంగా ఎదుర్కొనగలదు. ఆ దిశగా బెల్జియం మాత్రమే కాదు...పాశ్చాత్య ప్రపంచమంతా ఆలోచించాలి. అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం తేలికవుతుంది.