దొంగలపాలైన ‘ఆధార్‌’ | UIDAI Deputy Director Complaint Against Data Breach Issue In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దొంగలపాలైన ‘ఆధార్‌’

Published Wed, Apr 17 2019 1:42 AM | Last Updated on Wed, Apr 17 2019 1:42 AM

UIDAI Deputy Director Complaint Against Data Breach Issue In Andhra Pradesh - Sakshi

చీకటి పనులకు అలవాటు పడకుండా ఉండాలేగానీ...ఆ ఊబిలోకి దిగబడ్డాక ఇక పైకి రావడమంటూ ఉండదు. స్వల్ప శాతం ఓట్ల తేడాతో 2014లో అధికారంలోకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత అయిదేళ్లూ ఇష్టానుసారం పాలించారు. చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు వీటిపై ఎప్పటికప్పుడు నిలదీసినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. చివరకు ఇది దేనికి దారితీసిందో తెలంగాణ పోలీసులకు అందిన తాజా ఫిర్యాదు తేటతెల్లం చేసింది. 

సాక్షాత్తూ ఆధార్‌ ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ టి. భవానీ ప్రసాద్‌ ఈ ఫిర్యాదు చేశారు. ఆధార్‌ రికార్డుల్లో నిక్షిప్తమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు 7 కోట్ల 83 లక్షలమంది ప్రజానీకానికి సంబంధించిన డేటా చోరీకి గురయిందని, ఇది దేశభద్రతకే ముప్పు కలిగిస్తుందని ఆ ఫిర్యాదు సారాంశం. ఇందులో అత్యంత ప్రమాదకరమైనదేమంటే...ఈ డేటాను నిందితులు అమెజాన్‌ క్లౌడ్‌ సర్వీస్‌లో నిక్షిప్తం చేశారు. ఆ సర్వీస్‌ను ప్రపంచంలో ఏమూలనున్న నేరగాళ్లయినా హ్యాక్‌ చేశారంటే కోట్లాదిమంది పౌరుల సమాచారం వారి చేతుల్లో పడుతుంది. దాన్ని ఉపయోగించుకుని వారు ఏంచేయడానికైనా ఆస్కారం ఉంది. గత నెల మొదట్లో తొలిసారి ఈ డేటా చోరీ వ్యవహారం వెలుగులోకొచ్చినప్పుడు చంద్రబాబు, ఆయన సహచరులు చేసిన హడావుడి, దీన్ని రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు చేసిన యత్నం వెనకున్న వ్యూహమేమిటో ఇప్పుడు అందరికీ అర్ధమవుతుంది. 
(చదవండి : ఇది దేశ భద్రతకే సవాల్‌)

జరిగిన నేరం ఎంత తీవ్రమైనదో, దాని పర్యవసానాలేమిటో చంద్రబాబుకు తెలుసు. అందువల్లే  డేటా చోరీ వ్యవహారం బయటకు పొక్కగానే ఏపీ పోలీసులు క్షణాల్లో హైదరాబాద్‌కొచ్చి వాలారు. ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డిని అపహరించుకుపోవడానికి ప్రయత్నించారు. తెలంగాణ పోలీసులు అడ్డుకోనట్టయితే ఆయన్ను ఏపీకి తరలించేవారే. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్‌కు పోటీగా చంద్రబాబు రెండు సిట్‌లు వేసి పక్కదోవ పట్టించాలని చూశారు. జరిగిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణపై ఎదురుదాడికి దిగారు. లోకేశ్వర్‌రెడ్డి చేసిన ఫిర్యాదు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడున్నర కోట్లమంది ఓటర్ల వ్యక్తిగత సమాచారం దొంగిలించి దాన్ని తెలుగుదేశం కార్యకర్తల ఫోన్లలో ‘సేవామిత్ర’ యాప్‌ కింద లభ్యమయ్యే ఏర్పాటు చేశారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్‌ ఫొటోలతో కూడిన జాబితా, ఇటు ఆధార్‌ డేటా అనుసంధానించి దీన్ని రూపొందించారని అప్పుడు బయటికొచ్చింది. 

కానీ తాజాగా భవానీ ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మరింత తీవ్రమైనది. ఒక్క ఏపీ ప్రజల డేటా మాత్రమే కాదు...తెలంగాణ ప్రజల డేటా సైతం ఈ దొంగల చేతుల్లో పడిందని వెల్లడైంది. ఈ రెండు రాష్ట్రాల ప్రజానీకం తాలూకు 18 రకాల వ్యక్తిగత సమాచారం సేవామిత్రలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తల సెల్‌ఫోన్లకు అందుబాటులో ఉందంటే వీరు ఎంతకు తెగించారో తేటతెల్లమవుతుంది. దీన్ని రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్‌ ఇంతవరకూ ఆచూకీ లేకుండా పోయాడు. అతగాడు ఎవరి రక్షణలో సేదతీరుతున్నాడో సులభంగానే అంచనా వేసుకోవచ్చు. 

ఆధార్‌ డేటాకు కట్టుదిట్టమైన భద్రత ఉన్నదని, అది బయటికి పోయే ప్రసక్తే లేదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) చాన్నాళ్లనుంచి బల్లగుద్ది చెబుతోంది. సుప్రీంకోర్టులోనూ ఈ వాదనే వినిపించింది. సంస్థ సీఈఓ అజయ్‌ భూషణ్‌ పాండే డేటా చౌర్యం ఎందుకు అసాధ్యమో ధర్మాసనానికి సాంకేతికంగా వివరించి చెప్పారు. ఆయనిచ్చిన వివరణతో అది సంతృప్తిపడినట్టే కనిపించింది. అందుకే కావొచ్చు...పౌరుల వ్యక్తిగత గోప్యతకు ముప్పు కలుగుతుందన్న పిటిషనర్ల వాదన సరికాదని నిరుడు సెప్టెంబర్‌లో వెలువరించిన తీర్పు సందర్భంగా స్పష్టం చేసింది. కానీ ఇప్పుడేమైంది? స్వయానా యూఐడీఏఐ సంస్థే తమ డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. ఎంత ఘోరం? ఆ సంస్థకు చెందిన నిపుణులు ఇన్నాళ్లనుంచీ ఘనంగా చెప్పుకుంటున్న భద్రత ఐటీ గ్రిడ్స్‌ పుణ్యమా అని గాలికి కొట్టుకుపోయింది. 

ఇదంతా చంద్రబాబు ప్రభుత్వ ప్రాపకంతో, ఆయన పార్టీ ప్రయోజనం కోసం చడీచప్పుడూ లేకుండా సాగిపోయింది. తాను, తన పార్టీ ప్రయోజనాలే తప్ప ఎవరేమైపోయినా ఫర్వాలేదనుకునే మనస్తత్వం ఉన్న నాయకులుంటే ఎంతటి కీలక సమాచారమైనా బజారున పడుతుందని ఈ డేటా చోరీ వ్యవహారం వెల్లడించింది. వాస్తవానికి సైబర్‌ వ్యవహారాల నిపుణుడు డాక్టర్‌ అనుపమ్‌ శరాఫ్‌ ఆధార్‌ డేటాను ఓటర్‌ గుర్తింపు కార్డుతో అనుసంధానించడం వల్ల మున్ముందు సమస్యలు తలెత్తే అవకాశమున్నదని... ఓటర్ల జాబితాలను నకిలీ ఓటర్లతో నింపి, నిజమైన ఓటర్ల పేర్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను, ఫలితాలను తారుమారు చేసే ప్రమాదమున్నదని హెచ్చరించారు. దాన్ని అటు ఆధార్‌ ప్రాధికార సంస్థ, ఇటు ఎన్నికల సంఘం పట్టించుకున్న దాఖలా లేదు. అనుపమ్‌ మాటల్లో ఎంత నిజమున్నదో ఇప్పుడు చంద్రబాబు అండ్‌ కో నిరూపించారు.

తాజా ఎఫ్‌ఐఆర్‌నుబట్టి చూస్తే సేవామిత్ర యాప్‌లో రెండు రాష్ట్రాలకూ చెందిన ఆధార్‌ డేటా, ఓటర్ల జాబితాలు ఉన్నాయి. తమకు ఓటేయరని అనుమానం వచ్చిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈ యాప్‌ ద్వారా అవకాశమున్నదని ఎఫ్‌ఐఆర్‌ చెబుతోంది. డేటా దొంగలు ఈ మొత్తం డేటాను దేన్నుంచి కైంకర్యం చేశారో తేలాల్సి ఉంది. అలాగే దుండగులు ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో సరిపెట్టారా లేక ఇతర రాష్ట్రాల డేటాను సైతం తస్కరించారా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. దీంతోపాటు టీడీపీ సేవామిత్రలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించి ఆ యాప్‌తో ఏమేం చేశారో రాబట్టవలసి ఉంది. ఈ డేటా చౌర్యం లోతు, విస్తృతి ఎంతో... ఎవరెవరు ఇందులో భాగస్వాములో సాధ్యమైనంత త్వరగా కూపీ లాగి, నిందితులను అరెస్టు చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement