‘‘మేం డేగలమూ కాదు, పావురాళ్లమూ కాదు... గుడ్లగూబలం. అది జ్ఞానానికీ, వివేకానికీ చిహ్న మని మీకు తెలుసు కదా’’ అని నాలుగేళ్లక్రితం ఒక సందర్భంలో రిజర్వ్‌బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ చమత్కరించారు. అప్పటికాయన డిప్యూటీ గవర్నర్‌గా ఉంటున్నారు. గుడ్లగూబ ఇంటిపై వాలినా, దాని అరుపు వినబడినా అరిష్టమని కొందరి నమ్మకం. దాని సంగతలా ఉంచి ఎన్‌డీఏ ప్రభుత్వానికి తనపై ఎలాంటి అభిప్రాయముందో గ్రహించుకుని ఉర్జిత్ పటేల్ సోమవారం గవర్నర్ పదవినుంచి వైదొలగారు. ‘వ్యక్తిగత కారణాలతో’ నిష్క్రమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్‌బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు గురుమూర్తి వరకూ ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన అందించిన సేవలను, ఆయన నిజాయితీని, నిపుణతను ప్రస్తుతిస్తూ ట్వీట్లు చేశారు. ఇంతగా ప్రశంసలందుకున్నారు గనుక పదవుల నుంచి తప్పుకుంటున్న కొందరు రాస్తున్నట్టు గవర్నర్‌గా తన అనుభవాలను ఆయన మున్ముందు గ్రంథస్తం చేస్తారో లేదో చూడాల్సి ఉంది. ఈమధ్య కాలంలో ఉర్జిత్‌కూ, కేంద్రానికీ మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికెళ్లడం, అవి ఎప్పుడూ లేని విధంగా మీడియాలో ప్రము ఖంగా రావడం సంచలనం కలిగించింది.
గత నెల 19న రిజర్వ్‌బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు తొమ్మిది గంటల సుదీర్ఘ సమావేశం జరిపినప్పుడు అందులో ఏ నిర్ణయాలు వెలువడతాయోనని పరిశ్రమ వర్గాలు, ఆర్థికరంగ నిపుణులు ఉత్కంఠతో ఎదురుచూశారు. ఆ సమావేశంలో కేంద్రం తాడో పేడో తేల్చుకుంటుందని, అసాధారణమైన రీతిలో ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7ను ఉపయోగించి బ్యాంకు వ్యవహారాలను తన పరిధిలోకి తెచ్చుకుంటుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అదే జరిగితే ప్రమాదకర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉన్నదని కొందరు నిపుణులు భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆ సమావేశం సుఖాంతమైంది. ఎడాపెడా రుణాలిచ్చి వాటిని వసూలు చేయలేని స్థితిలో పడిన బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయకుండా విధించిన ఆంక్షల్ని సడలించే అంశాన్ని పరిశీలించడానికి ఆర్‌బీఐ ఈ సమావేశంలో అంగీకరించింది.
ఆ ఆంక్షల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు రుణలభ్యత అసాధ్యమవుతోంది. ఇది ఉత్పాదకతపైనా, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం చూపుతున్నదని కేంద్రం భావించింది. అలాగే ఆర్‌బీఐ దగ్గరున్న 9.69 లక్షల కోట్ల మూలధనంలో కొంత మొత్తాన్ని సామాజిక సంక్షేమ పథకాల అమలుకు వీలుగా తనకు బదలాయించాలని కేంద్రం భావించింది. అయితే ఆర్‌బీఐ దగ్గర తగి నంతగా ద్రవ్య నిల్వలుంటేనే దానిపై అందరికీ విశ్వసనీయత ఏర్పడుతుందన్నది ఉర్జిత్ మనో గతం. ఇక చెల్లింపుల వ్యవహారాల పర్యవేక్షణను రిజర్వ్‌బ్యాంకు పరిధి నుంచి తప్పించి దానికోసం ఒక స్వతంత్ర బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం భావించగా, ఆర్‌బీఐ అది సరికాదని బహిరం గంగానే అసమ్మతిని ప్రకటించింది.
రిజర్వ్‌బ్యాంకుకూ, కేంద్రానికీ మధ్య ఘర్షణ మన దేశంలో కొత్తగాదు. ఆ రెండూ రెండు వేర్వేరు అస్తిత్వాలు గలవి. కనుక వాటి వాటి కర్తవ్య నిర్వహణలో విభేదాలు తలెత్తడం సహజం. నిజానికిది అవసరం. విభేదాలు చర్చలకు దారితీస్తాయి. ఆ చర్చలు పరస్పర అవగాహనకు దారులు పరుస్తాయి. చివరకు ఏకాభిప్రాయానికి దోహదపడతాయి. దేశంలో ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి ఇదంతా అవసరం. తన మాటే చెల్లుబడి కావాలని ఎవరికి వారనుకుంటే అది అంతిమంగా ఆ వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఆర్‌బీఐ, కేంద్రం మధ్య సంబంధాలు అత్యంత సంక్లిష్టమైనవి. వాటిని నేర్పుగా నిర్వహించడం, ఆర్థికరంగంలో వైఫల్యాలు ఎదురుకాకుండా చూడటం కత్తిమీది సాము వంటిది. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్నకాలంలో వై. వేణుగోపాలరెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి.
‘‘అవును నేను స్వతంత్రుణ్ణే. ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థే. నేను కేంద్ర ఆర్థికమంత్రి అనుమతి తీసుకున్నాక ఈ సంగతి చెబుతున్నాను’’ అని ఆయన వ్యంగ్యంగా చెప్పారు. తాము చెప్పినట్టల్లా వినే గవర్నర్ ఉండాలని కేంద్రం ఎంతగా వాంఛించినా అది చివరకు ఎటు దారితీస్తుందో దానికి తెలియనిది కాదు. అలాంటి ఆర్‌బీఐపై అంతర్జాతీయంగా విశ్వసనీయత ఉండదు. దాని పనితీరుపై, సామర్థ్యంపై నమ్మకం కుదరదు. అదే సమయంలో ఆర్‌బీఐ సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తానంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. ఈ పరిస్థితి ఉండరాదని భావించింది ఉర్జిత్‌పటేలే. ఆర్‌బీఐ నిర్ణయాల్లో కేంద్రం మనోగతం కూడా చెల్లుబా టయ్యే విధంగా ఆరుగురు సభ్యులుండే ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ)కి డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనే రూపకల్పన చేశారు. దానికి వడ్డీరేట్ల పెంపు, తగ్గింపు మొదలుకొని నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) వరకూ పలు అంశాలను సమీక్షించి నిర్ణయించే అధికారం ఉంది. అంతక్రితం ఈ అధికారం కేవలం గవర్నర్‌కి మాత్రమే ఉండేది.
అలాంటి ఉర్జిత్‌కు కూడా కేంద్ర ప్రభుత్వంతో భిన్నాభిప్రాయాలు ఏర్పడటం, అవి బజారున పడటం అనారోగ్య వాతావరణానికి చిహ్నం. ముఖ్యంగా బోర్డు సభ్యులు కొందరు ఆర్‌బీఐ తీరుపై బాహాటంగా చేసిన వ్యాఖ్యలు సరికాదు. పెద్దనోట్ల రద్దు సమయంలో ఉర్జిత్ దృఢంగా వ్యవహ రించలేదని కొందరు అభిప్రాయపడినా ద్రవ్యోల్బణం కట్టడి మొదలుకొని రుణాల ఎగవేత ధోర ణులను అరికట్టడం వరకూ పలు అంశాలపై ఆయన కఠినంగా ఉన్నారు. యాక్సిస్ బ్యాంకు, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర వంటి ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఆయన దృఢంగా వ్యవ హరించారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులపై కేంద్ర నియంత్రణ కూడా ఉన్నందువల్ల కావొచ్చు... ఆయన మాట పెద్దగా చెల్లుబాటు కాలేదు. ఏదేమైనా ఆర్‌బీఐ స్వతంత్రతను కాపా డటంలో ఉర్జిత్ పాత్ర ఎన్నదగినది. తదుపరి గవర్నర్ ఈ వారసత్వాన్ని కొనసాగిస్తారా లేదా అన్నది మున్ముందు చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment