
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు పూర్తిచేసి ప్రారంభోత్సవాలు కూడా చేసిన జీహెచ్‌ఎంసీ..డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో మాత్రం వెనుకబడ్డది. ట్రాఫిక్ జంజాటాలతో నగరంలో ఇంజినీరింగ్ పనులకు క్లిష్ట సమస్యలుండేవి. లాక్‌డౌన్‌లో రోడ్లు ఖాళీ కావడంతో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇదే తరుణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు మాత్రం కుంటుపడ్డాయి. అందుకు కారణం కార్మికుల లేమి. వాస్తవానికి కాంట్రాక్టు ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉండటంతో గత సంవత్సరం ఆగస్టునుంచే పనులు కుంటుపడ్డాయి. చాలా చోట్ల నిలిచిపోగా..కొన్ని చోట్ల నామమాత్రంగా జరిగాయి. ఈ నేపథ్యంలో పనులు పూర్తి జోరుమీదున్నప్పుడు దాదాపు 50వేల మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు దాదాపు పదివేల మంది మాత్రమే ఆయా ప్రాంతాల్లో పనుల్లో ఉన్నారు.
ఇక లాక్‌డౌన్ ప్రకటించాక దాదాపు నాలుగువేల మంది మాత్రమే మిగిలారు. మిగతావారు తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. లాక్‌డౌన్ తరుణంలో పెండింగ్ బిల్లుల్లో 80 శాతం వరకు చెల్లించి పనులు వేగిరం చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. మునిసిపల్ మంత్రి కేటీఆర్ గతనెలలో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా(అప్పట్లో రైళ్లకు కూడా అనుమతి లేదు) స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులను రప్పించేందుకు సంబంధిత రాష్ట్రాలతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తామని, వారిని తీసుకువచ్చేందుకు అవసరమైన రవాణా వాహనాలు సమకూర్చుకోవాలని కాంట్రాక్టు ఏజెన్సీలకు సూచించారు. ఈలోగా లాక్‌డౌన్ మినహాయింపులతో ప్రయాణానికి అవకాశం లభించినప్పటికీ, వలస కార్మికులు ఇప్పుడిప్పుడే తిరిగి హైదరాబాద్‌కు రావడానికి సుముఖంగా లేరని తెలిసింది. వీరిలో చత్తీస్‌గఢ్,బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. వారెప్పుడొస్తారో తెలియడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుది దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలపై కూడా ఈ ప్రభావం పడనుంది.
ఇళ్ల పనులు దాదాపుగా పూర్తయి.. మౌలిక సదుపాయాల పనులు జరగాల్సిన రాంపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహసముదాయం
50 వేల ఇళ్లు కష్టమే..
ఆగస్ట్ నెలాఖరుకు దాదాపు 50 వేల ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తుది దశలో పనులున్న ఇళ్లను పరిగణనలోకి తీసుకొని ఆ ప్రకటన చేయగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోగా అవి పూర్తి కావడం అసాధ్యమే. ఉన్న కార్మికులతోనే రేయింబవళ్లు పని చేయిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతమున్న కార్మికులతోనే అవి పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
గ్రేటర్‌లో ‘డబుల్’ ఇళ్ల పరిస్థితి..
♦ 117 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్లాన్.
♦ ఏడు ప్రాంతాల్లో (అహ్మద్‌గూడ,డి.పోచంపల్లిలో రెండు ప్రాంతాల్లో,బహదూర్‌పల్లి, ఎరుకల నాంచారమ్మ బస్తీ, జియాగూడ, చిత్తారమ్మ బస్తీ)8వేల ఇళ్లకు పైగా పూర్తి.
♦ దాదాపు 80వేల ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
♦ వీటిల్లో తుది దశ పనుల్లోదాదాపు 42వేల ఇళ్లు.
♦ ఆగస్టు వరకు మొత్తం 50 వేల ఇళ్ల పనులు పూర్తి కాగలవని భావించారు.
♦ కార్మికులు లేక కదలని పనులు
♦ లక్ష ఇళ్ల అంచనా వ్యయం దాదాపు : రూ.8,600 కోట్లు.