ఫ్రాన్సిస్ భారత్‌కు చెందిన ఇద్దరికి నవంబరు 23న వాటికన్‌లో సెయింట్‌హుడ్ హోదా ప్రకటించారు.
వార్తల్లో వ్యక్తులు: ఇద్దరు భారతీయులకు సెయింట్‌హుడ్ హోదా
పోప్ ఫ్రాన్సిస్ భారత్‌కు చెందిన ఇద్దరికి నవంబరు 23న వాటికన్‌లో సెయింట్‌హుడ్ హోదా ప్రకటించారు. వీరితో పాటు ఇటలీకి చెందిన మరో నలుగురికి ఈ గౌరవం లభించింది. కేరళకు చెందిన ఫాదర్ కురియకోస్ ఇలియాస్ ఛవారా (1805-1871), సిస్టర్ యూఫ్రేసియా (1877- 1952)లు సెయింట్‌హుడ్ పొందారు. వీరిని మహిమాన్వితులుగా, బాధితులకు సాంత్వన కలిగించే ఆరాధ్యదైవాలుగా పోప్ ప్రకటించారు.
గణతంత్ర వేడుకల అతిథిగా ఒబామా
2015లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఒబామా భారత్‌లో పర్యటిస్తారని శ్వేత సౌధం ప్రకటించింది. ఒబామా హాజరైతే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారి అవుతుంది.
యూపీఎస్సీ సారథిగా దీపక్ గుప్తా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్‌గా జార్ఖండ్ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి దీపక్‌గుప్తా నియమితులయ్యారు. ఆనవాయితీ ప్రకారం యూపీఎస్సీ సభ్యులే ఈ హోదాను అలంకరిస్తారు. అయితే ఈసారి యూపీఎస్సీ వెలుపలి వ్యక్తిని నియమించారు. ఇలా జరగడం ఇది మొదటి సారి.
అవార్డులు
ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి
ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి-2014కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంపికైంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)తో అద్భుతమైన విజయాన్ని సాధించడం, అంతరిక్షాన్ని శాంతియుత అవసరాలకు వినియోగించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో చూపిన కృషికి గుర్తింపుగా ఇస్రోను ఎంపిక చేసినట్లు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన ఏర్పడిన న్యాయ నిర్ణేతల బృందం తెలిపింది.
నేహా గుప్తాకు
అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి
భారత-అమెరికన్ నేహాగుప్తా (18)కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి-2014 లభించింది. భారత్‌లో అనాథ పిల్లలకు సహాయం చేసేందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. పిల్లల హక్కుల కోసం కృషి చేసినవారికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 2012లో పాకిస్థాన్ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్ ఈ అవార్డును అందుకున్నారు.
గొల్లపూడికి లోక్‌నాయక్ పురస్కారం
నటుడు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు 2014 సంవత్సరానికి లోక్‌నాయక్ పురస్కారానికి ఎంపిక య్యారు. ఈ అవార్డును లోక్‌నాయక్ ఫౌండేషన్ 2005 నుంచి అందిస్తోంది.
అచ్యుతా సమంతకు గుసి శాంతి బహుమతి
సంఘ సంస్కర్త, కిట్,కిస్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అచ్యుతాసమంత 2014 గుసి శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన గుసి పీస్ ప్రైజ్ ఇంటర్నేషనల్ దీన్ని అందిస్తోంది. జీవ కారుణ్య వాదం, విద్య ద్వారా పేదరిక నిర్మూలనలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం లభించింది.
జాతీయం
గోవాలో అంతర్జాతీయ
భారతీయ చలన చిత్రోత్సవం
45వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం గోవాలోని పనాజీలో నవంబరు 20న ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగే ఈ చిత్రోత్సవాల్లో 79 దేశాలకు చెందిన 178 చిత్రాలను ప్రదర్శిస్తారు. ప్రారంభ చిత్రంగా ఇరాన్‌కు చెందిన ద ప్రెసిడెంట్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌కు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రదానం చేశారు. భారతీయ సినిమాకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా దీన్ని ఏర్పాటు చేశారు.
2 జీ దర్యాప్తు నుంచి రంజిత్‌సిన్హా ఉద్వాసన
2 జీ కుంభకోణం కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాను సుప్రీంకోర్టు నవంబరు 20న కేసు విచారణ నుంచి తప్పించింది. కొంతమంది నిందితులను రంజిత్‌సిన్హా కేసునుంచి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాజ్యంపై స్పందిస్తూ ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
టైమ్ అత్యుత్తమ ఆవిష్కరణగా మంగళ్‌యాన్
భారత్ చేపట్టిన మంగళ్‌యాన్‌ను ఈ ఏడాది అత్యుత్తమ ఆవిష్కరణగా టైమ్ పత్రిక అభివర్ణించింది. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి చేరుకోవడం సాంకేతిక అద్భుతమని, అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు సాధించని ఘనతను భారత్ సెప్టెంబరు 24న సొంతం చేసుకుందని ప్రశంసించింది.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజన
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజన కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ నవంబరు 20న ఆమోదించింది. ప్రస్తుతమున్న రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్‌జీజీవీవై) స్థానంలో దీన్ని చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడమే పథకం ప్రధాన లక్ష్యం.
దేశంలో తొలి ఎబోలా కేసు నమోదు
దేశంలో తొలి ఎబోలా కేసు ఢిల్లీలో నమోదైంది. లైబీరియా నుంచి ఢిల్లీకి వచ్చిన 26 ఏళ్ల భారత్‌కు చెందిన వ్యక్తికి ఎబోలా సోకినట్లు అధికారులు గుర్తించారు. బాధితుణ్ని ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉంచి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
అంతర్జాతీయం
బాల్య వివాహాలపై ఐరాస తీర్మానం
బాల్య వివాహాలను నివారించాలని ప్రభుత్వాలకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి తొలిసారిగా నవంబరు 21న తీర్మానాన్ని ఆమోదించింది. దీన్ని కెనడా, జాంబియా ప్రవే శ పెట్టాయి. ఇందుకు సంబంధించి చట్టాలను తీసుకురావాలని అన్ని దేశాలను కోరాయి. నైగర్, బంగ్లాదేశ్, భారత్‌లలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నవంబరు 18న ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంతోపాటు ఉగ్రవాదంపై ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సామాజిక భద్రత, శిక్ష ఖరారైన ఖైదీల బదిలీ, పర్యాటకంతో పాటు ఐదు ఒప్పందాలు కుదిరాయి. నవంబరు 19న ఫిజీ దేశంలో మోదీ పర్యటించారు. ఆ దేశ ప్రధాని బయనీ మరామతో చర్చించారు. ఫిజీకి రూ. 500 కోట్ల రుణంతోపాటు అభివృద్ధి సాయాన్ని ప్రకటించారు. 33 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఈ దేశంలో అడుగుపెట్టారు. 1981లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ఫిజీలో పర్యటించారు.
బార్సిలోనాలో స్మార్ట్ సిటీ ప్రపంచ సదస్సు
స్పెయిన్ రాజధాని బార్సిలోనాలో నాలుగో స్మార్ట్‌సిటీ ప్రపంచ సదస్సు జరిగింది. దీన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు. వచ్చే 20 ఏళ్లలో భారత పట్టణ రంగంలో సుమారు 8.64 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని వెంకయ్య నాయుడు అన్నారు.
నేపాల్‌లో అంతర్జాతీయ బౌద్ధ సదస్సు
ఈ ఏడాది అంతర్జాతీయ బౌద్ధ సదస్సుకు నేపాల్‌లోని లుంబినీ వేదికైంది. నవంబరు 15 నుంచి 18వరకు ఈ సదస్సు జరిగింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
2070 నాటికి ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలన్న ఐరాస
ప్రమాదకర స్థాయికి తక్కువగా భూతాపం ఉండాలంటే ప్రపంచదేశాలు 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. 2100 నాటికి మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ డయాక్సైడ్‌లను శూన్యస్థితికి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యునెప్) నవంబరు 19న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని నవంబరు 17న ఒడిశాలో చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత వైమానిక దళం ప్రయోగించింది. ఇది 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 60 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు. నవంబరు 20న రెండు ఆకాశ్ క్షిపణులను ఒకేసారి ఎగురుతున్న లక్ష్యాలను నిర్దేశించి పరీక్షించారు. ఇందులో ఒకటి వేగంగా కదులుతున్న మానవ రహిత వాహనం బన్‌షీని నాశనం చేసింది. రెండున్నర కిలోమీటర్ల ఎత్తులో 11 కి.మీల దూరంలో ఎగురుతున్న ఆ లక్ష్యాన్ని 2.5 మాక్‌వేగంతో ఆకాశ్ ఢీకొంది. రెండో క్షిపణిని 24 కి.మీ పరిధిలో 5.5 కి.మీ ఎత్తులో కదులుతున్న లక్ష్యంపై ప్రయోగించారు.
గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు 9.3 బిలియన్ డాలర్లు
గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు 9.3 బిలియన్ డాలర్లు సమకూరుస్తామని బెర్లిన్‌లో సమావేశమైన 30 దేశాలు నవంబరు 20న హామీనిచ్చాయి. ఉద్గారాల తగ్గింపు, భూతాపం ఎదుర్కొనేందుకు పేదదేశాలకు సాయంగా ఈ నిధులను అందజేస్తారు. స్వచ్ఛమైన ఇంధన అవసరాలు, గ్రీన్‌టెక్నాలజీ సమకూర్చడం, పెరుగుతున్న సముద్ర మట్టాలు, కరవు బారి నుంచి కాపాడుకునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ నిధుల్ని సమకూరుస్తున్నాయి. గ్రీన్ క్లైమెట్ ఫండ్ ప్రధాన కేంద్రం దక్షిణ కొరియా.
బిగ్ బ్యాంగ్ ప్రాజెక్టులో చేరిన మద్రాస్ ఐఐటీ
విశ్వం ప్రాథమిక నిర్మాణం గురించి పరిశోధన జరుపుతున్న ఐరోపా అణు పరిశోధన సంస్థ (సెర్న్) ప్రాజెక్టులో ఐఐటీ మద్రాస్ చేరింది. బిగ్‌బ్యాంగ్ యంత్రంగా పేరొందిన లార్జ్ హాడ్రన్ కొలైడర్‌లోని కంపాక్ట్ మ్యువాన్ సోలినాయిడ్‌లో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని తీసుకుంది. ఈ ప్రత్యేకతను సాధించిన తొలి ఐఐటీగా గుర్తింపు పొందింది.
రాష్ట్రీయం
ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్‌కు జాతీయ పురస్కారం
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖకు 2012-13 జాతీయ ప్రతిభ పురస్కారం లభించింది. నవంబరు 18న ఢిల్లీలో జరిగిన రెడ్‌క్రాస్ జాతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కృష్ణా జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి దీన్ని అందుకున్నారు.
ఏయూకి ఇందిరాగాంధీ
ఎన్‌ఎస్‌ఎస్ పురస్కారం
జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్)లో భాగంగా ఆంధ్ర విశ్వ విద్యాలయం మూడు విభాగాల్లో జాతీయ పురస్కారాలను అందుకుంది. నవంబరు 19న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా ఏయూ వైస్ ఛాన్స్‌లర్ జీఎస్‌ఎన్ రాజు వీటిని అందుకున్నారు.
ఏపీ జెన్‌కోకు స్కాచ్ 2014 అవార్డు
ఏపీ జెన్‌కోకు స్కాచ్ 2014 అవార్డు లభించింది. దేశ సామాజిక, ఆర్థిక పురోగతిలో భాగస్వామి అవుతూనే మెరుగైన పనితీరు కనబరిచినందుకుగాను ఈ అవార్డు ను ప్రకటించారు.
క్రీడలు
బీసీసీఐ అవార్డులు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2014 అవార్డులను నవంబరు 18న అందించింది. కల్నల్ సి.కె.నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారానికి భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఉత్తమ అంతర్జాతీయ భారత క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ)గా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌లు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.
వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా
రెనౌద్ లావిల్లేనీ, వాలెర్ ఆడమ్స్
2014 వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా పురుషుల విభాగంలో పోల్‌వాల్ట్ ఆటగాడు రెనౌద్ లావిల్లేనీ (ఫ్రాన్స్), మహిళల విభాగంలో షాట్‌పుట్టర్ వాలెరీ ఆడమ్స్ (న్యూజిలాండ్) ఎంపికైనట్లు ఐఏఏఎఫ్ నవంబరు 21న మొరాకోలో ప్రకటించింది.
చెస్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్
నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ చెస్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. సోచిలో నవంబరు 23న ముగిసిన పోటీలో భారత్‌కు చెందిన విశ్వనాథన్ ఆనంద్‌ను కార్ల్‌సన్ ఓడించి టైటిల్ నిలబెట్టుకున్నాడు.
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్
బ్రిటన్‌కు చెందిన మెర్సిడెజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ అబుదాబి గ్రాండ్ ప్రి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అబుదాబిలో నవంబరు 23న జరిగిన రేసులో సాధించిన విజయంతో 2014 ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. అతనికిది రెండో ప్రపంచ టైటిల్.
స్విట్జర్లాండ్‌కు డేవిస్‌కప్ టైటిల్
స్విట్జర్లాండ్‌కు రోజర్ ఫెదరర్ తొలి డేవిస్‌కప్ టైటిల్ అందించాడు. లిల్లె (ఫ్రాన్స్)లో నవంబరు 23న జరిగిన ఫైనల్‌లో డేవిడ్ గాస్క్వెట్ (ఫ్రాన్స్)ను ఫెదరర్ ఓడించి టైటిల్ సాధించాడు.
- ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి,
కరెంట్ అఫైర్స్ నిపుణులు