నియోజకవర్గాల పునర్విభజన - ఒక పరిశీలన | Delimitation of constituencies in india | Sakshi
Sakshi News home page

నియోజకవర్గాల పునర్విభజన - ఒక పరిశీలన

Published Thu, Dec 12 2013 3:37 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Delimitation of constituencies in india

 బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్,
 క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో.. నూతనంగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రంలో విధానసభ స్థానాలను పెంచాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ విషయంలో కొంత మంది రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌‌స)తో చర్చలు జరపడంతో.. ఈ అంశం ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఈ నేపథ్యంలో నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ  ప్రకరణలు, చట్ట ప్రక్రియలు, అసెంబ్లీ స్థానాలు స్వల్పంగా ఉండడం ఎటువంటి ప్ర భావాన్ని చూపుతుంది తదితర అంశాలపై పరిశీలన..
 
 
 ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలకు, ప్రజా ప్రాతినిధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటివి. పాలనా సౌధానికి పునాది. ఓటర్లు తమకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కు ద్వారా నియోజకవర్గ ప్రాతిపదికగా తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. మనదేశంలో ఏకసభ్య నియోజకవర్గ విధానం అమల్లో ఉంది.

 

అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క సభ్యుడు మాత్రమే ఎన్నికవుతాడు. నియోజకవర్గ పరిమాణం, సరిహద్దులు వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను చెప్పుకోదగ్గ స్థారుులోనే ప్రభావితం చేస్తాయి. కాబట్టి నియోజకవర్గాల ఏర్పాటు, పునర్విభజన శాస్త్రీయంగా, వాస్తవికంగా ఉండాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని స్వతంత్ర వ్యవస్థతో నిర్వహించాలి. అందుకోసం రాజ్యాంగంలో కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి.


 
 ఎన్నికలు, నియోజకవర్గాలు విభజన:
 భారత రాజ్యాంగం 15వ భాగం ప్రకరణ 324 నుంచి 329 వరకు ఎన్నికలు, ఎన్నికల సంఘం అధికారాలు, విధులను ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికలు మినహా అన్ని ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ప్రకరణ 326 ప్రకారం లోక్‌సభకు, రాష్ట్ర విధానసభకు ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికన సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్య సభకు, రాష్ట్ర విధానపరిషత్‌కు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. వీటికి నియోజకవర్గాలు ఉండవు. రాజ్యసభ సభ్యులు ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తే, విధానపరిషత్ సభ్యులు ప్రత్యేక ఓటర్ల ద్వారా ఎన్నికవుతారు.


 
 పునర్విభజన - ప్రత్యేక కమిషన్:
 లోక్‌సభ, రాష్ట్ర విధానసభకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి అందుకనుగుణంగా ఆ రాష్ట్ర జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయిస్తారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే ప్రాతిపదికను తీసుకుంటారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య గానీ, ఒక రాష్ట్రంలో నియోజకవర్గాల మధ్యగానీ ఎటువంటి తేడా ఉండదు. పదేళ్లకోసారి జరిగే జనాభా గణాంకాల సేకరణ తర్వాత మారిన జనాభాకనుగుణంగా లోక్‌సభ, విధానసభ నియోజకవర్గాల సరిహద్దులను సవరించాలి.
 
 
 ఇందుకు సంబంధించి 82, 170ప్రకరణలను రాజ్యాంగంలో ప్రస్తావించారు. ఈ పునర్విభజన ప్రక్రియ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన పునర్విభజన కమిషన్ ద్వారా జరుగుతుంది. ఇంతవరకూ 1952, 1962, 1972, 2002లో నాలుగు పర్యాయాలు పునర్విభజన కమిషన్లు ఏర్పాటయ్యాయి. వాటి సూచన మేరకే పునర్విభజన జరిగింది.


 
 సాగిందిలా:
 మొదటి లోక్‌సభలో (1952) మొత్తం సభ్యుల సంఖ్య 489. అయితే 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. దీనికి 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (1976) నియోజకవర్గాల పునర్విభజన సంఖ్యను 2001 సంవత్సరం వరకు స్తంభింపజేశారు. దీని ముఖ్యోద్దేశం.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు లోక్‌సభలో తమకున్న సీట్లు కోల్పోకుండా కాపాడటం.


 
 ఈ రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో జనాభా తగ్గింది. దీంతో ఆయా రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు పెరిగాయి. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి పునర్విభజన ప్రక్రియను 2001 వరకు స్తంభింపజేశారు. దీన్ని 84 రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా 2026 వరకు పొడిగించారు. అంటే ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య 2026 వరకు మారదు.


 
 నాలుగో పునర్విభజన కమిషన్ 2002:
 సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కుల్దీప్‌సింగ్ అధ్యక్షతన నాలుగో పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అప్పటి భారత ఎన్నికల కమిషనర్ బి.బి. టాండన్‌తోపాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా వ్యవహరించారు. ఈ ముగ్గురు పూర్తి కాల సభ్యులు. వీరుకాకుండా ఐదుగురు లోక్‌సభ్యులు, సంబంధిత రాష్ట్రానికి చెందిన ఐదుగురు విధాన సభ సభ్యులు సహ సభ్యులుగా వ్యవహరిస్తారు. అయితే వీరికి ఎటువంటి ఓటుహక్కు ఉండదు.


 
 కమిషన్ కీలక నిర్ణయాలను ముగ్గురు పూర్తికాల సభ్యులు వూత్రమే తీసుకుంటారు. 84 రాజ్యాంగ సవరణ (2001), 87 రాజ్యాంగ సవరణ (2003) చట్టాల ప్రకారం 2026 తర్వాత సేకరించే జనాభా గణాంకాల వరకు లోక్‌సభలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన సీట్ల సంఖ్య, అలాగే రాష్ట్ర శాసనసభలో సైతం సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. షెడ్యూల్ కులాలు, తెగలకు రిజర్‌‌వ చేసే సీట్లు మాత్రం 2001 జనాభా లెక్కల మేరకు నిర్ణయించారు. దాంతో వీరి ప్రాతినిధ్యం పెరిగింది.


 
 న్యాయసమీక్ష పరిధిలోకి రావు:
 రాజ్యాంగ ప్రకరణ 329 మేరకు పునర్విభజన కమిషన్ నిర్ణయాలను న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు.
 1967లో మేఘరాజ్ వర్సెస్ పునర్విభజన కమిషన్ వివాదంలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ధ్రువీకరించింది. పునర్విభజన విషయంలో కమిషన్‌దే తుది నిర్ణయమని తీర్పునిచ్చింది. ప్రజాభిప్రాయసేకరణ, సూచనలతో, విస్తృత స్థాయిలో ప్రక్రియలో పునర్విభజన ప్రక్రియును కమిషన్ చేపట్టడమే ఇందుకు కారణం.


 
 పునర్విభజన, సీట్ల సంఖ్య:
 సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల సమతౌల్యత దెబ్బతింటుందనే భయంతో లోక్‌సభ స్థానాలు స్తంభింపజేయడంలో ఔచి త్యం ఉంది. కానీ రాష్ట్ర శాసనసభ స్థానాలను 2001 జనాభా మేరకు సవరించక తప్పలేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా శాసనసభలో ప్రజావాణిని వినిపించడానికి అదనపు ఎమ్మెల్యేలు అవసరం. ప్రస్తుతం కొనసాగుతున్న విధానం వల్ల ఉత్తరప్రదేశ్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలుంటే, బీహార్- మహారాష్ట్రలలో 6, ఆంధ్రప్రదేశ్-పశ్చిమ బెంగాల్‌లో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి.


 
 ప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. ఓటర్లకు, ప్రజా ప్రతినిధుల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వేగవంతమవుతున్న పట్టణీకరణ నేపథ్యంలో పారిశ్రామిక కేంద్రాల్లో విపరీతంగా జనాభా పెరిగింది. ఢిల్లీ, గుర్‌గావ్, నోయిడా, ఫరీదాబాద్ వంటి పట్టణాల్లో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ పరిస్థితులల్లో వీరికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. దీంతో శాసనసభ స్థానాలను పెంచాల్సిన అవసరం ఉంది.


 
 ప్రజా సమస్యలు ప్రధానం:
 పునర్విభజన కమిషన్ పనితీరు, దాని సిఫార్సుల వల్ల సంభవించిన మార్పులపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. చట్టబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థ కావడంతో కమిషన్ సిఫార్సులను న్యాయస్థానంలో సవాలు చేయడానికి వీలుల్లేకుండా ప్రకరణ 329 అడ్డు రావడం, దాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం వివాదాస్పదమైంది. ఆదివాసి ప్రాంతాల్లో సీట్లు తగ్గడం, మైదాన ప్రాంతాల్లో పెరగడం ఆదివాసీలకు ఇబ్బంది కలిగించే పరిణామమే. 2001 జనాభా ప్రాతిపదికగా పునర్విభజన జరిగినప్పటికీ.. రాష్ట్రాలకు కేటాయించిన సీట్ల సంఖ్యలో మార్పులేదు.
 
 దీంతో దక్షిణాది రాష్ట్రాలు లబ్ధి పొందాయి. ఉత్తరాది రాష్ట్రాలు నష్టపోయాయి. ప్రజాప్రతినిధుల పనితీరు, సమర్థత, నిబద్ధత, జవాబుదారీతనం, ప్రజాసమస్యల పట్ల అవగాహన, స్పందన ఆశించిన స్థాయిలో లేదనేది కఠోర వాస్తవం. జనాభా మేరకు ప్రాతినిధ్యాన్ని పెంచితే చేకూరే అదనపు ప్రయోజనం ఏంటి? అనేది ప్రధాన సంశయం. ప్రజాధనం అదనంగా వృథాకావడం తప్ప అనేది జనసామాన్య, మేధావుల అభిప్రాయం.  


 
 అసెంబ్లీ స్థానాల పెంపు అవసరమా?
 పార్లమెంట్ స్థానాలను పెంచాలన్నా, పునర్విభజన చేయాలన్న రాజ్యాంగ ప్రకరణ 82 ప్రకారం, పార్లమెంట్ ఒక చట్టం ద్వారా మాత్రమే.. పునర్విభజన కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడం, పునర్విభజనకు అలాంటి ప్రక్రియ అవసరం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ మేరకు అసెంబ్లీ స్థానాల సంఖ్యను పునర్‌వ్యవస్థీకరించవచ్చు (రాష్ర్టల విభజన సమయంలో).


 
 ఉదాహరణకు-ఉత్తరాఖండ్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. 2001లో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రంలో కేవలం 22 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండేవి. వాటిని పునర్విభజన ద్వారా 70 స్థానాలకు పెంచారు. ఇదే ప్రాతిపదికన.. ప్రతిపాదించిన తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానాలను పెంచవచ్చు. ఈ విషయుంలో నిర్ణయుం వెలువడాల్సి ఉంది.


 
 పరిమిత సీట్లు-రాజకీయ అస్థిరత:
 ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 స్థానాలకు మించని అసెంబ్లీ స్థానాలు ఉన్నా రాష్ట్రాల సంఖ్య 12. ఆయా రాష్ట్రాలను పరిశీలిస్తే.. సిక్కింలో అతి తక్కువగా 32 స్థానాలు ఉంటే, గోవా, మిజోరం రాష్ట్రాలలో 40 చొప్పున, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో 60 చొప్పున స్థానాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య -70. ఛత్తీస్‌గఢ్‌లో 90, హర్యానాలో 90, హిమాచల్‌ప్రదేశ్‌లో 68, జార్ఖండ్‌లో 81 స్థానాలు ఉన్నాయి.
 


 ఇక్కడ ప్రస్తావించిన అధిక శాతం రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. ప్రభుత్వాలు నిర్దేశిత కాలం కొనసాగిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నారుు. ఈ నేపథ్యంలో రాజకీయు అస్థిరత అభివృద్ధికి ఆటంకంగా వూరుతుందనే వివుర్శ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలను పెంచడం ద్వారా రాజకీయు అస్థిరతను అధిగమించవచ్చనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా రాజకీయు స్థిరత్వాన్ని సాధించవచ్చు అనే విషయుంలో కూడా భిన్న అభిప్రాయూలు ఉన్నాయి.
 
 
 ఎందుకంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదనే విషయూన్ని గత అనుభవాల ద్వారా గవునించవచ్చు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ను తీసుకుంటే..గతంలో ఎన్నోసార్లు రాజకీయంగా అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వాలు మారాయి. నిబద్ధత, విలువలు, వ్యక్తిగత నైతిక, సేవాభావం ఉన్నప్పుడు సంఖ్యా పరమైన పరిమితులు ఉండవు అనేది జగమెరిగిన సత్యం.
 


 
 నాలుగో పునర్విభజన కమిషన్ ముఖ్యాంశాలు
 లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను 2001 జనాభా ప్రాతిపదికగా పునర్విభజన చేయాలి.
 పునర్విభజించిన నియోజకవర్గాలు సాధ్యమైనంతవరకు జనాభాపరంగా రాష్ట్ర మంతటా ఒకే పరిమాణంలో ఉంటాయి.
 పునర్విభజన ప్రక్రియ వల్ల ఆయా రాష్ట్రాలకు కేటాయించిన పార్లమెంటరీ, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో మార్పు ఉండదు.
 వీలైనంతవరకు అన్ని నియోజకవర్గాల్లో జనాభా సమానంగా ఉంటుంది.
 నియోజకవర్గాల ఏర్పాటులో భౌగోళికాంశాలు, పౌరులకు అనుకూలత మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొంటారు.
 నియోజకవర్గాలను ఏర్పాటు చేసేటప్పుడు వీలైనంతవరకు జిల్లాలో ఉప విభాగాలైన మండలం, గ్రామం విభజనకు గురికాకుండా చూస్తారు.
 అసెంబ్లీ నియోజక వర్గం ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది.
 నియోజకవర్గం మొత్తం జనాభా శాతంలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం పెద్దదిగా ఉంటే అది వారికి రిజర్‌‌వ చేస్తారు. అలాగే ఒక నియోజకవర్గంలో మిగిలిన వర్గాల జనాభా శాతం కంటే షెడ్యూల్ కులాల జనాభా శాతం ఎక్కువ ఉంటే ఆ నియోజకవర్గాన్ని వారికి కేటాయిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement