జీవన నైపుణ్యాలు నేర్పే.. ఫినిషింగ్ స్కూల్స్ | Finshing schools will offer to learn courses of Life skills | Sakshi
Sakshi News home page

జీవన నైపుణ్యాలు నేర్పే.. ఫినిషింగ్ స్కూల్స్

Published Wed, Sep 3 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

జీవన నైపుణ్యాలు నేర్పే.. ఫినిషింగ్ స్కూల్స్

జీవన నైపుణ్యాలు నేర్పే.. ఫినిషింగ్ స్కూల్స్

‘విద్యార్థులు కష్టపడి చదివి డిగ్రీలు సంపాదిస్తున్నారు కానీ.. జాబ్ మార్కెట్‌కు కావాల్సిన నైపుణ్యాలను పొందలేకపోతున్నారు’.. నేటి విద్యార్థుల తీరుపై పారిశ్రామిక వర్గాలు తరచుగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయమిది. అటు నాస్కామ్, ఫిక్కీ వంటి సంస్థల సర్వేలు కూడా ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. విద్యా సంస్థలు విద్యార్థుల కోసం ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నా.. చాలామంది తగిన స్కిల్స్ లేక ఉద్యోగ సాధనలో వెనుకంజలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి కొలువు సాధించడానికి, కెరీర్‌లో అత్యుత్తమంగా రాణించడానికి కావాల్సిన జీవన నైపుణ్యాలను నేర్పే ఉద్దేశంతో ఏర్పాటైనవే..  ఫినిషింగ్ స్కూల్స్. నగరంలో ఎన్నో ఫినిషింగ్ స్కూల్స్ వివిధ కోర్సులను అందిస్తున్నాయి.
 ఆ వివరాలు..
 
 ఫినిషింగ్ స్కూల్ అంటే..
 ఫినిషింగ్ స్కూల్స్.. విదేశాల్లో బాగా పాపులర్. ఆయా దేశాల యూనివర్సిటీల్లో కోర్సు పూర్తయ్యేనాటికి.. అటు అకడమిక్ నైపుణ్యాలతోపాటు ఇటు జాబ్ మార్కెట్‌కు తగిన స్కి ల్స్‌ను కూడా విద్యార్థులకు నేర్పిస్తారు. తద్వారా ఉ ద్యోగంలో చేరేనాటికే అన్ని నైపుణ్యాలను విద్యార్థులు పుణికిపుచ్చుకుంటారు. ఈ కోవలోనే మనదేశంలో కూడా ఫినిషింగ్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. అయితే ఇవి ఎక్కువగా ప్రైవేటు రంగంలో ఉన్నాయి. జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రంగాలకు సంబంధించి సర్టిఫికెట్, పీజీ డిప్లొమా కోర్సులను బోధిస్తున్నాయి. వీటి కరిక్యులమ్‌ను పారిశ్రామిక వర్గాల సలహాలు, సూచనల ప్రకారం రూపొందిస్తారు. అంతేకాకుండా క్లాస్ రూం టీచింగ్, ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌లకు సమ ప్రాధాన్యమిస్తారు. సమాజ, పరిశ్రమల అవసరాలకనుగుణంగా అభ్యర్థిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతారు.
 
 కోర్సుల్లో అంశాలివే
 బ్యాచిలర్స్ డిగ్రీ మూడో ఏడాదిలో చివరి మూడు నెలలు ఫినిషింగ్ స్కూల్ శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా.. సోషల్ స్కిల్స్, కల్చరల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, సాఫ్ట్ సిల్క్స్ వంటివి నేర్పిస్తారు. వేషధారణ (డ్రెస్సింగ్), బాడీలాంగ్వేజ్ (శరీర భాష), ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత ప్రవర్తన, మానవ సంబంధాలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, సంభాషణా చాతుర్యం, సమయస్ఫూర్తి, భోజన మర్యాదలు, పార్టీల్లో, ఫంక్షన్స్‌లో వ్యవహరించాల్సిన పద్ధతులు, విదేశీ క్లయింట్స్‌తో వ్యవహరించగల నేర్పు.. ఇలా సందర్భానికి తగినట్లుగా ఆయా నైపుణ్యాలు పొందేలా ఫినిషింగ్ స్కూల్స్‌లో బోధన ఉంటుంది. ఇందుకోసం సైకాలజీ, మేనేజ్‌మెంట్, హెల్త్, బ్యూటీ, ఫుడ్ అండ్ డైట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో నిపుణులైనవారితో తరగతులు నిర్వహిస్తారు.
 
 పురుషులు, మహిళలకు వేర్వేరు
 ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణి ంచాలంటే ఇదే ప్రధాన సూత్రం. ఫినిషింగ్ స్కూల్ కరిక్యులంలో అబ్బాయిలు, అమ్మాయిలకు శిక్షణాంశాలు వేర్వేరుగా ఉంటాయి. నగరంలోని పలు మహిళా కళాశాలల్లో అందిస్తున్న అంశాలివి.. పోషకాలున్న ఆహారాన్ని తయారుచేయడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం వంటి మహిళలకు అవసరమైన అంశాలతోపాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఈ-బ్యాంకింగ్, ఈ-కామర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివాటిని మహిళలకు నేర్పిస్తారు. వీటితోపాటు మైక్రోవేవింగ్, వెజిటెబుల్ కార్వింగ్, పర్సనల్ గ్రూమింగ్, ఏరోబిక్స్, యోగా తదితర అంశాలు కూడా ఉంటాయి. పురుషులకు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో రాణించేందుకు వీలుగా భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు, సమయపాలన, ప్రజెంటేషన్ స్కిల్స్, టేబుల్ మేనర్స్ వంటి వాటిలో శిక్షణనిస్తారు.
 
 కెరీర్‌లో మరింత రాణింపు
 ‘గ్రాడ్యుయేషన్ చివర్లో క్యాంపస్‌లోనే ప్లేస్‌మెంట్ సాధించి కెరీర్‌లో స్థిరపడాలనేది ఇప్పటి యువతరం ఆలోచన. దీనికి తగినట్లుగా అవసరమైన నైపుణ్యాలను రూపొందించేందుకే ఫినిషింగ్ స్కూల్స్ అంటున్నారు విల్లామేరి కళాశాల అకడమిక్ ఇన్‌ఛార్జి రేవతిదేవి మాధుర్. జాబ్ మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకు కేవలం అకడమిక్స్ అర్హతలు సరిపోవట్లేదని, అదనపు నైపుణ్యాలు ఉంటేనే కంపెనీలు ఉద్యోగాలిస్తాయని ఆమె చెబుతున్నారు. ముఖ్యంగా యువతులకు గృహాలంకరణ.. అందం, ఆరోగ్య సం బంధిత అంశాలపై నేర్చుకునే అంశాలు భావి జీవితంలో ఉపకరిస్తాయనేది ఆమె మాట. అంతేకాకుండా ప్రాక్టికల్‌గా ఎదురయ్యే సామాజిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ఇక్కడ నేర్చుకున్న ప్రొఫెషనల్ అంశాలు కెరీర్‌లో ఎదిగేందుకు తోడ్పడతాయని అంటున్నారు. ‘ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థినులకు ఈ తరహా శిక్షణ ఉపయోగకరం గా ఉంటుంది.  దీన్ని మా క్యాంపస్‌లోనూ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం’ అని అంటున్నారు వనితా మహావిద్యాలయ ప్రిన్సిపల్ డాక్టర్ బి.వాణి.
     
 కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్స్
 లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటి కోర్సులను దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కళాశాలలు అందిస్తున్నాయి. అయితే ఎక్కువగా వ్యాల్యూ యాడెడ్ కోర్సులుగా ఇవి అందుబాటులో ఉన్నాయి. నగరంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు, మేనేజ్‌మెంట్ కళాశాలలు.. అకడమిక్ కోర్సులతోపాటే వీటిలో శిక్షణ ఇస్తున్నాయి. తద్వారా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందడానికి మార్గం సుగమం చేస్తున్నాయి.
 
 ఆల్‌రౌండ్ ప్రతిభకు  కేరాఫ్ ఫినిషింగ్ స్కూల్స్
 ‘‘నేడు వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో రాణించాలంటే దానికి ఏకైక మార్గం.. ఫినిషింగ్ స్కూల్స్. శిక్షణ ద్వారా జీవన నైపుణ్యాలను అలవర్చుకుంటే కెరీర్‌లో మరింత ఉన్నతస్థానానికి చేరొచ్చు. డ్రెస్సింగ్, టైం మేనేజ్‌మెంట్, ఆటిట్యూడ్, ఆప్టిట్యూడ్, పర్సనల్ బిహేవియర్ ఇలా.. ప్రతిదీ జీవితంతో ముడిపడినదే. కాబట్టి లైఫ్ స్కిల్స్‌ను ప్రతి ఒక్కరూ పొందాలి. ముఖ్యంగా కార్పొరేట్ సంస్కృతి భాగ్యనగరంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులు చేసేందుకు యువత ఆసక్తి చూపుతోంది’’
 - కవిత, డెరైక్టర్, పనాచే ఫినిషింగ్ స్కూల్
 
     ఉస్మానియా యూనివర్సిటీ (దూరవిద్యా విధానంలో)
     వెబ్‌సైట్: www.oucde.org
     రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ - శ్రీపెరంబదూర్
     కోర్సు: ఎంఏ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్
     అర్హత: 45 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
     ఎంపిక: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా..
     వెబ్‌సైట్: www.rgniyd.gov.in
     రామకృష్ణ  మఠం - హైదరాబాద్,
     వెబ్‌సైట్: www.rkmath.org
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - రూర్కీ
     వెబ్‌సైట్:www.iitr.ac.in
     యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
     వెబ్‌సైట్: www.du.ac.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement