జాగ్రఫీ | Geography | Sakshi
Sakshi News home page

జాగ్రఫీ

Published Sun, Nov 10 2013 10:42 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

జాగ్రఫీ - Sakshi

జాగ్రఫీ

 వ్యవసాయ రంగం-1
 *    భూమిపై మానవుడు వ్యవసాయాన్ని ప్రారంభించి దాదాపు 12,000 సంవత్సరాలవుతోంది. ప్రపంచంలో ఇప్పటికీ 50 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో వ్యవసాయం ఆ ప్రాంత నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణస్థితి, మృత్తికలు, జీవసంబంధ కారకాలు. సామాజిక -ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
 *     1936లో విట్లెసే అనే శాస్త్రవేత్త 13 రకాల వ్యవసాయ ప్రాంతాలను గుర్తించాడు. వాటిలో ముఖ్యమైనవి....
 1.    సంచార పశుచారణ ప్రాంతాలు(నోమాడిక్ హెర్డింగ్): ఇందులో పశుపోషణ మాత్రమే ఉంటుంది. పంటల సాగు ఉండదు. ఈ ప్రాంతాల్లో ప్రజలు పశుపోషణపై ఆధారపడి జీవిస్తారు. మధ్య, నైరుతి ఆసియాలు, ఉత్తర ఆఫ్రికా,  ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీలోని అనటోలియా పీఠభూమి ప్రాంతాలు, సూడాన్, సహారా ఎడారికి చెందిన అర్ధశుష్క ప్రాంతాలు, తూర్పు ఆఫ్రికాలోని ఉన్నత భూములు ఈ ప్రాంతాల కిందికి వస్తాయి. మొహయిర్ అనే ఉన్నికి ప్రసిద్ధిగాంచిన ఆంగోరా మేకలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి.
 2.    వాణిజ్యపరమైన పశుగ్రాస ప్రాంతాలు (లైవ్‌స్టాక్ రాంచింగ్ రీజియన్‌‌స): ఇవి సమశీతోష్ణ, ఉష్ణమండల గడ్డిమైదాన ప్రాం తాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలు వ్యవసాయానికి పనికిరావు. ఇవి ఎక్కువగా మధ్య ఆసియాలోని స్టెప్పీలు, ఉత్తర అమెరికా, అర్జెంటీనాలోని పంపాలు, దక్షిణా ఆఫ్రికాలోని వెల్డులు, వెనెజువెలాలోని ఒరినాకో బేసిన్‌లో గల లానోలు, బ్రెజిల్‌లోని కాంపోలు, ఆస్ట్రేలియాలోని డౌన్‌‌స ప్రాంతాల్లో ఉన్నాయి. క్షీర సంపదను ఇచ్చే పశుజాతిని ఈ ప్రాంతాల్లో అధికంగా పెంచుతారు.
 3.    విస్తాపన (లేదా) మారక వ్యవసాయ ప్రాంతాలు(షిఫ్టింగ్ కల్టివేషన్ రీజియన్‌‌స): ఇవి కొండవాలుల్లో గిరిజనులు సాగుచేసే అతిపురాతన వ్యవసాయ ప్రాంతాలు. ఇక్కడ ప్రధానంగా కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నలు లాంటి చిరుధాన్యాలను సాగు చేస్తారు. ఈ వ్యవసాయ విధానాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. వెనెజువెలాలో కొనౌకొ, మెక్సికోలో మిల్పా, బ్రెజిల్‌లో రోకా, మలేషియాలో లడౌంగ్, ఫిలిఫ్పైన్‌‌సలో కెయిన్‌జిన్, వియత్నాం, లావోస్‌లలో రే, శ్రీలంకలో చెనా, మయన్మార్‌లో తాంగ్యా అని పిలుస్తారు. అదేవిధంగా భారతదేశంలోని అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో జూమ్ అని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బేవార్, దాహియా, పెషా, పెండౌ అని, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో పోడో అని, రాజస్థాన్‌లో వాత్రా అని, పశ్చిమ కనుమల్లో కుమారి అని, కేరళలో పోడో అని అంటారు.
 4.    సాంద్ర జీవనాధార వ్యవసాయం(ఇంటెన్సివ్ సబ్‌స్టెన్‌‌స అగ్రికల్చర్ రీజియన్‌‌స): దీన్ని రుతుపవన వ్యవసాయం అని కూడా వ్యవహరిస్తారు. ఇది ఆసియాలోని రుతుపవన భూములకు పరిమితమైంది. ఇక్కడి ప్రధాన పంటలు వరి, గోధుమలు. ప్రపంచంలో 2/3వ వంతు ప్రజలు ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు.
 5.    తోట పంటల వ్యవసాయ ప్రాంతాలు (ప్లాంటేషన్ అగ్రికల్చర్ రీజియన్‌‌స): తోట పంటలు లేదా వాణిజ్య పంటల సాగు ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రత్యేకమైంది. ఆసియా, ఆఫ్రికా, అమెరికాలలోని ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ రకమైన వ్యవసాయం ఎక్కువగా అమల్లో ఉంది. ఇది ఒక ఫ్యాక్టరీ- మేనేజ్‌మెంట్ లాంటి వ్యవసాయం. ఇందులో భూకమతాల పరిమాణం భారీగా ఉంటుంది. ఈ విధానంలో రబ్బర్, కాఫీ, తేయాకు, పత్తి, కొబ్బరి, కోకో, అరటి లాంటి పంటలను ఎక్కువగా సాగు చేస్తారు.
 6.    మిశ్రమ వ్యవసాయం: ఇందులో పంటలు, పశుపోషణ కలిసి ఉంటాయి. భూకమతాలు చిన్నవిగా ఉంటాయి. పశ్చిమ యూరప్, దక్షిణ తూర్పు ఆస్ట్రేలియా, దక్షిణ తూర్పు కెనడా, తూర్పు, పశ్చిమ అమెరికా, అర్జెంటీనా, ఉరుగ్వేల్లోని పంపా మైదానాల్లో ఈ విధానం అమల్లో ఉంది.
 7.    పాడి పశువుల పెంపక ప్రాంతాలు(డెయిరీ ఫార్మింగ్ రీజియన్‌‌స): తేమతో కూడిన పచ్చిక బయళ్లు పెరిగే ప్రాంతాల్లో పాడిపశువుల పోషణ అమల్లో ఉంది. బ్రిటన్, డెన్మార్‌‌క, నెదర్లాండ్‌‌స, స్కాండినేవియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా ప్రాంతాలు పాడిపశువుల పెంపకానికి ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది.
 8.    ఉద్యానవన సాగు ప్రాంతాలు(హార్టికల్చర్ ఫార్మింగ్ రీజియన్‌‌స): ఇక్కడ కూరగాయలు, పూలు, పండ్లను అధికంగా సాగు చేస్తారు. అమెరికాలో దీన్ని ట్రక్ ఫార్మింగ్ అని పిలుస్తారు. వాయువ్య యూరప్, బ్రిటన్, డెన్మార్‌‌క, బెల్జియం, నెదర్లాండ్‌‌స, ఫ్రాన్‌‌స, జర్మనీ దేశాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన సాగు అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ప్రపంచంలో కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, భారతదేశం  ద్వితీయ స్థానంలో ఉంది.
 9.    వాణిజ్యపరమైన ధాన్యసాగు ప్రాంతాలు(కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ రీజియన్‌‌స): ఇవి ప్రధానమైన ఏకీకృత గోధుమ క్షేత్రాలు. ప్రపంచంలో ఇవి ఎక్కువగా స్టెప్పీలు, డౌన్‌‌స, పంపాలలో విస్తరించి ఉన్నాయి.
 10.    మధ్యధరా వ్యవసాయ ప్రాంతాలు (మెడిటెరేనియన్ అగ్రికల్చర్ రీజియన్‌‌స): ఈ ప్రాంత శీతోష్ణస్థితికి అనుగుణంగా(తడి శీతాకాలాలు, పొడి వేసవి) ఇక్కడ ఎక్కువగా ఆలివ్, అత్తి, ఖర్జూరం, ద్రాక్ష, సిట్రస్ వంటి పండ్ల తోటలను సాగు చేస్తారు. ఈ ప్రాంతాలు ఎక్కువగా దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, కాలిఫోర్నియా తూర్పు ప్రాంతం, చిలీ మధ్య ప్రాంతం, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లలో విస్తరించి ఉన్నాయి.
 11.    ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు(కలెక్టివ్ ఫార్మింగ్ రీజియన్‌‌స): రష్యాలో కమ్యూనిటీ ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలను కోల్‌కోజెస్ అని, ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలను సోవ్‌కోజెస్ అని పిలుస్తారు.
 12.    సాంద్ర వ్యవసాయ విధానం(ఇంటెన్సివ్ అగ్రికల్చర్): రుతుపవన ప్రభావం ఉన్న ఆసియా దేశాల్లో వరి పంటను ఈ విధానంలో ఎక్కువగా సాగు చేస్తారు. ఈ విధానంలోని ముఖ్య అంశాలు..
         నీటి పారుదల సౌకర్యం ఉంటుంది.
         జనసాంద్రత అధికంగా ఉంటుంది.
         వ్యవసాయ పనుల్లో మానవ శ్రమ అధికంగా ఉంటుంది.
         భూకమతాల పరిమాణం చిన్నది
         ఎరువులు, క్రిమిసంహారక మందులను ఎక్కువగా వినియోగిస్తారు.
         పంట దిగుబడులు ఎక్కువగా ఉంటాయి.
 13.    విస్తృత వ్యవసాయ విధానం(ఎక్స్‌టెన్సివ్ అగ్రికల్చర్): మధ్య అక్షాంశ ప్రాంతాల్లో గోధుమ పంటకు సంబంధించి ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. ఈ ప్రాంతాలు సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితికి దూరంగా ఉంటాయి. ఇక్కడ వర్షపాతం 60 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ విధానాన్ని మధ్య ఆసియాలోని స్టెప్పీ ప్రాంతాలు, ఉత్తర అమెరికాలోని కేంద్ర, పశ్చిమ ప్రాంత మైదానాలు, ఆస్ట్రేలియాలోని డౌన్‌‌స ప్రాంతాలు, అర్జెంటీనాలోని పంపాలలో ఎక్కువగా అనుసరిస్తారు. ఈ విధానంలోని మౌలిక అంశాలు...
         నీటి పారుదల సౌకర్యాలు తక్కువగా ఉంటాయి.
         జనసాంద్రత తక్కువగా ఉంటుంది.
         వ్యవసాయం ఎక్కువ యాంత్రీకరణ చెంది ఉంటుంది.
         భూకమతాల పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది.
         మానవ శ్రమను తక్కువగా ఉపయోగిస్తారు.
         ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం తక్కువగా ఉంటుంది.
         పంట దిగుబడులు తక్కువగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement