జాగ్రఫీ | Geography | Sakshi
Sakshi News home page

జాగ్రఫీ

Published Tue, Nov 26 2013 10:42 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

జాగ్రఫీ - Sakshi

జాగ్రఫీ

వ్యవసాయ రంగం - 2
 వ్యవసాయ పంటల సాగు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుపోషణ, చేపల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, తేనెటీగల పెంపకం లాంటి పథకాలన్నింటినీ వ్యవసాయ రంగం అని పిలుస్తారు. భారతదేశ వ్యవసాయ రంగం ‘సాంద్రజీవనాధార వ్యవసాయ’ రకానికి చెందింది.
 
 వ్యవసాయ రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణిస్తారు. కారణం..
 *    దేశంలో దాదాపు 64 శాతం మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
 *    దేశంలోని కార్మికుల్లో 2/3వ వంతు మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు.
 *    అనేక పరిశ్రమలకు ఈ రంగం ముడి పదార్థాలను సమకూరుస్తోంది.
 *    దేశ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 13.5 శాతంగా ఉంది(2012-13 సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం). 1950-51లో ఇది 55 శాతంగా ఉండేది. అయినప్పటికీ ప్రపంచ దేశాల జాతీయ ఆదాయాల్లో వాటి వ్యవసాయ రంగాల వాటాను పరిశీలిస్తే భారత వ్యవసాయ రంగం వాటా ఇప్పటికీ అధికంగానే ఉంది.
 
 వ్యవసాయ రుతువులు
 భారతదేశంలో సంవత్సరాన్ని మూడు వ్యవసాయ రుతువులుగా విభజించారు. అవి...
 
 ఖరీఫ్: ఇది నైరుతి రుతుపవన కాలంతో ఏకీభవిస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు కొనసాగుతుంది. పంట కాలవ్యవధి ఐదు నెలలు. ఎక్కువ నీటిని వినియోగించుకొనే పంటలను ఈ రుతువులో సాగు చేస్తారు. అవి వరి, చెరకు, జనుము, మొక్కజొన్న, జొన్న, పత్తి, పొగాకు మొదలైనవి.
 
 రబీ: ఇది ఈశాన్య రుతుపవన కాలంతో ఏకీభవిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. పంట కాలవ్యవధి నాలుగు నెలలు. సాధారణంగా తక్కువ నీటిని వినియోగించుకొనే పంటలను ఈ రుతువులో సాగు చేస్తారు. అవి గోధుమ, బార్లీ, శెనగలు, ఆవాలు.
 
 జెయిద్: ఇది వేసవి రుతువుతో ఏకీభవిస్తుంది. సాధారణంగా నీటి పారుదల వసతులను కల్పించు కోవడం ద్వారా ఈ రుతువులో పంటలను సాగు చేస్తారు. మార్చి నుంచి మే వరకు తక్కువ పంట కాల వ్యవధి ఉన్న పంటలను సాగు చేస్తారు. అవి.. వరి, మొక్కజొన్న, దోస, గుమ్మడి, వేరుశెనగ, ఆకు, కాయగూరలు.
 
 భారతదేశంలో వ్యవసాయ ప్రాంతాలు:
 నేలలు, నీటి పారుదల వనరులు, శీతోష్ణస్థితి వైవిధ్యాల ఆధారంగా దేశాన్ని 5 వ్యవసాయ ప్రాంతాలుగా విభజించారు. అవి:
 సమశీతోష్ణ హిమాలయ ప్రాంతం: దీన్ని రెండు ఉప విభాగాలుగా విభజించారు. అవి..
 ఎ)    తూర్పు హిమాలయ ప్రాంతం: ఈ ప్రాంతంలో సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లు ఉన్నాయి. ఇక్కడ 250 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇక్కడ ప్రధానంగా సాగుచేసే పంటలు తేయాకు, వరి.
 బి)    పశ్చిమ హిమాలయ ప్రాంతం: ఇక్కడ ఉత్తరాంచల్‌లోని కుమయోన్, ఘర్‌వాల్ జిల్లాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా కొండలు, కులు, కాంగ్రా లోయలు, జమ్మూ కాశ్మీర్‌లు ఉన్నాయి. ప్రధానంగా ఉద్యానవన పంటలు, మొక్కజొన్న, బంగాళాదుంపలు, వరిని సాగుచేస్తారు. ఈ ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదవుతోంది.
 
 ఉత్తరమెట్ట ప్రాంతం: ఈ ప్రాంతంలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, బీహార్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర గుజరాత్, మధ్యప్రదేశ్ ఉత్తర ప్రాంతం, రాజస్థాన్‌లున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గోధుమ, బార్లీ, ఉలవలు, మొక్కజొన్న, పత్తి, సజ్జలను సాగు చేస్తారు.
 
 తూర్పు మాగాణి ప్రాంతం: ఈ ప్రాంతంలో అసోం, మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా, తూర్పు ఆంధ్రప్రదేశ్, తూర్పు తమిళనాడు, తూర్పు మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. ఇక్కడ వరి, చెరకు, జనుములను సాగు చేస్తారు.
 
 పశ్చిమ మాగాణి ప్రాంతం: ఇందులో కేరళ, పశ్చిమ సముద్ర తీర ప్రాంతాలు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా తేయాకు, కాఫీ, రబ్బరు, జీడిమామిడి, సుగంధ ద్రవ్యాలను సాగు చేస్తారు.
 
 దక్షిణ మధ్యస్త వర్షపాత ప్రాంతం: ఇందులో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, దక్షిణ గుజరాత్, పశ్చిమ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ తమిళనాడు, తూర్పు మహారాష్ర్ట, కర్ణాటకలోని కొన్ని భాగాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా జొన్న, సజ్జ, వేరు శెనగ, ఆముదాలు, పత్తి పంటలను సాగు చేస్తారు.
 
 పశు సంపద
 మన దేశంలో అత్యంత సంపన్నవంతమైన పశు సంపద ఉంది. ఇది దేశ వ్యవసాయ రంగంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. 2005లో చేపట్టిన పశువుల 17వ గణాంకాల ప్రకారం భారత్ ప్రపంచంలో అతి పెద్ద పశు సంపదల దేశం. ప్రపంచంలోని మొత్తం పశు సంపదలో భారత్ 17 శాతాన్ని కలిగి ఉంది.
 
 పాలిచ్చే జాతి పశువులు (ఆవులు)
     గిర్: గుజరాత్‌లోని సౌరాష్ర్ట ప్రాంతంలో ఈ జాతి పశువులున్నాయి. ఇది అత్యధికంగా పాలిచ్చే జాతి.
     సాహిల్‌వాల్: ఈ జాతి ఆవులు పంజాబ్, హర్యానా, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.
     సింధి: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం దీని జన్మస్థలం. గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ జాతి ఎక్కువ సంఖ్యలో ఉంది. అయితే వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం దీనికి ఉన్నందున దేశ వ్యాప్తంగా పాల ఉత్పత్తి కేంద్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
     దేవ్‌ని: రాష్ట్రంలోని పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఈ జాతి ఆవులు ఎక్కువగా ఉన్నాయి.
 
 బండిని లాగే ఎద్దులు
     నగోరి: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతం, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఇవి ఎక్కువగా ఉంటాయి.
     బచేర్: బీహార్‌లోని బాగల్పూర్, ముజఫర్‌పూర్, చంపారన్ జిల్లాల్లో ఈ జాతి ఎద్దులు అధికంగా కనిపిస్తాయి.
     మాల్వి: మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలు వీటి ఆవాస స్థలం.
     ఖేరిఘడ్: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్, ఖేరి జిల్లాల్లో ఈ జాతి సంపద ఎక్కువగా ఉంది.
     హల్లికార్/అమృత్ మహల్: దక్షిణ కర్ణాటకలోని తుంకూర్, హసన్, మైసూర్ జిల్లాల్లో ఈ జాతి అధికంగా ఉంటుంది.
     ఖిల్లారి: మహారాష్ర్టలోని షోలాపూర్, సతారా జిల్లాల్లో ఈ జాతి ఉంది.
 
 ఉభయ ప్రయోజనకర జాతులు
     ధారక్‌పర్: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం దీని జన్మ స్థలం. మన దేశంలో గుజరాత్, రాజస్థాన్‌లో ఉన్నాయి.
     మేవతి: పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని మధుర, ఆగ్రా ప్రాంతాల్లో ఈ జాతులున్నాయి.
     కంక్రేజ్: గుజరాత్‌లోని తూర్పు మైదానాలు
     దాంగ్రి: మహారాష్ర్ట
     ఒంగోలు: ఆంధ్రప్రదేశ్
     కృష్ణలోయ: దక్షిణ మహారాష్ర్ట, ఉత్తర కర్ణాటక
     పశ్చిమ ఐరోపా నుంచి దిగుమతి చేసుకున్న జాతులు: జెర్సీ, హోలస్టైన్, ఫ్రైషియన్, స్విస్ బ్రౌన్.
 
 గేదెలు
 దేశంలోని మొత్తం పాల ఉత్పత్తుల్లో గేదెలు 64శాతం పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మన దేశంలో వివిధ జాతుల గేదెలున్నాయి. అవి...
     ముర్రా: హర్యానాలోని రోహతక్, హిస్సార్, గుర్గావ్ జిల్లాల్లో ఈ జాతి గేదెలున్నాయి.
     భద్వారి: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, ఇటావా జిల్లాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్
     జఫర్‌బాది: గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతం
     సూర్తి: గుజరాత్ మైదానాలు
     నీలిరావి: పంజాబ్‌లోని ఫిరోజాబాద్ ప్రాంతం
     యహసానా: గుజరాత్, మధ్యప్రదేశ్
     నాగపూరి (ఎల్లిక్‌పూరి): మహారాష్ర్టలోని విదర్భ ప్రాంతంలో ఈ జాతి గేదెలున్నాయి.
 
 గొర్రెలు
 గొర్రెల సంఖ్య, ఉత్పత్తిలో రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉంది. వివిధ జాతుల గొర్రెలు...
     కాశ్మీర్‌లోయ, భదర్వా, భాహర్‌వార్, రాంపూర్: జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో ఈ జాతి గొర్రెలున్నాయి.
     జైసల్మేరి, మాల్పూరి, పుగల్, ముగ్రా:  రాజస్థాన్, హర్యానా
     డెక్కాని, నెల్లూరు, మాంధ్య: మహారాష్ర్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
     
 మేకలు
 మేకల సంఖ్యలో బీహార్ ప్రథమ స్థానంలో ఉంది. వీటినే పేదవాడి ఆవులుగా పిలుస్తారు. వివిధ జాతుల మేకలు...
     చంబా, గద్దె, చేగు, కాశ్మీరి: హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కాశ్మీర్‌ల్లో ఈ జాతి మేకలున్నాయి.
     షష్మిన్: కాశ్మీర్
     జమునా పరి, బార్బరి: పశ్చిమ యూపీ, హర్యానా
     బీటల్: పంజాబ్
     మార్వారి, మెహసానా, కథియావారి: రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్
     సూర్తి, డెక్కాని: దక్షిణ ద్వీపకల్పంలో ఈ జాతి మేకలున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement