ఆ మహానేతే ఉండివుంటే.. | If YS Rajasekhara Reddy was alive, the state of Andhra Pradesh could have never gone through such a situation | Sakshi
Sakshi News home page

ఆ మహానేతే ఉండివుంటే..

Published Mon, Sep 2 2013 4:40 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

If YS Rajasekhara Reddy was alive, the state of Andhra Pradesh could have never gone through such a situation

  • వైఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథంలో దూసుకెళ్లిన రాష్ట్రం
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్‌లతో                            
  •  భవిష్యత్‌పై భరోసాతో నిశ్చింతగా జీవించిన రాష్ట్ర ప్రజానీకం
  •   వైఎస్ మరణం తర్వాత తల్లకిందులైన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి
  •   అనిశ్చితి, సంక్షోభం, కల్లోలానికి మారుపేరుగా మారిన వైనం
  •   సంక్షేమ పథకాలకు తూట్లు.. పదేపదే పన్నుల చార్జీల వడ్డనలు
  •   సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కూరుకుపోయిన రాష్ట్రం
  •   భవిష్యత్‌పై ఆందోళన, నిత్యం అభద్రతతో ప్రజల జీవనం
  •   వైఎస్సే ఉంటే ఈ దుస్థితి కలలోనైనా వచ్చేది కాదంటున్న జనం
  •   మళ్లీ అలాంటి సమర్థ నాయకత్వం కావాలంటున్న రాజకీయ నిపుణులు
  •  ఒక మనసున్న మారాజు ఉన్నపుడు రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, భవిష్యత్‌పై భరోసాతో నిశ్చింతగా గడిపారు. ప్రజా సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం పరుగులు తీసింది. కానీ.. అదే మహానేత మరణంతో రాష్ట్రం పరిస్థితి ఒక్కసారిగా అధఃపాతాళానికి దిగజారిపోయింది. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తుపై నిత్యం అభద్రతతో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి ఆవిష్కృతమైంది. అనిశ్చితి, కల్లోలం, సంక్షోభం ఆంధ్రప్రదేశ్‌కు పర్యాయపదాలుగా మారిపోయాయి. ఆ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సరిగ్గా నాలుగేళ్ల కిందట సెప్టెంబర్ 2వ తేదీన ఘోర దుర్ఘటనలో అకాల మరణం చెందటం.. రాష్ట్ర గతిని, ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. వైఎస్సార్ జీవించి ఉండివుంటే ఈ పరిస్థితులు వచ్చేవే కాదని రాష్ట్ర ప్రజలు, రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
     
     అప్పుడు అభివృద్ధి, సంక్షేమపథంలో పయనం...
     పేద విద్యార్థి కలలకే పరిమితమైన ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఖరీదైన విద్యను వైఎస్ రాజశేఖరరెడ్డి వారి చేతుల్లోకి తెచ్చిపెట్టారు. నిరుపేదలు గడప తొక్కటానికే అవకాశం లేని కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యాన్ని ఆ పేదింటి ముంగిటికి తెచ్చి అందించాడు. ఆపదలో ఉన్న వారిని తక్షణం ఆదుకునేందుకు పల్లెల్లో, పట్టణాల్లో అత్యవసర అంబులెన్స్ సేవలు ప్రవేశపెట్టి నిరంతరం రక్షణ కల్పించాడు. ఏడేళ్ల కరువుతో సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్య తప్ప మరోగతి లేదనే నైరాశ్యంలో ఉన్న రైతన్నకు.. ఉచిత విద్యుత్, రుణమాఫీ, పావలా వడ్డీకి రుణాలు అందించి కొత్త ఊపిరిపోశాడు. రైతన్న బంగారు భవిష్యత్తు కోసం.. రాష్ట్రమంతా సస్యశామలం కావటం కోసం భగీరథ ప్రయత్నంతో జలయజ్ఞం ప్రారంభించాడు. పేదా, గొప్పా తేడా లేకుండా రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఉజ్వల భవిత కోసం ఊరూవాడా ఐఐటీలు, యూనివర్సిటీల వంటి విద్యాలయాలు, బడుగువర్గాలకు వసతిగృహాలు నెలకొల్పి విద్యాయజ్ఞం చేశారు. ప్రతి అవ్వా, తాతకు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు ఇచ్చి ఆదుకున్నాడు.
     
     ప్రతి పేదవాడికీ సొంత ఇంటి కలను సాకారం చేస్తూ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆయన ఉన్నన్నాళ్లూ ఒక్క చార్జీ.. ఆర్‌టీసీ చార్జీ కానీ, విద్యుత్ చార్జీ కానీ పెంచలేదు. ప్రజలపై ఏ పన్నునూ పెంచలేదు. కొత్తగా ఒక్క పన్ను కూడా వేయలేదు. ఆ తర్వాత ఐదేళ్లూ పెంచబోనన్నాడు. రాష్ట్ర ప్రజల్లో ఎలాంటి చింతా లేదు. భవిష్యత్‌పై ఎలాంటి ఆందోళనా లేదు. రాష్ట్రంలో రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఎలాంటి అస్థిరత, అభద్రత అన్న ఊసే లేదు. ప్రజా సంక్షేమానికి, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిత్యం పరితపించిన ఆ నాయకుడు మనసున్న మారాజుగా తిరుగులేని నాయకుడిగా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. రాష్ట్ర ప్రజలందరి సర్వతోముఖాభివృద్ధి కోసం ఎంతో దూరదృష్టితో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ సిసలైన సమర్థుడైన
      నాయకుడిగా జనం గుండెల్లో వైఎస్ పదిలమైన స్థానం సంపాదించుకున్నాడు.
     
     ఇప్పుడు అధఃపాతాళానికి పతనం...
     ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించే పాడిపంటలతో సుసంపన్నమైన హరితాంధ్రప్రదేశ్‌ను ఆ మహానేత స్వప్నించి.. అందుకోసమే అహర్నిశలూ శ్రమిస్తూ.. ఆ క్రమంలోనే ఘోర దుర్ఘటనలో ఆయన కన్నుమూశారు. ఆ మహానేత సరిగ్గా నాలుగేళ్ల కిందట హఠార్మరణంతో రాష్ట్రం పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. పెద్ద దిక్కును కోల్పోయిన జనం తల్లడిల్లిపోయారు. ఎంతోమంది గుండె ఆగి చనిపోయారు. ఆ తర్వాత సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు వేగంగా దిగజారిపోయాయి. సంక్షేమం రోజురోజుకూ తరిగిపోతూ వచ్చింది. వైఎస్ మరణానంతరం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన పాలకులు ప్రజా సంక్షేమాన్ని తాము మోయనవసరం లేని భారంగా పరిగణించటంతో ప్రజల పరిస్థితి క్రమంగా మళ్లీ మొదటికొచ్చింది. పేద విద్యార్థుల ఆశాదీపమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆంక్షలతో కోతలు పడ్డాయి. సీటు దక్కేనా.. సీటు దక్కినా ఫీజు కట్టగలమా అనే ఆందోళనకరమైన దుస్థితిలోకి బడుగు విద్యార్థి మళ్లీ జారిపోయాడు. పేదల సంజీవని ఆరోగ్యశ్రీ పథకానిదీ అదే పరిస్థితి. ఎన్నో వ్యాధుల చికిత్సకు కోతలు, చికిత్సకు అందించే నిధులకు కోతలు. వైద్యం నామమాత్రంగా మారింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కూడా పేరుకు మాత్రమే అమలవుతోంది.
     
     అసలు విద్యుత్‌నే ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రం దిగజారింది. రైతన్నకు పంట రుణాలు మళ్లీ గగనంగా మారాయి. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. బీడుభూములు నీటి కోసం నోళ్లు తెరుచుకుని ఆశగా చూస్తూనే ఉన్నాయి. వాటి దాహం ఎప్పుడు తీరుతుందో తెలీదు. అవ్వా, తాతలు పింఛన్ల కోసం మళ్లీ నెలల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. కొత్త పింఛన్లు కావాలంటే పాత పింఛన్‌దార్లలో ఎవరైనా చనిపోయే వరకూ వేచిచూడాల్సిన దారుణ పరిస్థితి వచ్చిపడింది. పేదల సొంతింటి కల మళ్లీ కలగా మారిపోయింది. మరోవైపు.. రాజకీయ అనిశ్చితి రోజురోజుకూ తీవ్రమైపోయింది. సామాజిక సంక్షుభిత పరిస్థితులు పెరిగిపోతూ వచ్చాయి. రాష్ట్రం నిత్య కల్లోలంగా మారిపోయింది. చివరికి ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నం దిశగా పరిస్థితులు దారితీశాయి. ఇప్పుడు రాష్ట్రమంతటా పెను సంక్షోభంలో కూరుకుపోయివుంది. ప్రజలందరిలో తీవ్ర ఆందోళనలు చెలరేగుతూ ఉన్నాయి. మొత్తం రాష్ట్రమే అగ్నిగుండంలా రగులుతూ ఉంది.
     
     మళ్లీ ఆ నాయకత్వం కావాలి...
     ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నపుడూ.. వైఎస్సార్ మరణం తర్వాత.. అనే రెండు దశలుగా ప్రజానీకం చూస్తున్నారు. ఆ మహానేతే జీవించి ఉన్నట్లయితే.. ఈ పరిస్థితులు దాపురించి ఉండేవా? ఆయనే గనుక బతికివుంటే.. ఇంతటి కల్లోలం, ఇంతటి సంక్షోభం తలెత్తి ఉండేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు. వైఎస్సార్ గనుక జీవించి ఉంటే.. పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవని.. రాష్ట్రం సస్యశ్యామలంగా హరితాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉండేదని సామాన్యులతో పాటు రాజకీయ పండితులు సైతం విచారస్వరంతో వ్యక్తం చేస్తున్న నిశ్చితాభిప్రాయం. రాష్ట్రానికి ఇప్పుడు మళ్లీ వైఎస్సార్ వంటి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని అభిప్రాయపడుతున్నారు. అలాంటి నాయకత్వంతోనే రాష్ట్రం మళ్లీ గాడినపడుతుందని.. సంక్షేమ, సర్వతోముఖాభివృద్ధి పథంలో పయనిస్తుందని స్పష్టంచేస్తున్నారు.
     
     వ్యవసాయమంటే వైఎస్‌కు ఎంతో మక్కువ
     వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకాల మరణం రాష్ట్ర రైతాంగానికి పెద్దలోటు. వ్యవసాయమన్నా, రైతు అన్నా ఓ ఆరాధనాభావమున్న అరుదైన నాయకుడు. ఏడేళ్ల కరువు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, గవర్నర్‌గా రంగరాజన్ పూర్తి సమన్వయంతో చేపట్టిన ప్రపంచబ్యాంకు సంస్కరణల కింద రాష్ట్ర రైతాంగం నలిగిపోతున్న సందర్భంలో రైతు బాంధవుడిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టారు వైఎస్. అధికారంలోకి వచ్చీ రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. ఈ నిర్ణయం తెలంగాణ రైతాంగానికి ఎంతో వెసులుబాటు నిచ్చింది. కేంద్రం రుణ మాఫీ ప్రకటిస్తే.. అది వర్తించని రైతులకు కూడా రూ. 5,000 చొప్పున మంజూరు చేసిన సిసలైన రైతు పక్షపాతి. దుర్భిక్ష రాయలసీమకు సాగునీరు ఇచ్చేందుకు పోతిరెడ్డిపాడును వెడల్పు చేయటం ఆయనకే సాధ్యమైంది. సొంత జిల్లాకు నీళ్లు ఇచ్చుకుంటున్నారని కొందరు విమర్శలు చేసినా.. వైఎస్ రాష్ట్రంలోని అన్ని దుర్భిక్ష ప్రాంతాలకూ సాగునీరు ఇవ్వాలని తపనపడ్డ నాయకుడు. సాంకేతిక అంశాలు.. సాధ్యాసాధ్యాలను కూడా పక్కన పెట్టి పెద్ద ఎత్తున జలయజ్ఞం చేపట్టారు. ఆయన మరణానంతరం ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకులు  సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారు. వైఎస్ ఉంటే ఈ పాటికి పులిచింతల పూర్తయ్యి ఉండేది. ఆయన పోయాక ప్రాజెక్టులే కాదు రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్ అకాల మరణం రాష్ట్రంలో రైతులకు పెద్ద లోటు.
     - వడ్డే శోభనాద్రీశ్వరరావు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి
     
     ప్రాజెక్టులకు ప్రాణం...
     సంవత్సరాల తరబడి పునాది రాళ్లకే పరిమితమైన సాగునీటి ప్రాజెక్టుల పనులను ఆచరణలోకి తీసుకువచ్చిన ఘనత దివంగత రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. ప్రాజెక్టుల పనులను ఆషామాషీగా, ఎన్నికల జిమ్మిక్కు కోసం ఆయన ప్రారంభించలేదు. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ప్రాజెక్టుల పరిపాలన అనుమతులు, టెండర్లు పిలవటం వంటి వాటికే సమయం సరిపోయింది. ఆ తరువాత ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంతో సాగాయి. అందుకు నిదర్శనం సాగునీటి ప్రాజెక్టుల పనులకు వైఎస్సార్ హయాంలో నెలకు రూ. 1,500 కోట్లు బిల్లులు చెల్లించేది. వైఎస్సార్ మరణం తర్వాత సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పుడు ప్రాజెక్టుల పనులకు నెలకు కేవలం రూ. 500 కోట్లే బిల్లులు చెల్లిస్తున్నారు. చాలా ప్రాజెక్టుల సమస్యలన్నింటినీ వైఎస్సార్ హయాంలోనే పరిష్కరించారు. అయినా ఆయన మరణానంతరం ప్రభుత్వాలు ప్రాజెక్టుల పనులను ముందు తీసుకువెళ్లలేకపోతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల పనులపై  రాజశేఖరరెడ్డి ప్రతి నెలా రెండు సార్లు క్షేత్రస్థాయిలో పనుల ఎలా జరుగుతున్నాయనే విషయంపై చీఫ్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించేవారు. ఏదైనా సమస్యలుంటే వారం రోజుల్లో పరిష్కారాలు కనుగొనేవారు. ఇప్పుడు ఆ చొరవ లోపించింది. వైఎస్సార్ జీవించి ఉంటే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల పనులు నేటికి చివరి దశకు చేరేవి. ప్రాజెక్టులను పూర్తి చేయటమే కాదు.. వాటి ద్వారా  నీటిని పొలాలకు పారిస్తేనే జలయజ్ఞం లక్ష్యం నెరవేరుతుందని పదే పదే ఇంజనీర్లకు గుర్తు చేసిన సీఎం రాజశేఖరరెడ్డి.
     - ఆర్.ప్రభాకర్‌రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్
     
     వైఎస్ ఉండివుంటే ఇంత కల్లోలం ఉండేది కాదు
     ఒక ముఖ్యమంత్రి చనిపోతే రాష్ట్రంలో ఇంత కల్లోల పరిస్థితి ఏర్పడిన చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే.. ప్రస్తుత రాష్ట్ర దృశ్యం ఈ విధంగా ఉండేది కాదు. సంక్షేమ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంతంగా అమల్లో ఉండేవి. ప్రత్యేకించి సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు, పథకాలు, ప్రజాహిత చర్యలు ఆయనకు ఖ్యాతి తెచ్చిపెట్టాయి. అందువల్లే ఆయన చనిపోయినప్పుడు.. ప్రజలంతా తమ పెద్ద దిక్కును కోల్పోయినట్లు బాధపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, సమన్వయం కోసం వైఎస్ ఎంతో కృషి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి విశిష్టంగా కృషి చేశారు. ఆయన నాయకత్వ పటిమకు మచ్చుకు ఒక విషయం చెప్తాను. రాష్ట్రానికి గ్యాస్ సరఫరాలో జరిగిన అన్యాయాన్ని వైఎస్ ఎదిరించారు. కేజీ బేసిన్ గ్యాస్ విషయంలో రిలయన్స్ సంస్థ ఎన్ని నాటకాలు ఆడుతోందో చూస్తూనే ఉన్నాం. కొన్ని విషయాల్లో వైఎస్‌తో విభేదించినా.. ఆయన నాయకత్వ పటిమ, పాలనా దక్షతను అభినందించాల్సిందే.
     - ఎ.బి.కె.ప్రసాద్, ప్రముఖ సంపాదకులు
     
     ఆరోగ్యశ్రీ అమలు కావటం లేదు...
     దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమై, అద్భుత ప్రాచుర్యం పొందిన ఆరోగ్యశ్రీ, 108, 104 కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావటం లేదు. ముఖ్యంగా 108, 104 అనేవి సేవా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల అమలులో సమ్మెలు, బంద్‌లు జరగకూడదు. దురదృష్టవశాత్తు అలా జరుగుతున్నాయి. ఉద్యోగులు జీతాల పెంపుదల కోసం, హక్కుల కోసం నెలల తరబడి సమ్మెలు చేసిన ఉదంతాలు మన కళ్లముందే కనిపించాయి. ఆరోగ్యశ్రీ పథకం కూడా అంతే. సేవాభావంతో కార్పొరేట్ ఆస్పత్రులు స్పందించాల్సి ఉన్నా వాళ్లు ఎప్పుడూ స్పందించరు. వాళ్లు వ్యాపార దృక్పథంతోనే చూస్తారు. పోనీ ప్రభుత్వం నిధులు విడుదల చేసి పథకాన్ని అమలు చేస్తుందా అంటే అదీ లేదు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వాలు నిధులివ్వలేక పోవటం ఆశ్చర్యకరం. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఈ పథకాల అమలు సరిగా లేదు.     
     -పొత్తూరి వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు
     
     నిరుపేద విద్యార్థి వైద్యుడయ్యాడు...
     ‘‘కనీసం రూ. 5 వేలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఓ నిరుపేద విద్యార్థి దర్జాగా తన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పట్టుకుని వెళ్లి ఫీజు ఎంత అన్న దానితో సంబంధం లేకుండా ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి వృత్తివిద్యా కోర్సుల్లో చేరే అవకాశం కల్పించింది ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం. ఈ పథకాన్ని దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చాలా దూరదృష్టితో ప్రవేశపెట్టారు. విద్యార్థులపై పెట్టే పెట్టుబడిని ఖర్చు కోణంలో చూడవద్దని, దానిని పెట్టుబడి కోణంలోనే చూడాలని, ఒక పేదవాడు ఇంజనీరింగ్, మెడిసిన్ చదివితే ఆ కుటుంబం శాశ్వతంగా అభివృద్ధి చెందుతుందని పదేపదే చెప్పే ఆయన తన ఆలోచనకు అనుగుణంగా రూపొందించిన మానసపుత్రిక ఈ పథకం. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేయాలని 2007లో రాజశేఖర్‌రెడ్డిని కోరాం. మా విజ్ఞప్తిని సీఎం అన్ని డిమాండ్ల తరహాలోనే మామూలుగా తీసుకుంటారని భావించాం. కానీ వైఎస్సార్ అలా చేయలేదు. వెంటనే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బీసీ విద్యార్థులకు శాచ్యురేషన్ (సంతృప్తస్థాయి) పద్ధతిలో ఫీజుల పథకాన్ని అమలుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆయన ఉన్నన్ని రోజులు ఈ పథకం చక్కగా అమలు జరిగింది.  తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని భ్రష్టు పట్టించాయి.
           - ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
     
     దూరదృష్టితో వైఎస్ నిర్ణయాలు...
     ‘‘దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సజీవంగా ఉండివుంటే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తలెత్తి ఉండేవి కానేకావు. అనిశ్చిత పరిస్థితులు తలెత్తకుండా వైఎస్సార్ చాలా ముందస్తు ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోగలిగేవారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదు. ఏమైనా నిర్ణయాలు మెజారిటీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఉండాలి. శాంతిభద్రతలకు సంబంధించి కూడా రాజశేఖరరెడ్డికి స్పష్టమైన అవగాహన ఉండేది. భవిష్యత్‌లో వచ్చే సమస్యలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. దీంతోనే నక్సలైట్లతో శాంతిచర్చలు వంటి సంచలనాత్మక నిర్ణయాలను ఆయన అమలు చేయగలిగారు. ఆయన జీవించి ఉండివుంటే సంక్షేమ పథకాల అమలుకూడా మరింత వేగవంతమయ్యేదనటంలో సందేహం లేదు.
         - మాజీ డీజీపీ కె.అరవిందరావు
     
     విద్యాయజ్ఞం ఘనత ఆయనదే...
     కొన్ని ప్రత్యేక కారణాల వల్ల జలయజ్ఞానికి ప్రాధాన్యత లభించినా విద్యాయజ్ఞాన్ని ప్రారంభించింది కూడా వై.ఎస్.రాజశేఖరరెడ్డే. రాష్ట్రంలో ఐఐటీ, బిట్స్ మొదలుకుని ట్రిపుల్ ఐటీలు, జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించటంలో ఆయన ముందుచూపు, చిత్తశుద్ధి కనిపిస్తోంది. ఆయన హయాంలో అనేక విద్యాసంస్థల ద్వారా వృత్తివిద్యలో ప్రవేశాలు అందుబాటులోకి వచ్చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో ప్రతి పేద గుడిసెకూ ఉన్నత విద్యను చేర్చిన ఘనత ఈ దేశంలో ఒక్క రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుంది. ఆయన మరణం విద్యారంగానికి తీరని లోటు.  
         - డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, విద్యారంగ నిపుణులు
     
     విద్యుత్ రంగంలో సాహసోపేత నిర్ణయాలు...
     రైతులపై పెట్టుబడి భారం తగ్గించేందుకు ఎంతో సాహసోపేతంగా ఉచిత విద్యుత్ పథకాన్ని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. రైతులు చెల్లించాల్సిన సుమారు రూ. 1,250 కోట్ల విద్యుత్ బకాయిలను కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేశారు. రైతులపై బనాయించిన విద్యుత్ కేసులను కూడా మాఫీ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని మాట ఇచ్చి.. అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కపైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. పరిశ్రమలకు విద్యుత్ చార్జీలను కూడా తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో)కు వైఎస్ ఊపిరిపోశారు. వైఎస్ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో ఆధ్వర్యంలో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లను విజయవాడతో పాటు ఖమ్మం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి సమీపంలో మొత్తం మూడు విద్యుత్ ప్లాంట్లను చేపట్టారు. వైస్సార్ జిల్లాలో 210 మెగావాట్లు, 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏకంగా 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కష్ణపట్నం థర్మల్ ప్లాంటును ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలో మరో 600 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేశారు. అయితే.. ఆయన మరణానంతరం వచ్చిన పాలకులకు ఈ దూరదృష్టి లేకుండా పోయింది. కొత్తగా ఒక్క విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా చేపట్టలేదు. రెగ్యులర్, సర్దుబాటు చార్జీలను ప్రజలపై భారీగా మోపారు.      
     - ఎ. పున్నారావు, విద్యుత్‌రంగ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement