భారత్‌కు యునెస్కో అవార్డు | India wins UNESCO 'Award of Excellence' for conserving Vadakkunathan Temple | Sakshi
Sakshi News home page

భారత్‌కు యునెస్కో అవార్డు

Published Wed, Sep 9 2015 10:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

భారత్‌కు యునెస్కో అవార్డు

భారత్‌కు యునెస్కో అవార్డు

 జాతీయం
 వన్ పెన్షన్ అమలుకు కేంద్రం నిర్ణయం మాజీ సైనికులకు ఒక ర్యాంకు-ఒక పెన్షన్ విధానాన్ని త్వరలో అమలుచేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబరు 5న ప్రకటించారు. దీన్ని 2014 జూలై నుంచి వర్తింపచేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.8000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల మేర భారం పడనుంది. దాదాపు 24 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు ఉన్నారు. గతంలో ఉన్న ఒక ర్యాంకు-ఒక పెన్షన్ విధానాన్ని మూడో పే కమిషన్ నివేదికల ఆధారంగా 1973లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది.
 
 డెహ్రాడూన్‌లో ప్రపంచ సహజ పరిరక్షణ కేంద్రం
 సహజ వారసత్వ ప్రాంతాల రక్షణలో భాగంగా తొలి ప్రపంచ సహజ పరిరక్షణ కేంద్రం డెహ్రాడూన్‌లో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సెప్టెంబరు 2న భారత్, యునెస్కోలు సంతకాలు చేశాయి. ఈ కేంద్రాన్ని డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)లో ఏర్పాటు చేస్తారు. దీన్ని ప్రపంచ స్థాయి సహజ వారసత్వ సంపద, నిర్వహణ, శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఎనిమిది దేశాల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు పనిచేస్తున్నాయి. కాగా సహజ వారసత్వ పరిరక్షణ కోసం యునెస్కో ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇదే.  డెహ్రాడూన్‌లోని కేంద్రం ఆసియా, పసిఫిక్ ప్రాంతాలతో పాటు 50 దేశాల్లోని పరిరక్షించదగ్గ సహజ వారసత్వ ప్రదేశాలను గుర్తిస్తుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 227 వారసత్వ ప్రాంతాలు ఉండగా అందులో 59 సహజ వారసత్వ ప్రాంతాలు. ఇండియాలో 32 వారసత్వ ప్రదేశాలు ఉండగా అందులో తొమ్మిది సహజ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి.
 
 మణిపూర్ హింసలో 8 మంది మృతి
 మణిపూర్‌లో గిరిజన విద్యార్థి సంఘాలు సెప్టెంబరు 1న నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారి 8 మంది మృతికి దారితీసింది. చురచాంద్‌పూర్ పట్టణంలో జరిగిన ఆందోళనలో నలుగురు పోలీసుల కాల్పుల్లో మరణించారు. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. ఆగస్టు 31న శాసనసభ ఆమోదించిన మణిపూర్ భూ రెవెన్యూ, సంస్కరణల(సవరణ) బిల్లు-2015కు వ్యతిరేకంగా గిరిజన విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమి కొనుగోలు హక్కు కల్పిస్తుంది. స్థానిక గిరిజన తెగలు ఇన్నర్‌లైన్ పర్మిట్ (ఐఎల్‌పీ) విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
 
 ఆర్థికం
 కరెన్సీ నోట్లకు కొత్త నంబరింగ్ విధానం! నకిలీ కరెన్సీ నోట్ల నియంత్రణ దిశగా రూ.1000, రూ.500 నోట్లలో కొత్త నంబరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ముద్రా ప్రైవేట్ లిమిటెడ్, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లకు సూచించింది. ఈ కొత్త నోట్లు వచ్చే ఏడాది మే నుంచి అందుబాటులోకి రానున్నాయి.  
 
 ఫార్చ్యూన్ గ్లోబల్ జాబితాలో ఐఓసీ
 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్‌కు చెందిన అతిపెద్ద చమురు రిటైల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కి 119వ స్థానం దక్కింది. ఇది 2015 సంవత్సరానికి గ్లోబల్ 500 రెవెన్యూలో అతిపెద్ద భారతీయ సంస్థగా ఫార్చ్యూన్ జాబితాలో నిలిచింది. గత 20 ఏళ్లుగా ఐఓసీ ఈ జాబితాలో చోటుదక్కించుకుంటోంది. ఇంతవరకు ఏ భారతీయ కంపెనీ కూడా ఫార్చ్యూన్ జాబితాలో ఐఓసీని అధిగమించలేదు.
 
 రాష్ట్రీయం
 ఈ-ప్రగతి ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్ ఆమోదంప్రభుత్వ యంత్రాంగం కంప్యూటరీకరణకు ఉద్దేశించిన ఈ-ప్రగతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సెప్టెంబరు 5న ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు, 315 డిపార్ట్‌మెంట్లు, 745 ఈ-సేవలను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తారు. సింగపూర్ కంపెనీ, విప్రోల సంయుక్త భాగస్వామ్యంతో మూడు దశల్లో ప్రాజెక్టును పూర్తిచేస్తారు. ఇందుకు మొత్తం రూ.2,358 కోట్లు ఖర్చుచేస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,528 కోట్లు సమకూర్చుతుంది.
 
 ప్రజాప్రతినిధుల గౌరవవేతనం పెంపు
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతూ సెప్టెంబరు 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు వల్ల జడ్పీ చైర్మన్ వేతనం రూ.7,500 నుంచి రూ.40 వేలకు పెరిగింది. అలాగే జడ్పీటీసీ సభ్యుల వేతనం రూ.2,250 నుంచి ఆరువేలకు, ఎంపీపీలకు రూ.1,500 నుంచి రూ.6,000కు, ఎంపీటీసీ సభ్యుల వేతనం రూ. 750 నుంచి రూ.3,000కు, సర్పంచ్‌ల వేతనం రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెరిగింది.
 
 తెలంగాణా భాషా దినోత్సవంగా
 కాళోజీ జయంతి ప్రజా కవి కాళోజీ నారాయణరావు జన్మదినమైన సెప్టెంబరు 9న తెలంగాణా భాషా దినోత్సవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సెప్టెంబరు 6న ప్రకటించారు. ఆ రోజున రాష్ట్రమంతటా తెలంగాణా భాషా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణా భాషపై చర్చాగోష్టులు, రచనలు, ఉపన్యాసాలు, కవితల్లో పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణ భాషకు, సాహిత్యానికి సేవ చేసిన వారికి కాళోజీ పేరున స్మారక పురస్కారం అందజేస్తారు.
 
 వర్షాలకు ఏపీలో 22 మంది మృతి
 ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సెప్టెంబరు 6న కురిసిన వర్షాకు, పిడుగుపాటుకు 22 మంది మరణించారు. ప్రాణ నష్టంతో పాటు వివిధ జిల్లాల్లో ఆస్తి నష్టం కూడా సంభవించింది. మరణించిన వారికి ప్రభుత్వం రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
 
 అవార్డులు
 భారత్‌కు యునెస్కో అవార్డు కేరళలోని త్రిసూర్‌లో గల వడక్కునాథన్ ఆలయ పరిరక్షణకు తీసుకున్న చర్యలకు గానూ భారత్‌కు ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) మొత్తం 5 దేశాలలోని(భారత్, చైనా, లావోడిపిఆర్, ఆస్ట్రేలియా, థాయిలాండ్) 12 ప్రాజెక్టులకు వివిధ కేటగిరీల్లో 2015 సంవత్సరానికి అవార్డులను ప్రకటించింది.
 
 ఝంపా లాహిరికి నేషనల్
 హ్యుమానిటీస్ మెడల్‌భారతీయ అమెరికన్, పులిట్జర్ బహుమతి గ్రహీత ఝంపా లాహిరికి 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అమెరికా నేషనల్ హ్యుమానిటీస్ మెడల్ లభించింది. మానవ సంబంధాలను అద్భుత రీతిలో ఆవిష్కరించినందుకు ఈ అవార్డుకు ఆమెను ఎంపికచేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. ఆమె తన రచనల ద్వారా భారతీయ అమెరికన్ల అనుభవాలను అద్భుతంగా ఆవిష్కరించినట్లు తెలిపింది. ఈ అవార్డును ఆమెకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సెప్టెంబరు 10న బహూకరిస్తారు.
 
 అంతర్జాతీయం
 శ్రీలంక ప్రతిపక్ష నేతగా సంపన్‌థన్ మూడు దశాబ్దాల తర్వాత శ్రీలంక పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా తమిళ నేత ఆర్.సంపన్‌థన్ నియమితులయ్యారు. తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్‌ఏ) నేత ప్రతిపక్ష నాయకుడిగా నియమితులైనట్లు స్పీకర్ కరు జయసూరియా సెప్టెంబరు 3న ప్రకటించారు. సంపన్‌థన్ 22 సంవత్సరాలకు పైగా ఎంపీగా పనిచేశారు. తొలి తమిళ ప్రతిపక్ష నాయకుడిగా 1977 నుంచి 1983 వరకు తమిళ్ యునెటైడ్ లిబరేషన్ ఫ్రంట్ (టీయూఎల్‌ఎఫ్)కు చెందిన ఎ.అమృతలింగమ్ పనిచేశారు.
 
 చైనా సైనిక పాటవ ప్రదర్శన
 రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా తన సైనిక పాటవాన్ని సెప్టెంబరు 2న బీజింగ్‌లోని తియన్మెన్ స్క్వేర్ వద్ద ప్రదర్శించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు వంటి ఆయుధాలను చైనా ప్రదర్శించింది. రష్యా, పాకిస్తాన్ సహా 17 దేశాల నుంచి వచ్చిన వెయ్యి మంది సైనికులు కూడా ఈ కవాతులో పాల్గొన్నారు. చైనా పౌరులు, విదేశీ అతిథులు ఈ ప్రదర్శనను వీక్షించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు వేదికపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ సహా 30 దేశాల నేతలు ఈ ప్రదర్శనను తిలకించారు.
 
 బహదుర్ డాంగీ మృతి
 ప్రపంచంలో అతి పొట్టి మనిషిగా గిన్నిస్ రికార్డుల్లో ఉన్న నేపాల్‌కు చెందిన చంద్ర బహదూర్ డాంగీ (75) అమెరికాలో సెప్టెంబరు 4న అనారోగ్యంతో మరణించారు. 2012 గిన్నిస్ రికార్డు ప్రకారం డాంగీ ఎత్తు 54.6 సెంటీమీటర్లు.
 
 క్రీడలు
 అపూర్వికి షూటింగ్‌లో రజతం ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత షూటర్ అపూర్వి చండేలా రజత పతకం సాధించింది. సెప్టెంబరు 5న మునిచ్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అపూర్వి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది. అహ్మది ఎల్హాన్ (ఇరాన్) స్వర్ణ పతకం సాధించింది. సెర్బియాకు చెందిన ఆండ్రియాకు కాంస్య పతకం దక్కింది.
 
 జోష్న చిన్నప్పకు
 ఇండియన్ స్క్వాష్ టైటిల్ ఇండియన్ స్క్వాష్ సర్క్యూట్‌లో జోష్న చిన్నప్ప (భారత్) మహిళల టైటిల్ గెలుచుకుంది. ముంబైలో సెప్టెంబరు 6న జరిగిన పోటీలో హబీబా మహ్మద్ (ఈజిప్టు)ను జోష్న ఓడించింది. పురుషుల టైటిల్‌ను ఆడ్రియన్ వాలెర్(ఇంగ్లండ్) గెలుచుకున్నాడు. మహేశ్ మంగోంకర్ (భారత్)ను వాలెర్ ఓడించారు.
 
 హామిల్టన్‌కు ఇటాలియన్ గ్రాండ్ ప్రి
 ఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మొంజా (ఇటలీ) లో సెప్టెంబరు 6న జరిగిన రేసులో మెర్సిడెజ్ డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలువగా, ఫెరారీ డ్రైవర్ వెటల్ రెండో స్థానం సాధించాడు.
 
 ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్
 ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. బ్యాంకాక్‌లో సెప్టెంబరు 6న ముగిసిన పోటీల్లో కజకిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్ రెండో స్థానంలో, థాయిలాండ్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఈవెంట్ ద్వారా అక్టోబరులో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించారు.
 
 శ్రీలంక టెస్ట్‌లో భారత్ విజయం
 భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. సెప్టెంబరు 1న కొలంబోలో ముగిసిన మూడో టెస్ట్‌ను భారత్ గెలుచుకోవడంతో సిరీస్ 2-1తో భారత్‌కు దక్కింది. 22 ఏళ్ల తర్వాత భారత్ శ్రీలంకలో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. గతంలో 1993లో శ్రీలంకపై అజహర్ నేతృత్వంలో 1-0తో టెస్ట్ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అశ్విన్ నిలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement