మౌలిక రంగం.. కెరీర్‌కు ఉజ్వల తరంగం | Infrastructure sector will help to build up your career | Sakshi
Sakshi News home page

మౌలిక రంగం.. కెరీర్‌కు ఉజ్వల తరంగం

Published Wed, Sep 24 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

మౌలిక రంగం.. కెరీర్‌కు ఉజ్వల తరంగం

మౌలిక రంగం.. కెరీర్‌కు ఉజ్వల తరంగం

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. మానవాభివృద్ధిలో అందరి కంటే ముందుండాలంటే మౌలిక సదుపాయాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. రహదారులు, రైల్వేలు, తాగునీటి సరఫరా, పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ల నిర్మాణం వంటి వాటికి పెద్దపీట వేయాలి. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న కృత నిశ్చయంతో ఉంది. పేదలకు నివాస గృహాలు, మురికివాడల నిర్మూలన, నగర శివార్లకు సైతం మెట్రో రైలు, రోడ్ల నిర్మాణంతోపాటు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)కు కావాల్సిన వసతులు కల్పించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిపుణులకు ప్రాధాన్యత పెరుగుతోంది. సిటీలో వివిధ విద్యా సంస్థలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసిన వారికి మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
 
 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ అంటే..
 నదీ ప్రాజెక్టులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, రహదారులు, రైల్ నెట్‌వర్క్స్, చమురు, గ్యాస్ పైప్‌లైన్స్, గ్రామాల్లో, పట్టణాల్లో గృహ నిర్మాణం, పార్కులు, విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలు, వ్యర్థాల నిర్వహణ, టెలి కమ్యూనికేషన్స్, నౌకా నిర్మాణం, ఓడరేవులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వంటి వాటి నిర్మాణం, నిర్వహణే.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్. విభిన్న మౌలిక రంగాల నుంచి ఇన్‌పుట్, ఔట్‌పుట్ సేవలను అందించడమే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ల విధి. ప్రాక్టికల్, కాన్సెప్ట్ స్థాయిలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని వీరు తక్షణమే పరిష్కరించాలి.
 
 అవకాశాలెన్నో..
 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో సంబంధిత కోర్సులు పూర్తిచేసినవారికి అపారమైన అవకాశాలున్నాయి. వినూత్న పంథాలో ఆలోచించి, నిర్వహణలో రాణించాలనే ఆకాంక్ష ఉన్న వారికి ఉజ్వల భవితను అందించే వేదికగా మౌలిక రంగం మారింది. నైపుణ్యాలున్న ఉన్నవారికి భారీ వేతనాలు అందిస్తూ ఎవర్‌గ్రీన్ కెరీర్స్‌లో ఒకటిగా ఇన్‌ఫ్రా విరాజిల్లుతోంది. ఈ రంగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి, సుస్థిర అభివృద్ధి దిశగా నడిపించేవారికి ఎర్రతివాచీ పరుస్తోంది. కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్, ఎస్టేట్స్ మేనేజర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ మేనేజర్స్, ఫెసిలిటీ మేనేజర్, ప్రాపర్టీ మేనేజర్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఐటీ మేనేజర్ - రియల్ ఎస్టేట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ వంటి హోదాల్లో ఆయా సంస్థల్లో పనిచేయొచ్చు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్న కళాశాలల్లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించవచ్చు.
 
 సివిల్ ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారికి ఈ రంగంలో మంచి భవిష్యత్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు వాటికి సంబంధించిన సాంకేతిక అంశాలపై వీరికి అవగాహన ఉండటమే దీనికి కారణం. ఇంజనీరింగేతర గ్రాడ్యుయేట్లకు కూడా ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఐటీ, సేల్స్, రియల్ ఎస్టేట్ విభాగాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. కెరీర్‌లో శరవేగంగా ఎదిగేందుకు, ఆకర్షణీయ జీతాలను ఆర్జించేందుకు ఇన్‌ఫ్రాదోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగ నిపుణులకు ఆకాశమే హద్దు. రానున్న పదేళ్లలో ఏటా ఈ రంగం 7 -8 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
 
 కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానం
 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలతోపాటు సివిల్ ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు, వెండర్లు, సప్లయర్లు, అకౌంటెంట్లు, కాంట్రాక్ట్ వర్కర్లతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. వారిని మెప్పించి, ఒప్పించే మాటతీరును సొంతం చేసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రాంతీయ భాషతోపాటు ఇంగ్లిష్, హిందీ వచ్చి ఉండాలి. ఓర్పు, సహనం తప్పనిసరి. విభిన్న అంశాలపై లోతైన పరిజ్ఞానం అవసరం. సమస్యా పరిష్కార నైపుణ్యాలు కూడా ఉండాలి. విభిన్న ప్రదేశాల్లో స్థలాల అమ్మకంలో కొనుగోలుదార్లను మెప్పించడంలో చతురత, చురుకుదనం, ఆత్మవిశ్వాసం చూపాలి. నాణ్యత తనిఖీ, బడ్జెట్ అంచనాలు వేయడం, మానవ వనరుల వినియోగం, ప్రాజెక్ట్‌కు సంబంధించి డాక్యుమెంట్ల నిర్వహణలో పరిజ్ఞానం అవసరం. టాప్ రిక్రూటర్స్ లార్సన్ అండ్ టూబ్రో, జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్, జయప్రకాశ్ అసోసియేట్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, గామన్ ఇండియా, కె.రహేజా, 99 ఎకరాస్, డీఎల్‌ఎఫ్ వంటి కంపెనీలు.
 
 కోర్సులను అందిస్తున్న విద్యా సంస్థలు
 చాలా విద్యా సంస్థలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్‌ను ఎంబీఏ/పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్‌లో ఒక స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇటీవల కాలం లో ఈ రంగానికి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో మరికొ న్ని విద్యా సంస్థలు గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి.
  ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా - హైదరాబాద్
 కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ (స్పెషలై జేషన్స్: సివిల్, పవర్, టెలికమ్యూనికేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్)
 అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణత.
 ఎంపిక: క్యాట్/మ్యాట్/సీమ్యాట్/ఎక్స్‌ఏటీ/ఏటీఎంఏ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా.
 వ్యవధి: రెండేళ్లు
 వెబ్‌సైట్: www.escihyd.org
  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ - హైదరాబాద్
 కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్; పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్
 వ్యవధి: రెండేళ్లు
 అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్/బీఆర్క్/బీప్లానింగ్ ఉత్తీర్ణత.
 ఎంపిక: ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా.
 వెబ్‌సైట్: www.nicmar.ac.in
  నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ - హైదరాబాద్
 కోర్సు: పీజీడీఎం (ఎలక్టివ్స్‌లో భాగంగా ఆపరేషన్స్ అండ్ ఐటీలో ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌లను బోధిస్తోంది)
 వెబ్‌సైట్: జ్ట్టిp://nmimshyderabad.org/
  తెరీ యూనివర్సిటీ, ఢిల్లీ,  కోర్సు: ఎంబీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
 అర్హత: 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
 ఎంపిక: క్యాట్/జీమ్యాట్/మ్యాట్ స్కోర్లతోపాటు బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
 వెబ్‌సైట్: www.teriuniversity.ac.in
  సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ అండ్ హ్యూమన్      రిసోర్స్ డెవలప్‌మెంట్-పుణె
 కోర్సు:ఎంబీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్
 అర్హత: సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
 ఎంపిక: స్నాప్ ప్రవేశపరీక్షలో స్కోర్‌తోపాటుబృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా
 వెబ్‌సైట్: www.scmhrd.edu
  యూనివర్సిటీ ఆఫ్ ఎనర్జీ అండ్ పెట్రోలియం స్టడీస్-
     డె హ్రాడూన్
 కోర్సు: ఎంబీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్
 అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్/మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ ఉత్తీర్ణత.
 ఎంపిక: ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా.
 వెబ్‌సైట్: www.upes.ac.in
  సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ- అహ్మదాబాద్
 కోర్సు: ఎంటెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ డి జైన్
 వెబ్‌సైట్: http://cept.ac.in/
  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్ - గుర్గావ్
 కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్
 అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
 ఎంపిక: అకడమిక్ రికార్డ్, ప్రవేశపరీక్ష ఆధారంగా.
 వెబ్‌సైట్: www.inlead.in
 
 వేతనాలు
 హోదా, పనితీరు, అనుభవంపై ఆధారపడి వేతనాలు ఉంటాయి. హోదా ఏదైనా ప్రారంభ వేతనం రూ.20,000 ఉంటుంది. ఆ తర్వాత  పనితీరు, అనుభవం ఆధారంగా నెలకు రూ.35,000 నుంచి రూ.50,000 వరకు సంపాదిం చొచ్చు. పనిచేసే సంస్థ, కంపెనీని బట్టి కూడా వేతనాలు ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సంస్థలైతే ఎక్కువ జీతాలు ఇస్తాయి.
 
 అవకాశాలకు కొదవ లేదు
 ‘‘ఏ రంగంలో రాణించాలన్నా దాని పట్ల ఆసక్తి ఉండాలి. సామాజిక అభివృద్ధిలో మౌలిక  రంగానిది ప్రధాన పాత్ర. ఈ రంగం పురోగతితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. మన దేశంలో ప్రస్తుతం మౌలిక సదుపాయాల రంగంలో అభివృద్ధి మొదలైంది. సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో ఈ రంగంలో అవకాశాలకు కొదవ లేదు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనగానే కేవలం నిర్మాణంలోనే కాకుండా ఫైనాన్స్, అకౌంటింగ్, టెక్నికల్, మేనేజ్‌మెంట్.. ఇలా ఎన్నో విభాగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో  నిపుణులకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. భవిష్యత్తులో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది.’’
 -కె.మురళీధర్, సీనియర్ ఫ్యాకల్టీ, హెడ్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement