అందుకో.. ఆన్‌లైన్ విజ్ఞానం! | Now, International online courses can be learned from home | Sakshi
Sakshi News home page

అందుకో.. ఆన్‌లైన్ విజ్ఞానం!

Published Fri, Sep 19 2014 12:05 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

అందుకో.. ఆన్‌లైన్ విజ్ఞానం! - Sakshi

అందుకో.. ఆన్‌లైన్ విజ్ఞానం!

మాస్టారు పాఠాలు ఇప్పుడు తరగతి గది నాలుగు గోడలకే పరిమితమవడం లేదు. పాఠశాల విద్యార్థుల ట్యూషన్  క్లాసులు నుంచి స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, బర్క్‌లీ మొదలైన అంతర్జాతీయ విద్యాసంస్థల కోర్సుల వరకు ఇంటి నుంచే నేర్చుకోవచ్చు. ఆర్ట్స్, హ్యుమానిటీస్‌తోపాటు సైన్స్, ఇంజనీరింగ్.. ఇలా మరెన్నో విభాగాల్లో స్వల్పకాలిక కోర్సులూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. పాఠ్యపుస్తకాల రచయితలు, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పాఠాలను నచ్చిన సమయాల్లో ఎక్కడి నుంచైనా వినొచ్చు. నచ్చిన సబ్జెక్టులో పట్టు పెంచుకోవచ్చు.  విద్యార్థి లోకంలో ఈ ఆన్‌లైన్ కోర్సులు ఇప్పుడు విస్తృత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి!
 
 ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు ఆదరణ పెరుగుతుండడంతో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతోపాటు ప్రముఖ కళాశాలలు సైతం ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో చాలా కోర్సులు ఉచితంగానే లభిస్తుండటం గమనార్హం. కోర్సులు అందించే వెబ్‌సైట్‌లో లాగినై పేరు, ఇతర వివరాలు నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఒక్కో కోర్సుకు ఒక్కో విధమైన కాల వ్యవధి ఉంటోంది. వీటి ద్వారా తరగతి గదిలో అర్థం కాని అంశాలను విద్యార్థి ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. ఉద్యోగస్థులు అదనపు నైపుణ్యాలను సొంతం చేసుకుని పదోన్నతులు పొందొచ్చు. అంతేకాకుండా కోర్సు పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్‌ను కూడా అందిస్తున్నాయి. కాబట్టి ఖాళీ సమయాల్లో కొత్త కోర్సు నేర్చుకోవాలనుకునేవారికి ఆన్‌లైన్ కోర్సులు వరంగా మారాయి.
 
 ఎడ్‌ఎక్స్: హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), ఐఐటీ-బాంబే, క్యోటో యూనివర్సిటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలు ఎడ్‌ఎక్స్ ద్వారా 200కుపైగా ఆన్‌లైన్ కోర్సులను ఉచితంగా అందిస్తూ విద్యార్థుల విజ్ఞాన దాహం తీరుస్తున్నాయి. లెక్చర్లు, అసైన్‌మెంట్లు, కోర్సు మెటీరియల్, సంబంధిత వీడియోలు రోజూ 24 గంటలపాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వీలున్నప్పుడల్లా వీటిని నేర్చుకోవచ్చు. ప్రణాళిక ప్రకారం అసైన్‌మెంట్లు, పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌లోనే వీటిని పూర్తిచేయొచ్చు. డిస్కషన్ ఫోరమ్స్, నెట్‌వర్కింగ్ స్పేసెస్‌ల ద్వారా ఫ్యాకల్టీ, ఇతర విద్యార్థులతో చర్చించొచ్చు. కోర్సును విజయవంతంగా పూర్తిచేస్తే ఎడ్‌ఎక్స్ మూడు రకాల సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంది. అవి.. హానర్ కోడ్ సర్టిఫికెట్ ఆఫ్ అఛీవ్‌మెంట్, వెరిఫైడ్ సర్టిఫికెట్ ఆఫ్ అఛీవ్‌మెంట్, ఎక్స్ సిరీస్ సర్టిఫికెట్ ఆఫ్ అఛీవ్‌మెంట్.
 వెబ్‌సైట్: www.edx.org
 
 కోర్స్‌ఎరా: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. సాధారణ విద్యార్థికి సైతం ప్రపంచ స్థాయి విద్యనందించడంలో ‘కోర్స్‌ఎరా’ వెబ్‌సైట్ ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఇది యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, డ్యూక్ యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్ తదితర ప్రముఖ సంస్థల అధ్యాపకుల శిక్షణలో 700లకు పైగా కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సోషల్ సైకాలజీ, మొబైల్ అప్లికేషన్స్, స్టార్టప్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, పబ్లిక్ స్పీకింగ్, డేటా అనాలిసిస్ తదితర విభిన్న స్పెషలైజేషన్లలో కోర్సులను ఆఫర్ చేస్తోంది.
 వెబ్‌సైట్: www.coursera.org
 
 ఎన్‌పీటీఈఎల్ కోర్సులు:
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ), ఏడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-గువహటి, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-రూర్కీ)లు సంయుక్తంగా ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్(ఎన్‌పీటీఈఎల్) పేరిట ఆన్‌లైన్‌లో ఇంజనీరింగ్, సైన్స్ కోర్సులను, సర్టిఫికేషన్లను ఆఫర్ చేస్తున్నాయి. జూన్ 2014 నాటికి ఎన్‌పీటీఈఎల్‌లో 372 వెబ్‌కోర్సులతోపాటు 398 వీడియో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా యాక్సెస్ చేయొచ్చు. వాటిని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
 వెబ్‌సైట్: http://nptel.ac.in/.
 
 పోటీ పరీక్షలకూ ప్రత్యేక కోర్సులు!
 సివిల్ సర్వీసెస్‌తోపాటు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, బ్యాంకులు ఇతర పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్, వీడియో పాఠాలూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఉచితంగా లభిస్తుండగా మరికొన్ని నామమాత్రపు ఫీజును వసూలు చేస్తున్నాయి.
 ఉదాహరణకు http://sakshieducation.com
 
 ట్యూషన్లు లభ్యం
 నర్సరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు వివిధ తరగతుల ట్యూషన్లు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రవేశ పరీక్షలకు అవసరమైన పాఠ్యాంశాలు వీటిలో లభిస్తాయి. మ్యూజిక్, ఆర్ట్ ట్యూష న్లూ ఉన్నాయి. ఫీజులు సైట్లను బట్టి వేర్వేరుగా ఉంటాయి. తక్కువ ఫీజు ఉన్న వెబ్‌సైట్‌ను ఎంచుకోవడం కంటే నాణ్యమైన ట్యూషన్లను ఆఫర్ చేస్తున్న సైట్‌ను ఎంచుకోవాలి. ఉచిత ట్రయల్ సర్వీస్ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు.
 
 సమయం, శ్రమ ఆదా!
 శ్రీ ఆన్‌లైన్ కోర్సులు ఎవరికైనా, ఎక్కడి నుంచైనా నేర్చుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నత విద్యను కొనసాగించాలంటే... రోజుకు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి క్లాస్ రూంలో కూర్చుని పాఠాలు వినే పరిస్థితి ఉండదు. కాబట్టి వారు ఆన్‌లైన్ కోర్సులను ఎంచుకుంటున్నారు. తమకు నచ్చిన సమయంలో ఉదయం వేళలోనో, సాయంత్రం సమయంలోనో ఈ కోర్సులను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల అవసరాలకనుగుణంగా ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే నిపుణులైన అధ్యాపకులు  ఇంటి వద్ద నుంచే తమ జ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకోవాలనుకుంటున్నారు. నామమాత్రపు ఫీజులతోనే వారు పాఠాలు బోధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నిపుణులైన అధ్యాపకుల లేమి సమస్య ఎదురవుతుంటోంది.
 
  వారు ఆన్‌లైన్ కోర్సులను ఉపయోగించుకుని ప్రయోజనం పొందొచ్చు. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కంప్యూటర్, లాప్‌టాప్‌లే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్, టాబ్లెట్ ద్వారా ఈ ఆన్‌లైన్ కోర్సులను నేర్చుకునే సౌలభ్యం ఉంది. కాబట్టి ప్రయాణంలోనూ ఈ కోర్సులను చూడొచ్చు. అన్ని స్థాయిల్లోని విద్యార్థులకు అందుబాటులో ఉండటం ఆన్‌లైన్ కోర్సుల ప్రత్యేకత. పాఠశాల స్థాయిలో రాష్ట్ర సిలబస్‌లతోపాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ట్యూషన్‌లు సైతం ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. జేఈఈ, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలతోపాటు పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులూ ఆన్‌లైన్‌లో ఉన్నాయి ్ణ
     -షర్మిళామురళి, కో-ఫౌండర్, మేనేజింగ్ డెరైక్టర్,  
     www.etuitions.org
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement